సల్మాన్ ను ఉగ్రవాదిగా ప్రకటించిన పాక్.. థాంక్స్ చెప్పిన బలుచిస్తాన్!

అనంతరం... "బలూచిస్తాన్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు" అని సల్మాన్ ఖాన్ కొనసాగించారు.;

Update: 2025-10-26 10:20 GMT

బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది! ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా సల్మాన్ ఖాన్‌ ను నాల్గవ షెడ్యూల్‌ లో ఉంచింది. ఈ జాబితా ఉగ్రవాద నిరోధక చట్టం కిందకు వస్తుంది. ఇందులో వ్యక్తులు పాకిస్తాన్‌ లో చట్టపరమైన చర్యలకు లోబడి ఉంటారు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.

అవును... సల్మాన్ ఖాన్ ను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది! ఈ మేరకు దీనిపై ఆ దేశ ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సల్మాన్ ఖాన్ పై పాకిస్థాన్ ప్రభుత్వం ఈ రేంజ్ లో నిర్ణయం తీసుకోవడానికి ఆయన చేసిన ఆ ప్రసంగం, పాక్ కు అంతగా కోపం తెప్పించిన ఆ మాటలేమిటనేది ఇప్పుడు చూద్దామ్... !

వివరాళ్లోకి వెళ్తే... సల్మాన్ ఖాన్ ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన 'జాయ్ ఫోరం 2025' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైకందుకున్న ఆయన... బలూచిస్తాన్‌ ను ప్రత్యేక దేశంగా చెబుతూ మాట్లాడారు. దీంతో.. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ రగిలిపోవడం మొదలుపెట్టింది. మరోవైపు సల్మాన్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇంతకీ సల్మాన్ ఖాన్ ఏమన్నారంటే.. "భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది.. ఒక హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే తప్పకుండా సూపర్‌ హిట్‌ అవుతుంది.. ఆపై తెలుగు, తమిళ్‌, మలయాళ సినిమాలు కూడా ఇక్కడ కోట్ల రూపాయలు రాబడుతున్నాయి. దీనంతటికీ కారణం పలు దేశాలకు చెందిన ప్రజలు సౌదీలో ఉండటమేనని చెప్పాలి" అని మొదలుపెట్టారు.

అనంతరం... "బలూచిస్తాన్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు" అని సల్మాన్ ఖాన్ కొనసాగించారు. అంటే... ఈ మాటల్లో బలూచిస్తాన్‌ వేరే దేశం అనే అర్ధం వచ్చే విధంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై బలుచిస్తాన్ వేర్పాటు వాదులు సల్మాన్ కు సోషల్ మీడియా వేదికగా థాంక్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

ఇందులో భాగంగా... 'సల్మాన్ నిజం మాట్లాడారు.. బలూచిస్థాన్ ఒక ప్రత్యేక దేశం యొక్క భూమి.. ఇది ఒక చారిత్రక వాస్తవం.. బలూచిస్థాన్ పాకిస్తాన్‌ లో భాగం కాదు.. అది ఆక్రమిత భూభాగం.. మేము బలూచిస్థాన్ నుండి సల్మాన్ బాయ్ ని ప్రేమిస్తున్నాము' అంటూ పోస్టులు పెడుతున్నారు'. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం మరింత రగిలిపోయింది!

కాగా.... ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్‌ చాలా వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది. ఇక్కడ ఖనిజ వనరులు పాకిస్థాన్ ఖజానాకు వరంగా మారాయి. ఒక్కమాటలో చెప్పాలంటే... ఈ ప్రాంతంలో ఉన్న బంగారం, బొగ్గు, రాగి, చమురు ఆ దేశ ఖజానాను కాపాడుతున్నాయి. అయినప్పటికీ.. బలూచిస్తాన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో పాక్‌ నిర్లక్ష్యంగానే ఉంటోంది.

దీంతో... పాక్ ప్రభుత్వ వైఖరిపై బలుచిస్తాన్ ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఫలితంగా రాజకీయ అనిశ్చితి ఏర్పడటం, ఆపై వేర్పాటువాదులు శక్తిమంతమవ్వడం జరిగింది. ఇప్పుడు ఏకంగా ప్రత్యేక ఆర్మీని ఏర్పాటు చేసుకునే స్థాయికి బలూచిస్తాన్‌ చేరుకుంది. చాలా కాలంగా పాక్‌ కు పక్కలో బల్లెంలా తయారైంది. ఈ నేపథ్యంలో.. బలుచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా సల్మాన్ ప్రస్థావించేసరికి పాక్ రగిలిపోతుంది!

Tags:    

Similar News