ఖాళీ జేబులు.. పేలని తుపాకులు.. పాక్ మార్క్ విన్యాసం!

పాక్ సైన్యాధ్యక్షుడు 'ఆధునిక యుద్ధం' గురించి మాట్లాడుతుంటే, సామాన్య పాకిస్థానీ మాత్రం 'ఆధునిక ఆకలి'తో అలమటిస్తున్నాడు.;

Update: 2026-05-11 14:30 GMT

ప్రపంచంలో కొన్ని దేశాలు అభివృద్ధి గురించి కలలు కంటాయి, మరికొన్ని శాంతి గురించి ఆలోచిస్తాయి. కానీ, మన పక్కనే ఉన్న మన ప్రియతమ 'దాయాది' దేశం మాత్రం ఎప్పుడూ ఒకే రకమైన కల కంటుంది.. అదే యుద్ధం! ఇంట్లో తినడానికి గింజలు లేకపోయినా, జేబులో చిల్లిగవ్వ లేకపోయినా, మాటల్లో మాత్రం ఫిరంగులు పేల్చడం పాకిస్థాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. దేశమంతా లాక్‌డౌన్‌లో ఉండి, పెట్రోల్ దొరక్క జనం బెంబేలెత్తుతుంటే.. ఆ దేశ సైన్యాధిపతికి మాత్రం యుద్ధ తంత్రాలు గుర్తొస్తున్నాయి. 'ఆకలి రుచి ఎరుగుదురు కానీ.. ఆయుధాల రుచి చూపించాలనే' వింత తపన పాక్ సైనిక పాలకుల్లో కనిపిస్తోంది. రావల్పిండి వేదికగా సాగిన ఈ ప్రసంగాలు చూస్తుంటే, అప్పులు తీర్చడం కంటే ఆయుధాలు పేల్చడమే ఆ దేశానికి అసలైన ఆర్థిక శాస్త్రం అనిపిస్తోంది.

ఆపరేషన్ సంబరాలు.. ఆసిమ్ మునీర్ హుంకారాలు

ఆదివారం రావల్పిండిలోని జనరల్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ తనదైన శైలిలో గర్జించారు. 'మర్కా-ఎ-హఖ్' (ఆపరేషన్ సింధూర్) జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ వేడుకలో ఆయన మళ్ళీ పాత పాటనే అందుకున్నారు. యుద్ధం చేసే విధానం మారిపోయిందని, ఆధునిక యుద్ధ తంత్రాల వైపు ప్రపంచం వెళ్తోందని ఆయన సెలవిచ్చారు. ఈ మార్పులకు అనుగుణంగా పాకిస్థాన్ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నామని, ఎటువంటి సవాలునైనా ఎదుర్కోవడానికి తాము రెడీ అని రొమ్ము విరుచుకున్నారు. అయితే, ఆ సిద్ధత కేవలం మాటల్లోనే ఉందా లేక ఖాళీగా ఉన్న ఫిరంగుల్లో కూడా ఉందా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

కడుపులో ఆకలి.. కళ్లలో యుద్ధం!

పాక్ సైన్యాధ్యక్షుడు 'ఆధునిక యుద్ధం' గురించి మాట్లాడుతుంటే, సామాన్య పాకిస్థానీ మాత్రం 'ఆధునిక ఆకలి'తో అలమటిస్తున్నాడు. దేశంలో ప్రస్తుతం పెట్రోల్ వినియోగంపై కోతలు విధిస్తున్నారు, ప్రజలను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని ఆదేశిస్తున్నారు, చివరికి తినడానికి తిండి కూడా దొరకని దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు దేశమంతా లాక్‌డౌన్ చీకటిలో ఉంటే, ఆసిమ్ మునీర్ గారు మాత్రం కొత్త తరం యుద్ధ విమానాలు, క్షిపణుల గురించి కబుర్లు చెబుతున్నారు. పెట్రోల్ లేక బండ్లు నడవని దేశంలో.. ట్యాంకులు ఎలా నడుపుతారో, అసలు యుద్ధానికి కావాల్సిన నిధులు ఎక్కడ నుంచి తెస్తారో ఆ అల్లాకే తెలియాలి.

యూఏఈ అప్పు.. పాక్ తప్పు!

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఐసీయూలో ఉంది. యూఏఈ నుంచి తీసుకున్న అప్పు చెల్లించలేక ఆ దేశం చేతులెత్తేసింది. ఎట్టకేలకు యూఏఈ కనికరించి అప్పు చెల్లింపునకు గడువు పెంచడంతో పాక్ ఊపిరి పీల్చుకుంది. ఇలా ప్రపంచ దేశాల దగ్గర చేయి చాచి తెచ్చిన డబ్బును ప్రజల సంక్షేమం కోసం వాడాలా..? లేక సైన్యాధ్యక్షుడి యుద్ధ సరదాల కోసం వాడాలా..? అన్న విషయంలో ఆ దేశ పాలకులకు 'కన్ఫ్యూజన్' నెలకొంది. డబ్బును ఎలా పుట్టించాలో తెలియక ఒకవైపు తికమక పడుతూనే, మరోవైపు భారత్‌ను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఆ దేశానికి పరిపాటిగా మారింది.

వ్యూహం మారింది.. వినాశనం తప్పదా?

ఆధునిక యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో కాల్పులు జరపడం కాదని, సైబర్ యుద్ధం, ఆర్థిక యుద్ధం అని మునీర్ కొత్త పాఠాలు చెబుతున్నారు. నిజానికి పాకిస్థాన్ ఇప్పటికే ఆర్థిక యుద్ధంలో ఓడిపోయి, ఆత్మరక్షణలో పడింది. ఇలాంటి సమయంలో పొరుగు దేశాలను రెచ్చగొట్టడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించవచ్చని పాక్ భావిస్తోంది. ఖాళీ కడుపులతో సైన్యం ఎంతకాలం కవాతు చేయగలదు..? యుద్ధ విమానాల్లో పోయడానికి చమురు లేని దేశం, ఆధునిక యుద్ధం గురించి మాట్లాడటం అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద హాస్యాస్పదమైన అంశంగా మారింది.

మొత్తానికి, పాకిస్థాన్ సైన్యాధిపతి మాటలు చూస్తుంటే.. ‘మునిగిపోయే పడవలో ఉండి, సముద్రాన్ని శాసిస్తానన్నట్టుంది’. పక్క దేశం వైపు వేలు చూపించే ముందు, సొంత దేశంలో జనం ఆకలి కేకలను వింటే మంచిదేమో ఆసిమ్ మునీర్ గారు!

Tags:    

Similar News