పవన్ అన్నా.. నీ టికెట్ నేనిస్తా.. డిప్యూటీ సీఎంకు మంత్రి లోకేశ్ ఆఫర్
ఇక ఆయన వెంటనే ఉన్న పవన్ కల్యాణ్ తాను కూడా ఓ టికెట్ తీసుకోడానికి డబ్బులు చెల్లించే ప్రయత్నం చేశారు.;
హెడ్డింగ్ చదివిన వారి ఓ డౌట్ రావచ్చు. జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ అందరికీ టికెట్ ఇస్తే, ఆయనకు లోకేశ్ టికెట్ ఇవ్వడమేంటి? అని ఎవరైనా సందేహించొచ్చు. అయితే మీ డౌట్ నిజం కాదు.. పవన్ కు టికెట్ ఇస్తానని లోకేశ్ ఆఫర్ చేయడం నిజమే అయినప్పటికీ, ఆ టికెట్ వేరే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ మధ్య చోటుచేసుకున్న ఈ సంభాషణపై నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీసింది. అసలు విషయం ఏంటంటే శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీలో స్త్రీశక్తి పథకం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలో సీఎం నివాసం నుంచి విజయవాడ బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభకు ప్రత్యేక బస్సులో వచ్చారు.
ఉచిత బస్సు పథకం ప్రారంభించడానికి ఉండవల్లిలో ఆర్టీసీ బస్సు ఎక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా టికెట్ తీసుకున్నారు. ఇక ఆయన వెంటనే ఉన్న పవన్ కల్యాణ్ తాను కూడా ఓ టికెట్ తీసుకోడానికి డబ్బులు చెల్లించే ప్రయత్నం చేశారు. తన వద్ద ఉన్న డబ్బుతో విజయవాడ టికెట్ ఇమ్మంటూ పవన్ కండక్టర్ ను కోరగా, ఇంతలో అదే బస్సు ఎక్కిన లోకేశ్.. పవన్ కల్యాణ్ బస్సు టికెట్ డబ్బులను తాను చెల్లిస్తానని కండక్టర్ తో చెప్పారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ బస్సులో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు ఆసక్తిగా వినడం కనిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పవన్, లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉండవల్లి నుంచి విజయవాడకు ప్రత్యేక బస్సులో వచ్చారు. ఈ సందర్భంగా నలుగురు నేతలు ఒకే బస్సులో ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక విజయవాడ బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో కూడా పవన్, లోకేశ్ ఉత్సాహంగా మాట్లాడారు. మంత్రి హోదాలో ముందుగా మాట్లాడిన లోకేశ్.. తనకు అన్నతో సమానమైన పవన్ అన్న అంటూ డిప్యూటీ సీఎంను పిలిచారు. అంతేకాకుండా ప్రతి సందర్భంలోనూ పవన్ కల్యాణ్ ను అన్నయ్యగా పిలవడానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. తన అన్నయ్య డిప్యూటీ సీఎం పవన్, ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతితో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు లోకేశ్ చెప్పడం కూడా సభికులను ఆకట్టుకుంది.
ఈ సంఘటనతో పవన్-లోకేశ్ మధ్య మంచి బాడింగ్ కొనసాగుతోందని మరోమారు వెల్లడైంది. కూటమి ప్రభుత్వంలో దూకుడుగా వ్యవహరిస్తున్న పవన్-లోకేశ్ మధ్య ఇటువంటి సంబంధాలు ఏర్పడతాయని వారి రాజకీయ ప్రత్యర్థులు ఊహించడం లేదని అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య విభేదాలు వస్తే, కూటమి విచ్చిన్నమవుతోందని అప్పుడు తాము రాజకీయంగా పట్టు బిగించొచ్చని వారు ఆశిస్తుంటే.. పవన్-లోకేశ్ మధ్య బాండింగ్ రోజురోజుకు ఎక్కువవుతోందని తాజా సంఘటన ద్వారా మరోమారు రుజువైందని అంటున్నారు.
వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ముందు నుంచే పవన్ పట్ల లోకేశ్ సోదరభావం చాటుకుంటున్నారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉండగా, అప్పటి ప్రభుత్వం అరెస్టు చేయిస్తే, పవన్ బేషరతుగా మద్దతు ప్రకటించి కష్ట సమయంలో అండగా నిలిచారని లోకేశ్ కృతజ్ఞత చాటుకుంటున్నట్లు చెబుతున్నారు. అందుకే సందర్భం వచ్చిన ప్రతిసారి పవన్ ను అన్నా అని పిలవడానికి ప్రాధాన్యమిస్తున్నారని చెబుతున్నారు. ఇక పవన్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ తనకు ఇస్తున్న ప్రాధాన్యంపై సంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే తమ ప్రభుత్వం మరో 15 ఏళ్లపాటు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు చెబుతున్నారు.