ఢిల్లీలో పవన్.. ఏంటి పని! మోదీ 'మెగా' ఆఫర్ నిజమేనా?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని డుమ్మాకొట్టి మరీ ఆయన హస్తినకు వెళ్లడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.;
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని డుమ్మాకొట్టి మరీ ఆయన హస్తినకు వెళ్లడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. డిప్యూటీ సీఎం ఇంత ఆకస్మికంగా దేశ రాజధానికి ఎందుకు వెళ్లారా? అంటూ అంతా ఆరా తీస్తున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం, ఈ సమావేశాల్లో ఏపీకి సంబంధించిన కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారం, కేంద్ర కేబినెట్ విస్తరణ వార్తల నడుమ పవన్ ఢిల్లీ పర్యటనపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇటు రాష్ట్రంలోను అటు దేశ రాజధానిలోను పవన్ పర్యటన హాట్ టాపిక్ గా మారింది.
బుధవారం ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. తిరుమల లడ్డూ కల్తీ కేసులో సీబీఐ సిట్ తుది చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత పవన్ కేంద్ర హోంమంత్రిని కలవడం చర్చనీయాంశంగా మారిందని చెబుతున్నారు. అయితే పవన్ పర్యటనకు లడ్డూ కల్తీ కేసుకు సంబంధం లేదని, పవన్ వేరే పనిపైనే ఢిల్లీ వచ్చారని జనసేన పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజధాని అమరావతి బిల్లు ప్రవేశపెట్టనున్న సందర్భంగా కేంద్రంతో చర్చించేందుకు పవన్ ఢిల్లీ వచ్చారంటూ ఒక కథనం ప్రచారం అవుతోంది. అయితే ఇంతకు మించిన ముఖ్యమైన పని కూడా ఉందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
ఈ పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెడుతోంది. ఇందులో జమిలి ఎన్నికలతోపాటు నియోజకవర్గాల పునర్విభజన కూడా ఉందంటున్నారు. అంతేకాకుండా కీలకమైన బడ్జెట్ సమావేశాలు కావడంతో రాష్ట్రానికి నిధులు ఎక్కువ కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పవన్ హస్తిన వచ్చారని చెబుతున్నారు. ఈ ఏడాది దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నందున కేంద్రం ఆయా రాష్ట్రాలకు బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటున్నారు. అయితే ఏపీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిధుల కేటాయింపుల్లో ఎక్కువ ప్రాధాన్యం దక్కేలా కేంద్రం దృష్టిసారించాలని కోరేందుకే పవన్ ఢిల్లీ వచ్చారని చెబుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నందున తన పార్టీకి ఈ సారి ప్రాతినిధ్యం కల్పించాలని పవన్ కోరే అవకాశం ఉందంటున్నారు.
ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర కేబినెట్ ను పునర్వవ్యస్థీకరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పవన్ ఢిల్లీ పర్యటనకు ఇదీ కూడా ఒక కారణం అంటున్నారు. ప్రస్తుతం పవన్ కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీకి మద్దతిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో మూడు పదవులను తీసుకుని చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అయితే కేంద్రంలో జనసేనకు ప్రాతినిధ్యం లేకపోవడం వెలితిగా భావిస్తున్నారని అంటున్నారు. త్వరలో ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నందున తమకు ఒక సీటు కేటాయించడంతోపాటు మంత్రి పదవి ఇవ్వాలని పవన్ కేంద్ర పెద్దలను కోరుతున్నట్లు సమాచారం.
తన సోదరుడు నాగబాబును మంత్రిని చేయాలని పవన్ ఎప్పటి నుంచో చూస్తున్నారు. వాస్తవానికి గత ఏడాది ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాల్సివుంది. అయితే బీజేపీ ఒత్తిడి చేయడంతో నాగబాబుకు కేటాయించాల్సిన రాజ్యసభ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేసి రాష్ట్ర మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. సీఎం చెప్పిన విధంగా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా మంత్రి పదవి కేటాయించలేకపోయారు. అయితే ప్రస్తుతం రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నందున నాగబాబు కోరుకున్న విధంగా ఎంపీగా పంపి ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి కేటాయించేలా ఢిల్లీ పెద్దలను కోరేందుకు పవన్ ఢిల్లీ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందన ఏంటో తెలియాల్సివుంది. మొత్తానికి పవన్ హస్తిన పర్యటన అనేక ఊహాగానాలకు తావిస్తోందని చెబుతున్నారు.