కాకినాడలో తొలిసారిగా అన్నా లెజినోవాతో పవన్ కల్యాణ్.. నెట్టింట ఫొటోలు వైరల్
గత ఏడాది డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ రెండో సారి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆగస్టు 15 పండుగలో భాగస్వామ్యులయ్యారు.;
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో జెండా వందనం చేశారు. గత ఏడాది డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ రెండో సారి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆగస్టు 15 పండుగలో భాగస్వామ్యులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో జరిగిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొనగా, పవన్ కాకినాడలో జెండా వందనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో 26 జిల్లాలలో జరిగే స్వాతంత్ర్య వేడుకలకు మంత్రులను ముఖ్య అతిథులుగా ప్రభుత్వం నియమించింది. కాకినాడ జిల్లాను పవన్ కల్యాణ్ కు కేటాయించారు.
కాకినాడ జిల్లా పరిధిలోని పిఠాపురం నియోజకవర్గానికి పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఆయనను ఆ జిల్లాకు ముఖ్య అతిథిగా ప్రభుత్వం కేటాయించింది. కాకినాడలో జరిగిన జెండా వందనం కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తోపాటు ఆయన భార్య అన్నా లెజినోవా కూడా హాజరయ్యారు. రష్యన్ పౌరురాలు అయిన పవన్ భార్య భారతీయ సంప్రదాయ చీరకట్టులో వచ్చారు. గత ఏడాది కార్యక్రమంలో పవన్ పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఈ సారి ఆయన భార్య అన్నా లెజినోవా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. రూ.7,900 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. గత ఏడాది రూ.380 కోట్ల రూపాయలతో పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే సుస్థిర పాలన ఉండాలని, తమ ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో కొనసాగాలని ఆకాంక్షించారు పవన్. ఎంజాయ్ చేయడానికి పదవులు ఉండాలనేది తమ అభిమతం కాదన్నారు.