కన్నడలో మాట్లాడి.. కన్నడిగులను మెప్పించి.. డిప్యూటీ సీఎం పవన్ కీలక అడుగు
కుంకీ ఏనుగులతో గజరాజుల బెడద తగ్గించొచ్చని తెలుసుకుని కర్ణాటక నుంచి ఆరు శిక్షణ పొందిన కుంకీలను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా గత ఆగస్టులో ప్రయత్నాలు ప్రారంభించారు.;
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక అడుగు వేశారు. ఎన్నో ఏళ్లుగా రాష్ట్రాన్ని వేధిస్తున్న గజరాజుల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. కర్ణాటక నుంచి ఆరు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను రాష్ట్రానికి రప్పించడంలో తీవ్రంగా కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ బుధవారం కర్ణాటక వెళ్లి వాటిని రాష్ట్రానికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సమావేశంలో కన్నడ భాషలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్ ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యతోపాటు ఇతర మంత్రులు, సీనియర్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేశారు.
కర్ణాటక నుంచి తీసుకువస్తున్న ఏనుగుల సంరక్షణ బాధ్యతలను తాను వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గజరాజుల సమస్య పరిష్కారానికి సహకరించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కుంకీ ఏనుగుల కోసం ఏపీలో ప్రత్యేక సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుంకీలకు ఎలాంటి ప్రమాదం జరిగినా తాను బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఇలాంటి సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో గజరాజుల బెడద ఎక్కువగా ఉంది. ఏనుగుల గుంపు గ్రామాల్లోకి వస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. చాలా ఏళ్లుగా ఈ సమస్య సరిహద్దు గ్రామాల వారిని వేధిస్తున్నా ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సివస్తోంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి ఏనుగుల తరలింపునకు ఆపరేషన్ గజ పేరుతో రెండు దశాబ్దాల క్రితం తీవ్ర ప్రయత్నాలు జరిగినా, ఆ ఆపరేషన్ ఫలితం ఇవ్వలేదు. ఇక అప్పటి నుంచి ఏనుగులు వస్తే అలర్ట్ అవ్వడమే తప్ప మరో మార్గం కనిపించక అటవీశాఖ నిస్సహాయంగా మారిపోయింది. మరోవైపు ఏనుగులు ఆహారం కోసం అడవి నుంచి గ్రామాల్లోకి వస్తున్నాయి. చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ సమస్య తరచూ ఉత్పన్నమవుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ తోపాటు అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ సరిహద్దు ప్రజల బాధలను అర్థం చేసుకున్నారు. కుంకీ ఏనుగులతో గజరాజుల బెడద తగ్గించొచ్చని తెలుసుకుని కర్ణాటక నుంచి ఆరు శిక్షణ పొందిన కుంకీలను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా గత ఆగస్టులో ప్రయత్నాలు ప్రారంభించారు. వ్యక్తిగతంగా చొరవ తీసుకుని కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరపడం ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు.
వాస్తవానికి మన రాష్ట్రంలోనూ రెండు కుంకీ ఏనుగులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఉన్న ఆ రెండు కుంకీ ఏనుగుల వయసు 60 ఏళ్లు దాటడంతో గజరాజులను ఎదుర్కొలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కర్ణాటక నుంచి వచ్చే ఏనుగులతో సమస్య పరిష్కరించే వీలుందని అంటున్నారు. రాష్ట్రానికి మొత్తం ఆరు కుంకీ ఏనుగులు వస్తుండగా, అందులో నాలుగు ఏనుగులను చిత్తూరు జిల్లా పలమనేరులో ఏర్పాటు చేసిన ఎలిఫెంటు క్యాంపులో ఉంచనున్నారు. మిగిలిన రెండింటిని తిరుపతి జ్యూలో ఉంచుతారని చెబుతున్నారు. కుంకీ ఏనుగుల కోసం పలమనేరులో 50 ఎకరాల్లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. అక్కడ వాటికి ఆహారం, తాగునీరు, ఆస్పత్రి వంటి సకల సదుపాయాలు కల్పించారు.