భారత సైనిక చర్యపై పాక్ జోస్యం.. మాటల్లో మేకపోతు గాంభీర్యం!

పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-04-30 04:06 GMT

పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఈ దాడిని సీరియస్ గా తీసుకున్న భారత్ ఇప్పటికే పాకిస్థాన్ పై దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. మరోపక్క సరిహద్దుల్లో పాకిస్థాన్ వరుసగా ఆరో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ సమయంలో పాక్ మంత్రి స్పందించారు.

అవును... ఓపక్క ఓర్డర్ లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని వరుసగా ఉల్లంఘిస్తూ భారత్ సైన్యం చేతిలో మొట్టికాయలు తింటున్న పాకిస్థాన్.. రాబోయే 24 - 36 గంటల్లో భారత్ ఏమి చేయబోతుందో జోస్యం చెబుతోంది. ఇందులో భాగంగా... తమ దేశంపై సైనిక చర్య చేపట్టేందుకు న్యూఢిల్లీ ప్రణాళికలు రచిస్తోందని అన్నారు. దీనిపై తమకు నిఘాసమాచారం ఉందని చెప్పుకొచ్చారు.

పహల్గాం ఉగ్రదాడిపై రియాక్ట్ అయ్యే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు భారత ప్రధాని మోడీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అతవుల్లా తరార్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... పహల్గాం ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని అంటూ... తాము కూడా ఉగ్రవాద బాధితులమని చెప్పడం గమనార్హం.

కాగా... భారత ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో మంగళవారం కీలక సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన మోడీ... సీమాంతర ఉగ్రవాదం, దాని సూత్రధారులపై చర్యలు ఎప్పుడు, ఎలా తీసుకోవాలన్న విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు మోడీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ స్పందించింది.

వాస్తవానికి పహల్గాంలో 26మంది మృతి చెందిన ఉగ్రవాద దాడి వెనుక పాకిస్థాన్ శక్తులు ఉన్నాయని భారత్ చెప్పడంతో రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అంతకు ముందు స్పందించిన పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. భారత్ సైనిక దాడికి పాల్పడుతుందని.. అయితే, పాక్ పూర్తి అప్రమత్తంగా ఉందని, అవసరమైతే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని అన్నారు.

Tags:    

Similar News