ఎవరు ఆ నలుగురు.. పవన్ నాయకత్వాన్ని సహించలేకపోతున్నారా?

డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" చిత్రం జూన్ 12న విడుదల కావాల్సి ఉంది.;

Update: 2025-05-25 11:00 GMT

డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" చిత్రం జూన్ 12న విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించడం వెనుక కుట్ర కోణం ఉందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభిప్రాయపడ్డారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. అయితే ఇటు రాజకీయంగా అటు సినీ రంగంలో పట్టున్న పవన్ పై కుట్ర పన్నే వారు ఎవర్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కు వ్యతిరేకంగా సినీ రంగంలో పావులు కదుపుతున్న ఆ నలుగురు ఎవరు అన్న విషయం తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు.

తాను సినీ రంగం కోసం ఎంతలా పరితపిస్తున్నా, తన సినిమానే అడ్డుకునే ప్రయత్నం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ సినీ పరిశ్రమ ఇచ్చిన ‘రిటర్న్ గిఫ్ట్’పై థ్యాంక్స్ చెప్పడం కూడా చర్చనీయాంశమవుతోంది. గత ప్రభుత్వానికి ప్రస్తుత తమ ప్రభుత్వ విధానాలను పోల్చి చూడాలని, సినీ రంగం అడగకపోయినా సినిమా రంగం కోసం తమ ప్రభుత్వం ఎంతో చేస్తోందని చెబుతున్న పవన్.. ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదకైనా సినీ పెద్దలు కలవకపోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీంతో సినీ రంగంలో బలమైన పునాదులు ఉన్న నందమూరి కుటుంబం అండదండల కోసం ఆయన ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

తెలుగు చిత్రసీమలో కొన్ని కుటుంబాలదే హవా ఎక్కువ. ప్రధానంగా అన్న ఎన్టీఆర్ కుటుంబంతోపాటు ప్రస్తుతం అగ్ర నటుడుగా చెలామణి అవుతున్న మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ప్రాధాన్యంపై ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు. ఏపీలో ప్రస్తుతం ఈ రెండు కుటుంబాలు కలిసి రాజకీయంగా అడుగులు వేస్తున్నాయి. ఇరుకుటుంబాలకు చెందిన వారే ఏపీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయితే ఇది సినీ రంగంలో ఉన్న మరికొన్ని కుటుంబాలకు కంటగింపుగా మారిందా? అనేది ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. పవన్ సినిమానే అడ్డుకునే ప్రయత్నం చేశారంటే అందుకు బలమైన కారణం ఉందంటున్నారు.

గత కొంతకాలంలో మెగా కుటుంబంతో విభేదిస్తున్న ఓ ప్రధాన నిర్మాత తోపాటు తెలంగాణలో రాజకీయంగా గుర్తింపు తెచ్చుకున్న మరో నిర్మాత, నందమూరి, అక్కినేని కుటుంబాలతో బంధుత్వం ఉన్న ఇంకో నిర్మాణ సంస్థతోపాటు ఇటీవల డిస్టిబ్యూటర్ రంగం నుంచి వచ్చి రాష్ట్రంలో ఎక్కువ థియేటర్లను గుప్పెట పెట్టుకున్న మరో ఎగ్జిబిటర్ సంస్థ చేతులు కలిపాయని అంటున్నారు. ఈ నలుగురు కలిసి పవన్ సినిమాను అడ్డుపెట్టుకుని అధిక లాభాలు కొట్టేయాలనే ఆలోచనతో పవన్ సినిమాకే చెక్ చెప్పాలని భావించాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ప్రస్తుతం ఉన్న అద్దె విధానానికి బదులుగా, మల్టీప్లెక్స్‌ల తరహాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పర్సెంటేజ్ బేస్ విధానాన్ని తేవాలనే డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ తేవడం వల్ల రాష్ట్రంలో ఎక్కువ థియేటర్లు కలిగివున్న కొందరు నిర్మాతలకు మేలు జరుగుతుందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని చర్చించేందుకు తమ అసోసియేషన్ ద్వారా రమ్మని ప్రభుత్వం చెప్పినా, ఆ నిర్మాతలు వినలేదని అంటున్నారు. తాము నలుగురు వచ్చి చర్చిస్తామని చెప్పడంతోనే వివాదం పెద్దైందని అంటున్నారు. అయితే ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా స్పందించడంతో కాస్త వెనక్కి తగ్గారని అంటున్నారు. ప్రస్తుతానికి వివాదం టీ కప్పులో తుఫాన్ లా చల్లారిందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News