నా పని క్రికెట్ ఆడడం.. ఇంగ్లిష్ మాట్లాడ్డం కాదు..పాక్ కెప్టెన్ వేదన
తాజాగా పాకిస్థాన్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ మాట్లాడే ఇంగ్లిష్ మీద ట్రోలింగ్ నడుస్తోంది. రిజ్వాన్ కే కాదు చాలామంది పాక్ క్రికెటర్లకూ ఇంగ్లిష్ మాట్లాడేంత సామర్థ్యం లేదు.;
అప్పటివరకు దేశవాళీలు ఆడి.. జాతీయ జట్టుకు ఎంపిక కాగానే కొందరు క్రికెటర్లకు ఒక్కసారిగా వచ్చే సమస్య.. ఇంగ్లిష్ మాట్లాడడం. మరీ ముఖ్యంగా ఈ సమస్య భారత ఉప ఖండంలోని దేశాల ఆటగాళ్లకు ఎదురవుతుంటుంది. సెకండ్ గ్రేడ్ సిటీల నుంచి వచ్చిన ఎందరో భారత క్రికెటర్లు అంతర్జాతీయ వేదికల్లో ’మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లు అందుకునే సమయంలో ఇంగ్లిష్ లో మాట్లాడలేక ఇబ్బంది పడ్డారు. రవిశాస్త్రి, హర్షాబోగ్లే వంటి భారతీయ కామెంటేటర్లు ఉంటే హిందీలో వారిని అడిగేవారు. కానీ, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్ దేశాలకు చెందిన కామెంటేటర్లు ఉంటే మాత్రం వారి ఇంగ్లిష్ ట్రాన్స్ లేట్ చేయడానికి ఎవరో ఒక సహచర క్రికెటర్ ఉండాల్సిందే.
తాజాగా పాకిస్థాన్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ మాట్లాడే ఇంగ్లిష్ మీద ట్రోలింగ్ నడుస్తోంది. రిజ్వాన్ కే కాదు చాలామంది పాక్ క్రికెటర్లకూ ఇంగ్లిష్ మాట్లాడేంత సామర్థ్యం లేదు. అయితే, ఓ కెప్టెన్ గా తనమీద ట్రోలింగ్ ను చూసి రిజ్వానో ఎమోషన్ అయ్యాడు.
పాకిస్థాన్ తన నుంచి మంచి క్రికెట్ ను కోరుకుంటోంది తప్ప.. తాను మాట్లాడే ఇంగ్లిష్ ను కాదని రిజ్వాన్ వ్యాఖ్యానించాడు. ఎవరేం అనుకున్నా.. తనకు వచ్చిన భాషలోనే మాట్లాడతానని కుండబద్దలు కొట్టాడు. బయట ఏమనుకున్నా తనకు అనవసరం అన్నాడు.
తాను ఏం మాట్లాడినా.. మనసులో ఉన్నదే మాట్లాడతానని, ఆ విషయంలో చాలా గర్వంగా భావిస్తానని రిజ్వాన్ తెలిపాడు. తనకు ఇంగ్లిష్ బాగా రాకపోవడానికి కారణం.. క్రికెట్ లో పడి సరిగా చదువుకోకపోవడం అని చెప్పాడు. సరిగా చదువుకోనందుకు తాను ఇప్పటికీ పశ్చాత్తాప పడతానని పేర్కొన్నాడు.
పాకిస్థాన్ వంటి జట్టుకు కెప్టెన్ అయినప్పటికీ సరిగా ఇంగ్లిష్ మాట్లాడలేకపోతున్నందుకు ఒక్క శాతం కూడా సిగ్గుపడడం లేదని రిజ్వాన్ చెప్పాడు.
తనను ఇంకా బాగా ఆడాలని డిమాండ్ చేయాలని.. అంతేకానీ, ఇంగ్లిష్ మాట్లాడడం గురించి కాదని.. తాను పెద్ద చదువులను పూర్తి చేయలేదని రిజ్వాన్ తెలిపాడు. తన ఇంగ్లిష్ బాగోకపోవడానికి ఇదీ ఓ కారణం అయి ఉండొచ్చని చెప్పాడు. జూనియర్లకు తాను ఇచ్చే సూచన.. బాగా చదువుకొని క్రీడల్లోకి రావాలని అని, లేదంటే చదువును కొనసాగించాలని, దీంతో మంచి ఇంగ్లిష్ మాట్లాడే అవకాశం ఉంటుందని అన్నాడు. ఇప్పుడైతే తాను క్రికెట్ ను వదిలి ప్రొఫెసర్‌గా మారలేనని.. తనకంత సమయం లేదని రిజ్వాన్ చెప్పాడు.