సీఎం గా పవన్ ...అదన్న మాట మ్యాటర్ !

పవన్ కళ్యాణ్ ని సీఎం అని అభిమానులు కేకలు వేస్తూ నినాదాలు చేస్తూ ఉంటారు. తమ అభిమాన వెండితెర కథానాయకుడు సీఎం కావాలన్నది వారి ఆశ.;

Update: 2025-07-19 12:18 GMT

పవన్ కళ్యాణ్ ని సీఎం అని అభిమానులు కేకలు వేస్తూ నినాదాలు చేస్తూ ఉంటారు. తమ అభిమాన వెండితెర కథానాయకుడు సీఎం కావాలన్నది వారి ఆశ. అది ఈ రోజున కాదు, 2014 నుంచే వారు అలా నినాదాలు ఇస్తూనే ఉన్నారు. అయితే 2024 నాటికి అందులో ఎంతో కొంత ఫలించి పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. మరి అక్కడ నుంచి సీఎం గా ప్రయాణం ఎంత దూరం ఎంతకాలం అంటే దానికి జవాబు అయితే ఎవరికీ దొరకదు. కానీ ఏదో నాటికి తన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి అయి తీరుతారు అన్నది మాత్రం అభిమాన జనం పెట్టుకున్న విశ్వాసం.

ఇవన్నీ పక్కన పెడితే గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాలలో ఒక వార్త వైరల్ అవుతోంది. అది ఇంతకు ఇంతగా పెరిగి పెద్దదై భారీ ప్రచారంగా అవుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అని. అది కూడా కొద్ది రోజులలోనే. నిజంగా జనసైనికులకు పవన్ ఫ్యాన్స్ కి ఈ వార్త చాలా ఆనందం కలిగించేదే. అదెలా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ సహా ముఖ్య నేతలు అంతా ఈ నెల 26 నుంచి ఒక అయిదారు రోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు.

అంటే బాబు సీఎం అయిన తరువాత ఇది రెండవ విదేశీ పర్యటన అనుకోవాల్సి ఉంది తొలిసారి ఆయన పెట్టుబడుల కోసం విదేశీ పర్యటన చేశారు. అపుడు కూడా బాబు లోకేష్ సహా కీలక నేతలు వెళ్లారు ఈసారి కూడా సింగపూర్ కి బాబు అండ్ మినిస్టర్స్ వెళ్తున్నారు. అయితే ఇక్కడ బాబు విదేశీ టూర్ కంటే పవన్ సీఎం అన్న వార్త హైలెట్ అయింది.

బాబు లేని అయిదారు రోజుల పాటు ఏపీలో పాలనాపరమైన వ్యవహారాలు చూసుకునేందుకు ఇంచార్జిగా పవన్ కి బాధ్యతలు అప్పగిస్తారు అన్నది వా వార్త సారాంశం. ఇది ఎలా వ్యాపించిందో తెలియదు కానీ పవన్ సీఎం అంటూ వైరల్ చేశారు. కొద్ది రోజుల పాటు అయినా పవన్ సీఎం గా పీఠమెక్కుతారు అని కూడా ప్రచారం చేసుకొచ్చారు.

అయితే అది అలా జరగదని అంటున్నారు. బాబు విదేశాలకు వెళ్ళినా అక్కడ నుంచే పాలనను చేస్తారు అని అంటున్నారు. అన్నీ ఆయన విదేశం నుంచే ఆపరేట్ చేస్తారు అని అంటున్నారు. బాబు ఇపుడే కాదు, గతంలో సీఎం గా ఉన్నపుడు కూడా తన బదులుగా ఒకరో ఒకరిని ఇంచార్జిగా నియమించి బాధ్యతలు అప్పగించిన దాఖలాలు లేవని అంటున్నారు.

పైగా బాబు టెక్నాలజీలో నిష్ణాతుడు. ఆయన అందరి కంటే ఎక్కువగా వాడుతారు. అలాంటి బాబు ఏ దేశంలో ఉన్న రియల్ టైం గవర్నెన్స్ అందించే సామర్థ్యం సత్తా ఆసక్తి అన్నీ కలిగి ఉన్నారని అంటున్నారు. అది గతంలో కూడా ఎన్నో సార్లు రుజువు అయింది.

అందువల్ల ఈసారి కూడా బాబు సింగపూర్ టూర్ లో తానే మొత్తం ఏపీ పాలనా వ్యవహారాలు మోనిటరింగ్ చేసుకుంటారు అని అంటున్నారు. ఆ మాటకు వస్తే ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరిగాక దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఏ సీఎం కూడా తన విదేశీ పర్యటనలకు వెళ్ళినపుడు ఇంచార్జి బాధ్యతలు అని ఎవరికీ అప్పగించడం లేదు అని గుర్తు చేస్తున్నారు.

ఎవరు ఎక్కడ నుంచి అయినా చాలా ఈజీగా ఆపరేట్ చేసే టెక్నాలజీ వచ్చిన నేపథ్యంలో అంతా అలాగే చేస్తున్నారు. సో పవన్ కి సీఎం గా కొన్ని రోజుల పాటు బాధ్యతలు ఇస్తారు అన్నది ఒక ప్రచారం మాత్రమే అని అంటున్నారు. జనసేన క్యాడర్ లో ఆశలు రేపి కూటమి మధ్యన ఉన్న మంచి వాతావరణాన్ని దెబ్బ తీసేందుకు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు అని కూడా అంటున్నారు. అదన్న మాట మ్యాటర్.

Tags:    

Similar News