వీసా ఉన్న ఇండియన్ ను వెనక్కి పంపిన యూఎస్ అధికారులు
అమెరికా వెళ్తున్న హెచ్1బి వీసా హోల్డర్లకు సమస్యలు తగ్గడం లేదు. డాక్యుమెంట్స్ అన్ని కరెక్టుగా ఉన్నా.. ఏదో ఒక సాకుతో వెనక్కి పంపుతున్నారు.;
అమెరికా వెళ్తున్న హెచ్1బి వీసా హోల్డర్లకు సమస్యలు తగ్గడం లేదు. డాక్యుమెంట్స్ అన్ని కరెక్టుగా ఉన్నా.. ఏదో ఒక సాకుతో వెనక్కి పంపుతున్నారు. తాజా ఘటన ఇప్పుడు హెచ్1బి వీసా హోల్డర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఇండియా నుంచి యూఎస్ వెళ్తున్న ఓ వ్యక్తిని అబుదాబి ఎయిర్ పోర్టులో అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటక్షన్ అధికారులు అడ్డగించారు. అన్ని రకాల డాక్యుమెంట్స్ సరిగా ఉన్నప్పటికి ఇండియాకు పంపించేశారు. దీంతో ఆ వ్యక్తి తీవ్ర వేదన పడ్డారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అన్ని రకాల తనిఖీలు చేశారని, అక్కడ తెలపని అభ్యంతరం అబుదాబి ఎయిర్ పోర్టులో తెలపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో సరిగా ఉన్న డాక్యుమెంట్స్.. అబుదాబి చేరగానే మారిపోయాయా అన్నది ప్రశ్న. ఇండియా నుంచి బయలుదేరిన సమయంలో వీసా, పాస్ పోర్ట్, డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేశారు. అన్ని సరిగా ఉన్నాయి కానీ అబుదాబిలో మాత్రం అడ్డుకున్నారని సదరు వ్యక్తి వాపోయారు.
వీసా ఉన్నా వెనక్కి..
ఎక్కడ పనిచేస్తారు, ఏ కంపెనీలో పనిచేస్తారు, అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్, జీతం చెల్లించిన వివరాలు ఇలా అన్నింటిని అధికారులు తనికీ చేశారు. అన్ని సరిగా ఉన్నాయి. కానీ ఇటీవల ఆ వ్యక్తి కంపెనీ మారారు. పాత కంపెనీ పేరే వీసా స్టాంపింగ్ లో ఉంది. దీనిని అడ్డంపెట్టి ఆ వ్యక్తిని అబుదాబి ఎయిర్ పోర్టులో యూఎస్ అధికారులు అడ్డుకుని వెనక్కి పంపించారు. అదే సమయంలో వీసా పరిమితి మార్చి 2026 వరకే ఉందని, వీసా పొడిగింపు పూర్తయిన తర్వాతే వెళ్లాలని సూచించారు. పనిచేస్తున్న కంపెనీతో సహా అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉన్నప్పటికీ, వీసా కాలపరిమితి త్వరలో ముగుస్తుందన్న కారణంతో పాటు, వీసా స్టాంపింగ్ లో కొత్త కంపెనీ పేరు లేదని వెనక్కి పంపారు. దీనిపై హెచ్1బీ వీసా కమ్యూనిటీలో ఆందోళన నెలకొంది. ఒకవేళ వీసా స్టాంపింగ్ లో కంపెనీ మార్చుకోవడానికి వెళ్తే.. నెలలు, సంవత్సరాలు పడుతోంది. వీసా స్టాంపింగ్ ప్రక్రియ పూర్తీగా ఆలస్యం అవుతోంది. ఈ కారణంగా చాలా ఇంటర్వ్యూ స్లాట్లు వెనక్కి వెళ్తున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో హెచ్1బి వీసా హోల్డర్లు ఉన్నారు. ఒకవైపు వీసా స్టాంపింగ్ ప్రక్రియలో జరుగుతున్న జాప్యం, మరోవైపు ప్రీక్లియరెన్స్ పేరుతో జరుగుతున్న అన్యాయం అమెరికా వెళ్తున్న వారికి నిద్ర పట్టనివ్వడంలేదు.
యూస్ అధికారులు ఏం చెబుతున్నారు ?
వీసా స్టాంపింగ్ లో కంపెనీ పేరు మార్చుకోవాలని చెబుతున్నారు. అప్ డేట్ లేకుండా ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నారు. అదే సమయంలో వీసా కాల పరిమితి పొడిగించుకున్న తర్వాత ప్రయాణం చేయాలంటున్నారు. లేదంటే వెనక్కి పంపుతామని చెబుతున్నారు. కానీ వీసా స్టాంపింగ్ స్లాట్స్ అందుబాటులో లేకపోవడంతో ఇండియన్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. కానీ యూస్ అధికారులు మాత్రం సమస్య వెల్లడించినా తమ వైఖరి మార్చుకోవడం లేదు.
యూఎస్ తీరే కారణం..
అటు వీసా స్టాంపింగ్ ఆలస్యం కావడానికి యూస్ తీరే కారణం. సోషయల్ మీడియా వెట్టింగ్ పేరుతో ఒక్కో దరఖాస్తు పరిశీలనకు చాలా సమయం పడుతోంది. దీని వల్ల స్లాట్స్ అనుకున్న సమయంలో అందుబాటులో ఉండటం లేదు. ఆలస్యం కావడమో, లేదా అందుబాటులో లేకపోవడమో జరుగుతోంది. ప్రిక్లియరెన్స్ పేరుతో ఇదే యూఎస్ అధికారులు వెనక్కి పంపుతున్నారు.