వారికి బంపర్ ఆఫర్ అంటున్న పవన్
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పార్టీని బలోపేతం చేయడం మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు.;
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పార్టీని బలోపేతం చేయడం మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. పార్టీలో ఏమి జరుగుతోంది, ఎవరేమిటి అన్నది ఆయన పక్కా సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు కూటమితో జత కట్టి అధికరం అందుకుని ఇరవై నెలల సమయం గడచిపోయింది. పవన్ అయితే ఉప ముఖ్యమంత్రిగా అయిదు కీలక శాఖలతో బిజీగా ఉన్నారు. మరో వైపు చూస్తే పార్టీ బాధ్యతలను తాను చూస్తూనే కీలక వ్యక్తులకు అప్పగించినా గతంలో ఉన్నంత ఊపు అయితే సైనికులలో కనిపించడం లేదని గుర్తించారు అధికారంలో ఉన్నపుడు ఒకింత రిలాక్స్ అవడం సహజం. అయితే ఇది ఆ మాదిరి ఉదాశీనత కాదని అసంతృప్తి కూడా ఉందని పవన్ గ్రహించారు అని అంటున్నారు.
వారే కావాలి అంటూ :
పార్టీ పెట్టినప్పటి నుంచి భుజం భుజం కలిపి ఎంతో శ్రమ చేసి అధికారంలోకి జనసేనను తీసుకుని వచ్చేందుకు అహరహం శ్రమించిన జనసైనికులలో చాలా మంది మౌనంగా ఉంటున్నారు. వారికి పదవులు దక్కలేదు, అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు వస్తాయని వారు భావించారు. అయితే కూటమి ధర్మంతో పాటు పార్టీల బలాబలాలు ఆధారంగా నిష్పత్తి మేరకు జనసేనకు దక్కాల్సిన వాటా దక్కింది. అయితే ఆశావహులు అధికంగా ఉండడంతో అనుకున్న వారికి పెద్దగా అవకాశాలు రాలేదు, దాంతో వారు కొంత నిరుత్సాహ పడ్డారు అలా జనసేనలో చూస్తే ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు అంతా కొంత దిగాలుగా ఉన్నారని గ్రహించిన అధినాయకత్వం వారికి అధిక ప్రయారిటీ ఇవ్వాలని చూస్తోంది అని అంటున్నారు.
కీలక అవకాశాలు :
జనసేన పరంగా వారికి తగిన గుర్తింపుని ఇవ్వాలని అలాగే పార్టీ పదవులలో కష్టించి పనిచేసే వారికి న్యాయం చేయాలని అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు. ప్రస్తుతం సభ్యత్వ కార్యక్రమాలకు తెర తీసిన అధినాయకత్వం ఎవరైతే ప్రజలతో మమేకం అవుతూ జనసేనను మరింతగా బలోపేతం చేసి సభ్యత్వ నమోదుతో చెప్పిన మేరకు లక్ష్యాన్ని సాధిస్తారో వారికి పదవులు ఇవ్వాలని గౌరవించాలని కూడా అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు. ఆ విధంగా పార్టీ పదవులలో న్యాయం చేయడం ద్వారా మునుపటి మాదిరిగా వారిలో చురుకుదనం పుట్టించడమే కాకుండా పార్టీ రేపటి రోజు కోసం వారిని మరింత ఉత్సాహంగా మార్చాలని చూస్తున్నారు.
స్థానిక పోరు మీద :
అంతే కాదు ఈ ఏడాదిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తన వాటా తాను సీట్లను తీసుకుంటుంది. అందులో కూడా పార్టీ కోసం పనిచేసిన వారిని ఎంపిక చేసి వారినే బరిలో నిలబెట్టాలని చూస్తోంది. ఆ విధంగా ఇటు పార్టీలోనూ అటు స్థానికంగా అధికార పదవులలోనూ కష్టించి పనిచేసే వారికే ప్రధమ తాంబూలం అన్నది జనసేన పెద్దలు స్పష్టంగా సందేశం ఇస్తున్నారు. దీంతో జనసేనలో ఇపుడు నూతన ఉత్సాహం వెల్లి విరుస్తోంది. జనసేన తరఫున పనిచేయడానికి కూడా క్యాడర్ లీడర్ మళ్ళీ కదం తొక్కుతున్నారు. తాజాగా పార్టీ సీనియర్ నేతలు క్యాడర్ తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మరీ పార్టీ గురించి వారిని వివరించడమే కాకుండా వారికి అధినాయకత్వం ఏ విధంగా గుర్తింపు ఇస్తుందో వివరించారు. మొత్తానికి చూస్తే మార్చి 14న జరుపుకునే జనసేన ఆవిర్భావ సభ నాటికి జనసేన మళ్ళీ కదం తొక్కుతుందని అంటున్నారు. ఆ మీదట ఇదే స్పూర్తిగా స్థానిక ఎన్నికల్లో సైతం సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేటుని సాధించేలా పార్టీ టార్గెట్ ని ఫిక్స్ చేసుకుంది.