నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నా: దానం

ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ నుంచి 2023 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న దానం నాగేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.;

Update: 2026-01-28 14:16 GMT

ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ నుంచి 2023 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న దానం నాగేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు ఆయ‌న అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌సాద‌రావుకు లేఖ రాశారు. తాను బీఆర్ ఎస్ పార్టీలోనే ఉన్నాన‌ని.. పైగా ఆ పార్టీ త‌న‌ను ఎక్క‌డా స‌స్పెండ్ చేయ‌లేద‌ని.. పోనీపార్టీ నుంచి బ‌హిష్క‌రించ‌నూ లేద‌ని తెలిపారు. ఇలాంటి స‌మ‌యంలో త‌న‌పై విచా ర‌ణ‌, అన‌ర్హ‌త వేటు పేరుతో విచారించ‌డం స‌రికాద‌ని పేర్కొన్నారు. కాబ‌ట్టి.. త‌న‌పై ఉన్న అన‌ర్హ‌త పిటిష‌న్‌ను కొట్టి వేయాల‌ని దానం అభ్య‌ర్థించారు.

కాంగ్రెస్‌లోకి ఎంద‌కంటే..

ఈ సంద‌ర్భంగా దానం నాగేంద‌ర్‌.. తాను కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వానికి ఎందుకు మ‌ద్ద‌తు ఇస్తున్న‌దీ పేర్కొన్నారు. తాను వ్య‌క్తిగ‌తం గాసుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాన‌ని ఆయ‌న తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆపార్టీ ప‌ట్ల ఉన్న అభిమానం, గౌర‌వం కొద్దీ.. 2024లో జ‌రిగిన కాంగ్రెస్ పార్టీ స‌మావేశానికి వెళ్లిన‌ట్టు పేర్కొన్నారు. అయినా.. ఇది పూర్తిగా త‌న వ్య‌క్తి గ‌త‌మ‌ని.. తాను ఎక్కడా కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీనేత‌ల‌తోనూ త‌న‌కు ఎలాంటి బంధం లేద‌ని పేర్కొన్నారు.

కానీ, ఓ వ‌ర్గం మీడియా సృష్టించిన క‌థ‌నాల‌తో త‌న‌పై బీఆర్ ఎస్ పార్టీ చ‌ర్య‌ల‌కు రెడీ అయింద‌ని తెలిసి.. బాధ ప‌డిన‌ట్టు వివ‌రించారు. త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాలంటూ.. బీఆర్ ఎస్ పార్టీ ప్ర‌స్తావించిన ప్ర‌తివిష‌యంపైనా తాను వివ‌రణ ఇస్తున్న‌ట్టు తెలిపారు. గ‌తంలో ప‌లు కేసుల విచార‌ణ స‌మ‌యంలో కోర్టులు అన‌ర్హ‌త పిటిష‌న్ల‌పై తీర్పులు ఇచ్చాయ‌ని.. వాటిని అనుస‌రించి.. త‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం లేద‌న్నారు.``నేను బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేయ‌లేదు. ఆపార్టీ నాపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. అలాంట‌ప్పుడు.. అస‌లు అన‌ర్హ‌త అనే మాటే ఉత్ప‌న్నం కాదు`` అని దానం వివ‌రించారు.

30న విచార‌ణ‌..

మ‌రోవైపు.. త‌న వ‌ద్ద పెండింగులో ఉన్న అన‌ర్హ‌త పిటిష‌న్ల‌పై విచార‌ణ‌ను ఈ నెల 30న పూర్తి చేయాల‌ని స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో దానం నాగేంద‌ర్‌ను విచార‌ణ‌కు రావాలంటూ.. ఆయ‌న ఆదేశించారు. అదేవిధంగా మ‌రోనేత క‌డియం శ్రీహ‌రి పిటిష‌న్ కూడా పెండింగులో ఉంది. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా దానం నాగేంద‌ర్‌.. అస‌లు త‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్రాతిప‌దికే క‌నిపించ‌డం లేద‌ని పేర్కొంటూ.. స్పీక‌ర్‌కు లేఖ రాయ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News