రాజ్ నాథ్ వర్సెస్ గగోయ్... ‘ఆపరేషన్ సిందూర్’ పై హాట్ హాట్ కామెంట్స్!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' పై సోమవారం లోక్ సభలో చర్చ మొదలైంది.;
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' పై సోమవారం లోక్ సభలో చర్చ మొదలైంది. ఈ సందర్భంగా... ఆపరేషన్ సింధూర్ చేపట్టడం, అది సాధించిన వీజయం, ఆ తర్వాత పాక్ సైనిక చర్య, సడన్ గా సీజ్ ఫైర్.. పై రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో... కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్.. కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... పార్లమెంటులో నేడు ఆపరేషన్ సిందూర్ పై వాడీ వేడీ చర్చ మొదలైంది. ఈ సందర్భంగా మాట్లాడిన రాజనాథ్ సింగ్... ఆపరేషన్ సిందూర్ కి సంబంధించిన విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా... గతంలో జరిగిన యూరీ, పుల్వామా దాడుల తర్వాత సరిహద్దుల్లో తీవ్రవాద మౌలిక సౌకర్యాలను పూర్తిగా ధ్వంసం చేశామని తెలిపారు. దీనిపైనే కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ స్పందిస్తూ కీలక ప్రశ్నలు సంధించారు.
ఇందులో భాగంగా... యూరీ, పుల్వామా దాడుల తర్వాత సరిహద్దుల్లో తీవ్రవాద మౌలిక సౌకర్యాలను పూర్తిగా ధ్వంసం చేస్తే... పహల్గాంలో తీవ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారని గౌరవ్ నిలదీశారు. ఇదే సమయంలో... పాకిస్తాన్ పై యుద్దం చేయాలని తాము అనుకోవడం లేదని, యుద్ధం తమ లక్ష్యం కాదని రాజ్ నాథ్ సింగ్ చెప్పగా.. పాక్ పై యుద్ధం చేయాలని ఎందుకు అనుకోవడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.
ఇలా ఓవైపు ఉగ్రవాద మౌలిక సదుపాయాలు కూల్చేశామని చెప్పుకుంటూనే.. మరోవైపు ఉగ్రవాద దాడి మళ్ళీ జరగవచ్చని చెప్తున్నారని.. అదే జరిగితే అప్పుడు పాక్ పని పడతామనని అంటున్నారని గగోయ్ ఆక్షేపించారు. గతంలో పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ లోకి చొరబడి కొడతామని ప్రధాని మోడీ చెప్పారని, ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత కూడా అదే చెప్తున్నారని ఎద్దేవా చేశారు. పాక్ మళ్లీ దాడి చేస్తే స్పందిస్తామని చెప్పడం ఏమిటో అర్ధం కావడం లేదని అన్నారు!
ఇదే సమయంలో... పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది చనిపోయి 100 రోజులు గడిచినా.. ఇప్పటివరకు దాడికి కారకులను ప్రభుత్వం పట్టుకోలేకపోయిందని గుర్తు చేసిన గగోయ్ గౌరవ్... బైసరన్ లోయలోని మారణకాండకు పాల్పడిన తర్వాత ఉగ్రవాదులు కొందరి సహకారంతో పరారయ్యారని.. ఆ సమయంలో వారికి మద్దతిచ్చిన వారి గురించి సర్కారు వద్ద సమాధానం లేదని అన్నారు.
ఇదే క్రమంలో... శాటిలైట్ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఇంత ఉన్నప్పటికీ ఇప్పటికీ ఉగ్రవాదులను పట్టుకోలేకపోయారని కాంగ్రెస్ ఎంపీ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో... ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత జమ్ముకశ్మీర్ సురక్షితంగా మారిందని.. ప్రభుత్వ హామీతో జమ్ముకశ్మీర్ కు పర్యాటకుల తాకిడి మొదలైందని.. అంతలోగా ఈ దారుణం చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు.
కాగా... అంతక ముందు మాట్లాడిన రక్షణ్మంత్రి రాజ్ నాథ్ సింగ్... సరిహద్దులు దాటి వెళ్లడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదని.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే సంస్థలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో... యుద్ధం మా లక్ష్యం కాదు.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడమే మా విధానం అని పునరుద్ఘాటించారు.
ఈ సమయంలోనే భారత్ దెబ్బకు పాక్ కాళ్ల బేరానికి వచ్చిందని.. మన త్రివిధ దళాలను తట్టుకోలేక పాక్ డీజీఎంవో వెంటనే మనకు ఫోన్ చేశారని.. కాల్పుల విరమణపై వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో భారత్, పాక్ లతో వాణిజ్యాన్ని తగ్గించుకుంటామని తాను బెదిరించడం వల్లే ఆ రెండు దేశాల మధ్య శత్రుత్వాలు ముగిశాయని డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన వాదనలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోసిపుచ్చారు.
ఆపరేషన్ సిందూర్ ను ఎటువంటి ఒత్తిడితోనూ ఆపలేదని.. లక్ష్యాలు పూర్తిగా సాధించినందుకే దాడులను నిలిపివేసాయని నొక్కి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ లో వంద మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు.