ఏడాది పాలన సూపర్ సక్సెస్: పవన్ కల్యాణ్
వైసీపీ పాలనలో అధికారులకు కూడా స్వేచ్ఛలేకుండా పోయిందని, వారు కూడా భయపడుతూ పనులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.;
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సూపర్ సక్సెస్ అయిందని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తమతోపాటు తమ కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా వేధించిందని తెలిపారు. మాతో పాటు ప్రజలను కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిందని.. అందుకే ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో తమ మూడు పార్టీలు కలిసి కట్టుగా ముందుకు వచ్చామని చెప్పారు. దీనిని ప్రజలు గుర్తించి.. తమ పోరాటానికి మద్దతుగా తమను గత ఎన్నికల్లో గెలిపించారని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని అడుగడుగునా నిలబెట్టామని తెలిపారు.
కూటమి ప్రభుత్వానికి ఏడాది నిండిని సందర్భంగా అమరావతిలో నిర్వహించిన ``సుపరిపాలనలో తొలి అడుగుకు ఏడాది`` కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తొలి ఏడాది ప్రభుత్వం విజయవంతంగా పాలన సాగించిందన్నారు. ప్రజలకు సుస్థిరాభివృద్ధి, శాంతిని అందించడంలో సక్సెస్ అయ్యామన్నారు. అభివృద్ధి కోసం అనేక పనులు చేపట్టామని చెప్పారు. 2019లో ఏర్పడిన ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని తెలిపారు. ప్రతి దానికీ పోలీసులను ప్రయోగించిందన్నారు. వైసీపీ హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
వైసీపీ పాలనలో అధికారులకు కూడా స్వేచ్ఛలేకుండా పోయిందని, వారు కూడా భయపడుతూ పనులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఆఖరుకు సీనియర్ నాయకుడు, మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన.. చంద్రబాబును కూడా అనేక రకాలు గా వేధించారని.. చివరకు జైల్లో కూడా పెట్టించారని తెలిపారు. ఇదే మార్పునకు నాంది పలికిందన్నారు. ``వైసీపీ పాలన చూశాక.. ఏపీకి అసలు వెలుగు వస్తుందా? అని అనుకున్నా. కూటమి ప్రభుత్వం ఏర్పడకపోతే.. ఏపీ ఏమయ్యేదో అని అనిపించింది.`` అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో మూడు పార్టీలు కలిసి ముందుకువ చ్చాయని వివరించారు.