ట్రంప్ హెల్త్ కండీషన్ బాలేదా? అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడా?
తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు ట్రంప్ సమాధానం ఇచ్చారు. తన ఆరోగ్యం బాగుందని, ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.;
తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు ట్రంప్ సమాధానం ఇచ్చారు. తన ఆరోగ్యం బాగుందని, ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా వస్తున్న అనారోగ్య సమస్యల వల్ల ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అంటూ న్యూయార్క్ మ్యాగ్జైన్ ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇచ్చారు. తన తండ్రి అల్జీమర్స్ తో బాధపడ్డారని, తనకు అలాంటి సమస్య లేదని చెప్పారు. నలబై ఏళ్ల క్రితం ఎలా ఆరోగ్యంగా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నానని స్పష్టం చేశారు. అల్జీమర్స్ గురించి మాట్లడుతున్న సమయంలో ఆ వ్యాధి పేరు గుర్తు తెచ్చుకోవడానికి ట్రంప్ కొంత ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంగా, బలంగా ఉన్నారని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అమెరికా సేనల సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేయడానికి అవరసమైన శారీరక సామర్థ్యం ఆయనకు ఉందని పేర్కొంది. ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని మీడియాను కోరింది.
ట్రంప్ ఆరోగ్యంపై ఉన్న వార్తలేంటి ?
ట్రంప్ ఆరోగ్యం సరిగా లేదంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తలను అటు ట్రంప్, ఇటు వైట్ హౌస్ ఖండిస్తూనే ఉన్నాయి. ప్రచారం మాత్రం ఆగలేదు. దీంతో మరోసారి వైట్ హౌస్ స్పందించి, తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరింది. ట్రంప్ కు అల్జీమర్స్ తో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ట్రంప్ తన ఆరోగ్య స్థితిని దాస్తున్నారంటూ కూడా ప్రచారం ఉంది. 2025లో ఒకసారి విలేకరులతో మాట్లాడినప్పడు తాను ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నట్టు ట్రంప్ చెప్పారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేనట్టు వచ్చిందని చెప్పారు. కానీ ఆ తర్వాత తాను ఏ భాగంలో స్కాన్ చేయించుకుంది చెప్పలేకపోయారు. కానీ ఆయన చేయించుకుంది సిటి స్కాన్ అని వైద్యులు తెలిపారు. అది ఆయన కడుపు భాగం, ఛాతీ భాగంలో చేశారు. అదే సమయంలో ఆయన చేతి వెనక చర్మం తరుచూ కమిలినట్టు కనిపిస్తోంది. దీనిపైన వైట్ హౌస్ స్పందించి.. తరుచు షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల, ఆస్పిరిన్ వాడటం వల్ల అలా జరిగిందని చెప్పుకొచ్చింది. ఇటీవల ట్రంప్ విలేకరులతో మాట్లాడినప్పుడు అదే ప్రశ్న వేశారు. టేబుల్ కు చేతిని కొట్టడం వల్ల , లేదంటే ఆస్పిరిన్ ఎక్కువగా వాడటం వల్ల చర్మం కమిలిపోయి ఉండవచ్చని ట్రంప్ మాట్లాడారు. దీంతో ఆయనకు మతిమరుపు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
అల్జీమర్స్ అంటే ?
అల్జీమర్స్ అంటే మతిమరుపు వ్యాధి. జరిగిన ఘటనలు మరిచి పోతుంటారు. సమయం, గుర్తింపు, ప్రదేశం గురించి గందరగోళం. సరైన పదాల ఎంపికలో ఇబ్బంది. సరైన మాటలు ఉపయోగించడంలో ఇబ్బంది పడతారు. తెలిసిన వ్యక్తులను గుర్తించడంలో ఇబ్బందిపడటం. మనిషిలో ఆందోళన, నిరాశ, కల్లోలం కనిపిస్తుంది. అభిరుచులు, సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి తగ్గడం. ప్రధానంగా అల్జీమర్స్ మెదుడు కణాల మరణం వల్ల వస్తుంది. క్రమంగా మొదుడు పనితీరును, జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది.