అన్ని చూసిన తరువాతనే వేటు...ఇదే పవన్ పొలిటికల్ రూట్
జనసేనలో ఇటీవల కాలంలో వరుస సస్పెన్షన్లు మంట పుట్టించాయి అదేంటి ఒక్క మాటకే అలా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.;
జనసేనలో ఇటీవల కాలంలో వరుస సస్పెన్షన్లు మంట పుట్టించాయి అదేంటి ఒక్క మాటకే అలా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పెద్ద శిక్ష విధించేశారే అని అంతా అనుకోవడం మొదలుపెట్టారు. మాట్లాడితే వేటా ఇదెక్కడి చోద్యం అని ముక్కున వేలు వేసుకున్న వారు కూడా ఉన్నారు. మరి కొందరు అయితే ఇలా వేటు వేసుకుంటూ వెళ్తే ఇబ్బందే మరి అని వ్యాఖ్యానించారు.
ఇంతకీ జనసేనాని పవన్ కళ్యాణ్ నోరు విప్పితే వేటు వేస్తున్నారా ఆయన పార్టీలో గొంతుకలను మాట్లాడనీయడం లేదా తొందరగా సస్పెన్షన్లు చేస్తున్నారు అంటే వారికి అన్యాయం జరుగుతోంది కదా వారి గోడు వినేవారు లేరా అన్న చర్చ సైతం సాగుతోంది.
దానికి పవన్ తనదైన శైలిలో బదులిచ్చారు. ఇంకా చెప్పాలీ అంటే వేగంగా వేటు వేస్తున్నారు అన్న దాని మీద ఆయన మౌనం వీడారు. వేటు వేయడంలో తొందర పడటం లేదు అని ఆయన చెబుతున్నారు. హద్దు ఎవరైనా మీరితే మాత్రం తప్పనిసరిగా చర్యలు ఉంటాయని అన్నారు. ఒక నాయకుడి మీద వేటు పడే ముందు ఆయనకు చాలా సమయం ఇస్తున్నామని చెప్పారు.
వారికి చెప్పాల్సింది చెబుతున్నామని అక్కడికీ మారకపోతే మాత్రం కచ్చితంగా సస్పెన్షన్ చేయడమే మార్గం అని ఆయన అంటున్నారు. ఈ విషయంలో తాను కఠినంగానే వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు. ఎందుకంటే తాను జనసేనను కొన్ని సూత్రాలు అధారంగా నడుపుతున్నాను అని చెప్పారు. అంతే కాదు పార్టీ అంటే కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయని ఆయన అంటున్నారు.
ప్రతీ ఒక్కరూ వచ్చి అధికారం కోసమో మరో దానికోసమో ఆలోచిస్తూ చేతులు దులుపుకుంటే కనుక పార్టీని నడపడంలో అర్థం లేదని ఆయన అన్నారు. అపుడు ఏకంగా పార్టీని మూసివేయడమే మంచిదని ఆయన అన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు కానీ మరెవరు కానీ పార్టీ లైన్ లోనే నడవాలన్నది విధానంగా ఉందని చెప్పారు.
అలా చేయకుండా ఎవరైనా గీత దాటితే కఠినంగా వ్యవహరించడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో తాను ఉప ముఖ్యమంత్రిగా ఎంతో సంతృప్తిగా ఉన్నాను అని ఆయన అన్నారు. నిజానికి ఈ ప్రశ్న పవన్ కే షాకింగ్ గా ఉందిట. అలా ఎందుకు అన్నదే ఆయన జవాబు. తాను ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయిస్తాను అని ఆయన చెప్పారు. అయితే తన మౌనానికి రకరకాలైన అర్ధాలు వెతుకుతూ ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు.
తాను కీలక పదవిలో ఉన్నా తరచూ మాట్లాడాల్సినది ఏదీ లేదని ఆయన అన్నారు. అవసరం అయినపుడు కచ్చితంగా తాను మాట్లాడుతాను అని ఆయన చెప్పారు. అలా బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలలో కూడా తాను పూర్తిగా సంతృప్తి చెందే దేని మీద అయినా స్పందిస్తాను అన్నారు.
మరో వైపు వైసీపీ అధినేత జగన్ రప్ప రప్ప వ్యాఖ్యాల గురించి పవన్ రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మనం అంతా ప్రజాస్వామిక యుగంలో ఆధునిక యుగంలో ఉన్నామని అన్నారు. అయితే జగన్ అండ్ కో మధ్యయుగంలో ఇంకా జీవిస్తున్నామని అనుకుంటున్నారా అని పవన్ ప్రశ్నించారు. అలా అయితే వారు బయటకు వచ్చి ఏమి చేయగలరో చేయనివ్వండి అని పవన్ అన్నారు. అపుడు జనాలు కూడా తాము ఏమి చేయగలమో చేసి చూపిస్తారని చెప్పారు.
రాజకీయ ప్రత్యర్ధులను పొడిచి నరికి చంపుతామని అంటే ప్రజలు సహించి ఊరుకుంటారా అని పవన్ ప్రశ్నించారు. సమాజానికి సంఘానికి వ్యతిరేకమైన చర్యలకు ఎవరు దిగినా అది తప్పు. దానిని సమాజం ఎపుడూ సహించేది ఉండదని పవన్ అన్నారు. మొత్తానికి పవన్ చాలా విషయాల మీద తన మనసుని విప్పేశారు. ఎవరికైనా ఎనీ డౌట్స్.