80% నేతల ఫోన్లలో పో*ర్న్ వీడియోలే? పప్పు యాదవ్ వ్యాఖ్యల వెనుక చేదు నిజాలేమిటి?

రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని వింటుంటాం కానీ, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎంపీ నేరుగా తన తోటి ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ప్రవర్తనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.;

Update: 2026-04-23 09:41 GMT

రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని వింటుంటాం కానీ, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎంపీ నేరుగా తన తోటి ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ప్రవర్తనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. బిహార్‌కు చెందిన పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ నాయకుల నైతికతను ప్రశ్నిస్తున్నాయి.

నాయకులు అంటే సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి. కానీ, పూర్నియా ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘80 శాతం మంది రాజకీయ నేతలు సె*క్స్ వీడియోలు చూస్తారు’ అని ఆయన చేసిన ఆరోపణ, కేవలం వ్యక్తిగత విమర్శ కాదు.. అది నేటి రాజకీయ వ్యవస్థలోని అంతర్గత స్థితిగతులకు అద్దం పడుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ మొదలైన ఈ తరుణంలో, మహిళా నేతల ఎదుగుదల వెనుక చీకటి కోణాలు ఉన్నాయని ఆయన ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం రేపింది.

మహిళా రిజర్వేషన్లు, పడక గది రాజకీయాలు!

మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే ‘ఎవరో ఒకరి పడక గదిలోకి వెళ్లాల్సిందే’ అని పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బిహార్ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించి ఆయనకు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని, తన వద్ద ఉన్న సాక్ష్యాలను బయటపెడతానని ఆయన హెచ్చరించడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. 755 మంది నేతలపై లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయన్న ఆయన మాటలు, రాజకీయాల్లో మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. కావాలంటే అందరి ఫోన్లూ చెక్ చేయండి’ అని పప్పు యాదవ్ విసిరిన సవాల్ ఒక వింత పరిస్థితిని సృష్టించింది. చట్టసభల్లో ఉండి ప్రజల సమస్యలు చర్చించాల్సిన వారు, సెక్స్ వీడియోల పట్ల ఆసక్తి చూపడం నైతిక పతనానికి నిదర్శనం. గతంలో కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ జరుగుతుండగానే నేతలు పోర్న్ చూస్తూ దొరికిపోయిన ఉదాహరణలు ఉన్నాయి. తన ఫోన్ కూడా చెక్ చేసుకోమని ఆయన అనడం ద్వారా, తాను చెప్పేది అక్షర సత్యమని ఆయన వాదిస్తున్నారు.

మహిళలు రాజకీయాల్లో ఎదగాలంటే పురుషుల ఆధిపత్యం ఉన్న వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సీటు దక్కించుకోవాలన్నా, పదవి పొందాలన్నా వారు తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారన్నది కాదనలేని వాస్తవం. లైంగిక వేధింపుల కేసులు ఉన్న నేతలు చట్టసభల్లో కూర్చోవడం వల్ల, మహిళలకు సంబంధించిన చట్టాలు ఎంతవరకు సమర్థవంతంగా అమలువుతాయనేది పెద్ద ప్రశ్న.

పప్పు యాదవ్ వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నప్పటికీ, అవి రాజకీయాల్లో ఉన్న విషపూరిత సంస్కృతిని ఎండగడుతున్నాయి. 80 శాతం మంది అలా ఉన్నారని ఆయన చెప్పిన లెక్క నిజమా? కాదా? అన్నది పక్కన పెడితే, రాజకీయ నేతల్లో నైతిక విలువలు నశించిపోతున్నాయన్నది మాత్రం స్పష్టం అవుతోంది. ఇలాంటి వివాదాలు కేవలం టీవీ చర్చలకే పరిమితం కాకుండా, రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో.. ప్రవర్తన నియమావళిలో కఠిన మార్పులు తీసుకురావడానికి కారణం కావాలి.

Tags:    

Similar News