తమిళనాడులో కింగ్ మేకర్లు తెలుగు ఓటర్లే.. వెరీ ఇంట్రెస్టింగ్!

తమిళనాడులో ఉత్కంఠ రేకెత్తిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లే కింగ్ మేకర్లు అన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.;

Update: 2026-04-21 15:11 GMT

తమిళనాడులో ఉత్కంఠ రేకెత్తిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లే కింగ్ మేకర్లు అన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 50 నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్ల తీర్పు అత్యంత కీలకంగా చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో మొత్తం ఓటర్లలో దాదాపు 1.5 కోట్ల మంది తెలుగు మూలాలు ఉన్నవారే అంటున్నారు. దీంతో తమిళనాట తెలుగు వారిని ఆకట్టుకునేలా ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయని అంటున్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడులో మాతృభాషగా తెలుగు మాట్లాడేవారు సుమారు 45 లక్షల మంది నివసిస్తున్నట్లు అంచనా. ఇక దశాబ్దాల క్రితమే తమిళనాడుకు వలస వెళ్లి ప్రస్తుతం తమిళం మాట్లాడుతున్నా, ఇంట్లో తెలుగు మూలాలు ఉన్నవారి సంఖ్య దాదాపు ఒక కోటి వరకు ఉంటుందని చెబుతున్నారు. వీరంతా తాము తెలుగు వారమని చెప్పుకోడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారని అంటున్నారు. దీంతో పార్టీలు సైతం తెలుగు మూలాలు ఉన్న ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహాలు రచిస్తున్నాయని చెబుతున్నారు.

ఎన్నడూ లేనట్లు ఈ సారి త్రిముఖ పోటీ ఉండటంతో ప్రతి ఓటు అత్యంత కీలకంగా మారిందని చెబుతున్నారు. ప్రధానంగా తెలుగు వారు శాసించే 50 నియోజకవర్గాల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఎక్కువ ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాలతోపాటు చెన్నై, కోయంబత్తూర్, తిరువళ్లూరు, హోసూరు వంటి నగరాల్లో ఎక్కువగా తెలుగు వారి ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ ప్రతి ముగ్గురు లేదా నలుగురిలో ఒకరు తెలుగు మాట్లాడే వారు ఉంటారని రికార్డులు చెబుతున్నాయి. దీంతో తెలుగు వారి నిర్ణయమే పార్టీల తలరాతను మార్చే అవకాశం ఉందని అంటున్నారు.

సహజంగా తమిళనాడులో తమిళ స్వాభిమానం ఎక్కువగా ఉంటుంది. తమ భాష, ప్రాంతంపై తమిళులు అమితమైన ప్రేమాభిమానాలు చూపుతారు. అయితే ఈ ఎన్నికల్లో తమిళలుతో సమానంగా తెలుగు వారికి ప్రాధాన్యం పెరిగిందని అంటున్నారు. ఈ కారణంగానే ఈ సారి పార్టీలు తెలుగు నేతలకు ఎక్కువ టికెట్లు ఇచ్చాయని చెబుతున్నారు. డీఎంకే 17, అన్నాడీఎంకే 22 చోట్ల తెలుగు నేతలను పోటీకి నిలపడం వెనుక తెలుగు వారిని మచ్చిక చేసుకునే వ్యూహమే ఉందని విశ్లేషిస్తున్నారు.

మరోవైపు తెలుగు వారిని ఆకట్టుకునేలా పార్టీలు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నేతలను ప్రచారంలో భాగస్వామ్యం కల్పించాయి. ఎన్డీఏ తరఫున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత రెండు రోజులుగా ప్రచారం చేస్తుండగా, అధికార డీఎంకేకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు మాజీ మంత్రి రోజా వీడియోలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు పూర్తిగా తెలుగులో మాట్లాడుతూ, తన ప్రచారాన్ని కొనసాగించగా, రోజా తమిళంలో అనర్గళంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్టాలిన్ కు మద్దతు ఇవ్వాలని కోరుతుండటం విశేషంగా చెబుతున్నారు.

Tags:    

Similar News