డెడ్‌లైన్ వ‌చ్చేస్తోంది.. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 'సేమ్‌ వివాదం'!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే త‌ర‌హా వివాదం ప్ర‌భుత్వాల‌ను కుదిపేస్తోంది. అయితే.. ఇది రెండు రాష్ట్రాల్లోనూ సేమ్ స‌మ‌స్యే అయినా.. ఉమ్మడి వివాదం అయితే కాదు.;

Update: 2025-11-20 03:54 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే త‌ర‌హా వివాదం ప్ర‌భుత్వాల‌ను కుదిపేస్తోంది. అయితే.. ఇది రెండు రాష్ట్రాల్లోనూ సేమ్ స‌మ‌స్యే అయినా.. ఉమ్మడి వివాదం అయితే కాదు. అదే.. గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు. గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సంబంధించి గ‌డువు రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద ఇబ్బందిగా మారింది. తెలంగాణ‌లో అయితే.. గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిన గ‌డువు.. ముగిసి పోయి ఏడాదిన్న‌ర అయింది. ఇక‌, ఏపీలో వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌తో ముగియనుంది. అయితే.. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఈ వ్య‌వ‌హారం ఎందుకు స‌మ‌స్య‌గా మారింద‌నేది చ‌ర్చ‌.

కేంద్రప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన 15వ ఆర్థిక సంఘం దేశ‌వ్యాప్తంగా గ్రామ పంచాయ‌తీలకు నిధులు ఇవ్వాల‌ని సిఫ‌ర‌సులు చేస్తుంది. ఈ ఆర్థిక సంఘం గ‌డువు మార్చి 31తో ముగిసిపోతుంది. ఇప్ప‌టికే 16వ ఆర్థిక సంఘం త‌న నివేదిక‌ను రాష్ట్ర‌ప‌తికి అందిం చింది. ఈ నేప‌థ్యంలో మార్చి 31 నాటికి పంచాయ‌తీల్లో పాల‌న కొన‌సాగితున్న‌ట్టుగా.. గ్రామ స‌భ‌లు, పంచాయ‌తీ కార్యక‌లాపాలు కొన‌సాగుతున్న‌ట్టుగా చూపిస్తేనే కేంద్రం నుంచి నిధులు వ‌స్తాయి. ఈ లెక్క‌న తెలంగాణ‌కు 3600 కోట్ల రూపాయ‌లు, ఏపీకి 4200 కోట్ల రూపాయ‌లు ఆర్థిక సంఘం నిధులు ఇవ్వాల‌ని సిఫారసుచేసింది.

ఏపీకి ఈ విష‌యంలో ఇబ్బంది లేక‌పోయినా.. గ‌డ‌బిడ అయితే కొన‌సాగుతోంది. ఎందుకంటే.. చాలా గ్రామ పంచాయ‌తీలు వైసీపీ అధీనంలో ఉన్నాయి. అంటే..ఆ పార్టీ సానుభూతిప‌రుల చేతిలో ఉన్నాయి. దీంతో గ్రామ స‌భ‌లు, పంచాయ‌తీ కార్య‌కలాపాల‌ను స‌రిగా నిర్వ‌హించ‌డం లేద‌న్న వాద‌న ఉంది. దీంతో కేంద్రం నుంచి వ‌చ్చే నిధుల‌కు గండి ప‌డే అవ‌కాశం ఉంది. గ‌త ఏడాది కూడా.. కేవ‌లం 1150 కోట్లు మాత్ర‌మే రాష్ట్రంలోని గ్రామాల‌కు అందాయి. ఇక‌.. మార్చి 31 వ‌ర‌కే గ‌డువు ఉండ‌డంతో ఏపీ స‌ర్కారు ఇప్పుడు పంచాయ‌తీల్లో స‌భ‌లు నిర్వ‌హించేలా, కార్య‌క‌లాపాలు సాగించేలా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఇక, తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ పంచాయ‌తీల‌కు గ‌డువు మీరిపోయి 16 నెల‌లు అయింది. దీంతో పంచాయ‌తీల్లో కార్య‌క‌లాపాలను ప్ర‌త్యేక అధికారులు మాత్ర‌మే ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇప్పుడు ఈ పంచాయ‌తీల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించి.. త్వ‌రిత గ‌తిన పూర్తి చేస్తే త‌ప్ప‌.. కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అయితే.. బీసీల‌కు 42 శాతం కోటా అమ‌లు చేస్తామ‌ని చెప్పిన నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ముందుకు వెళ్లే విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News