ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా పాక్...ఆయన బిన్ లాడెన్
ఆయనకూ అల్‌ఖైదా మాజీ చీఫ్ కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కి మధ్య ఎలాంటి తేడా లేనే లేదని అన్నారు.;
చేసిందంతా చేసి నంగనాచి కబుర్లు చెబుతున్న పాకిస్థాన్ తీరు అక్కడి పాలకులకు వారిని ఆడిస్తున్న ఆర్మీకి బాగుందేమో కానీ ప్రపంచం మాత్రం అసలు నమ్మడం లేదు. పాక్ ని పాపిష్టి దేశంగానే చూస్తోంది. నాకు ఏమి సంబంధం లేదు అని అమయాకంగా ఫోజులు కొడుతున్నా పాక్ ట్రాక్ రికార్డు అలాంటిది మరి. భారత్ మీద దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ తన ద్వేషాన్ని అలా చూపిస్తున్న పాక్ తీరుని ప్రపంచం అంతా పసిగట్టేసింది.
అందుకే పాక్ ఎన్ని పెడబొబ్బలు పెట్టినా భారత్ వైపే అంతర్జాతీయ సమాజం ఉంది. అంతే కాదు పాక్ ని ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. పాక్ వల్లనే అంతా జరుగుతోంది అని అంటోంది. తాజాగా అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ పాకిస్థాన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన కామెంట్స్ చేశారు.
ఇక పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కి అంతర్జాతీయ ఉగ్రవాదితో ఆయన పోల్చారు. ఆయనకూ అల్‌ఖైదా మాజీ చీఫ్ కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కి మధ్య ఎలాంటి తేడా లేనే లేదని అన్నారు. బిన్ లాడెన్ కలుగులో దాక్కుని ఉగ్రవాద కార్యకలాపాలు సాగించాడని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ ఒక విలాసవంతమైన సంపన్న భవనంలో ఉంటున్నారని అంతే తేడా అని ఆయన అన్నారు. ఇద్దరూ కూడా ఒక్కటే అని ఆయన ఫైర్ అయ్యారు.
పాకిస్థాన్ కి పహల్గామ్ దాడి లాంటివి అలవాటే అని ఆయన అన్నారు. గతంలో కూడా అనేక సార్లు ఇలాగే కాశ్మీర్ కేంద్రంగా ఉగ్ర దాడులు చేయించిందని ఆయన అన్నారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనలో ఉన్నప్పుడు కశ్మీర్‌లో ఇలాంటి దాడి జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇపుడు సరిగ్గా అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ లో పర్యటన చేస్తున్న సమయంలోనే టూరిస్టుల మీద ఉగ్రవాదులు దాడి చేసి ప్రాణాలు తీసారని ఆయన మండిపడ్డారు.
ఇక పహల్గామ్ ఘటనతో తనకు సంబంధం లేదని స్థానికంగానే అది జరిగిన సంఘటన అని పాక్ చెబుతున్న మాటలను రూబెన్ తప్పుపట్టారు. పాక్ ఇలాంటి నాటకాలు ఎన్ని ఆడినా ప్రపంచానికి పాక్ నిజ స్వరూపం ఏమిటో పూర్తిగా తెలుసు అని ఆయన అనడం విశేషం.
ఇక పహల్గామ్ ఉగ్రదాడి మీద అమెరికా స్పందించాలని ఆయన కోరారు. అంతే కాదు పాక్ ని తక్షణమే ఉగ్రవాద ప్రోత్సాహిత దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని రూబెన్ అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నిజానికి చూస్తే కనుక ఇటీవల ఓవర్సీస్ పాకిస్థాన్ కన్వెన్షన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ చేసిన వ్యాఖ్యల తర్వాతే పహల్గామ్ దాడి జరగడం గమనార్హమని అంతా అంటున్నారు. ఈ కార్యక్రమంలో మునీర్ మాట్లాడుతూ కశ్మీర్ గతంలోనూ భవిష్యత్తులోనూ మా జీవనాడి అన్నారు. దానిని మేం ఎప్పటికీ మరువలేమని చెప్పారు. అంతే కాదు మా కశ్మీరీ సోదరుల పోరాటంలో వారిని ఒంటరిగా వదిలిపెట్టమని కూడా కీలకమైన వ్యాఖ్యలే చేశారు.
ఇవన్నీ పక్కన పెడితే భారత్‌పై తీవ్ర వ్యతిరేకత కలిగిన వ్యక్తిగా మునీర్‌కు పేరుందని చెబుతారు. అందుకే ఆయనను పాక్ ఆర్మీ చీఫ్ గా చేశారని అంటారు. ఈ నేపధ్యంలోనే పహల్గామ్ ఉగ్రదాడి తరువాత మునీర్ వ్యాఖ్యలను అంతా గుర్తు చేసుకుంటున్నారు. దాంతో పాక్ ని ఆయన ఇరుకున పడేశారు అని అంటున్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పహల్గాం దాడికి పురిగొల్పాయా అనే కోణంలో అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే అంతర్జాతీయ సమాజం మద్దతు అయితే పాక్ కి ఇప్పుడు అసలు దక్కడం లేదు.