నేవీ అధికారి సతీమణిపై ట్రోలింగ్.. జాతీయ మహిళా కమిషన్ సీరియస్
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మనం నచ్చని ఎన్నో ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.;
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మనం నచ్చని ఎన్నో ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయినప్పటికీ వాటి గురించి పెద్దగా పట్టించుకోం. వాటి మార్పు కోసం ప్రయత్నం చేయటం కూడా తక్కువగా ఉంటుంది. కానీ.. సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రం నచ్చిన వారిని ఆకాశానికి ఎత్తేయటం.. నచ్చని వారిని అదే పనిగా ట్రోల్ చేసే తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ట్రోల్ పేరుతో సాగుతున్న దుర్మార్గం ఎంతో మందికి ప్రశాంతత లేకుండా చేస్తోంది.
ట్రోల్ తరహా ద్వేషపూరిత భావన మంచిది కాదు. కానీ.. అలాంటి విషయాల్ని పట్టించుకోకుండా తమ భావజాలాన్ని నలుగురితో పంచుకోవాలన్న ఆత్రుత అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇటీవల చోటుచేసుకున్న పహల్గాం ఉగ్రదాడిలో హనీమూన్ కు వెళ్లిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఉండటం.. ఆయన్ను మతం పేరు అడిగి చంపేయటం తెలిసిందే. నిజానికి ఈ ఉగ్రదాడి వేళ.. భర్తను కోల్పోయి.. వేదనతో భర్త దగ్గర కూర్చొని ఏడ్చే వైనం ప్రపంచం మొత్తానికి ఒక సింబల్ గా మారిందని చెప్పాలి.
తన భర్తను మతం గురించి అడిగి మరీ ఉగ్రవాదులు చంపేసినట్లుగా పేర్కొన్నారు. అనంతరం జరుగుతున్న చర్చను గమనించిన ఆమె.. ఒక వర్గాన్ని టార్గెట్ చేసేలా వ్యాఖ్యలు చేయటం సరికాదంటూ సర్ది చెప్పటమే కాదు.. అదే మాత్రం మంచి పద్దతి కాదని స్పష్టం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు కొందరిని రుచిస్తే.. మరికొందరు మాత్రం ఆమెను ట్రోల్ చేస్తూ.. అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్టు చేయటం మొదలు పెట్టారు.
ఇలాంటి వేళ.. నేవీ అధికారి భార్యకు మద్దతుగా నిలుస్తూ జాతీయ మహిళా సంఘం స్పందించింది. ఆమెపై ట్రోల్ చేసే వారికి హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న వ్యాఖ్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్న కమిషన్ .. ఏదైనా కామెంట్ చేసేటప్పుడు మర్యాదగా.. రాజ్యాంగ సరిహద్దులకు లోబడి వ్యవహరించాలని కోరారు. ‘జాతీయ కమిషన్ ప్రతి మహిళ గౌరవాన్ని కాపాడే దిశగా చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ఇక.. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వినయ్ కు.. హిమాన్షికి ఏప్రిల్ 16న వివాహమైంది. నిజానికి వారు యూరప్ కు హనీమూన్ వెళ్లాలని ప్లాన్ చేశారు. అయితే.. వీసా రాకపోవటంతో కశ్మీర్ వెళ్లారు. అక్కడ వారు ఉగ్రదాడిలో వినయ్ ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే.