ఈసారి తెలుగు పద్మాలు విరిసేవి ఎన్ని ?

ఇక తెలుగు సినీ రంగానికి సంబంధించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా దిగ్గజాలకు ఇస్తూ వస్తున్నారు. అలా చివరిగా అందుకున్న వారు ప్రఖ్యాత దర్శకుడు కె విశ్వనాథ్.;

Update: 2026-01-19 23:30 GMT

మరో వారంలో భారత దేశ 77వ గణ తంత్ర వేడుకలు జరగనున్నాయి. ప్రతీ ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖులకు పౌర పురస్కారాలు ప్రకటించండం ఒక ఆనవాయితీగా వస్తోంది. దాంతో ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు పేర్లు పద్మ అవార్డులకు ఉండొచ్చు అన్న చర్చ మొదలైంది. పద్మ పురస్కారాలు అంటే ఎంతో గౌరవనీయమైనవి. అంతే కాదు జీవిత కాలం సేవకు గానూ దక్కేవి. దాంతో వాటిని అందుకోవాలని ఎంతో మంది ఎదురుచూస్తూ ఉంటారు, వివిధ రంగాలలో తమ అసాధారణ ప్రతిభా పాటవాలను చూపించి సమాజానికి ఆదర్శంగా స్ఫూర్తి వంతంగా ఉన్న వారికి ఈ అవార్డులను అందిస్తూ ఉంటారు.

వారికి అవార్డులు :

ఇక 2025 లో కనుక ఒకసారి చూసుకుంటే గతసారి సినీ రంగం నుంచి నందమూరి బాలక్రిష్ణకు పద్మభూషణ్ అవార్డు లభించింది. ఇక పద్మ విభూషణ్ అవార్డు హైదరాబాద్ కి చెందిన దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి (వైద్యం)కి అలాగే ప్రజా వ్యవహారాలలో మంద కృష్ణ మాదిగ (తెలంగాణా)కు లభించాయి. ఈసారి ఎవరికి ఈ పద్మ గౌరవాలు దక్కుతాయి అన్నది చర్చగా ముంది.

సినీ రంగంలో ఎందరో :

ఇక సినీ రంగంలో ఎందరో పద్మ అవార్డుల కోసం చూస్తున్నారు. అత్యధిక శాతం అర్హులుగా కూడా ఉన్నారు. అర్ధ శతాబ్దం సినీ కెరీర్ ని కంప్లీట్ చేసుకున్న జయసుధ అలాగే జయప్రద, ఒకనాటి నటీమణులు వాణిశ్రీ, శారద వంటి వారికి అవార్డులు ఇవ్వాలని డిమాండ్ ఉంది. ఇక కామెడీని హీరోగా చేసి దశాబ్దాల పాటు నటనను పండించిన రాజేంద్ర ప్రసాద్, బాలనటుడిగా ఉంటూ హీరోతో పాటు ఎన్నో పాత్రలలో రాణించిన అలీ ఇలా చాలా మంది పద్మ పురస్కారాలను అందుకునేందుకు అర్హులుగా ఉన్నారు.

ఆయన పేరు :

ఇక చూస్తే సినీ జర్నలిస్ట్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి నేపధ్య గాయకుడిగా ఉంటూ సంపూర్ణ భగవద్గీతను ఆలపించిన గంగాధర శాస్త్రి పేరు కూడా పద్మ అవార్డుల విషయంలో వినిపిస్తోంది. ఆయన ఇటీవలనే అఖండ 2 లో భగవద్గీత శ్లోకాలను ఆలపించారు. అదే విధంగా ఇతర రంగాల నుంచి అనేక మంది ఉన్నారని తెలుస్తోంది. వారిలో ఆధ్యాత్మిక రంగంలో చాగంటి కోటేశ్వరరావు పేరు కూడా వినిపిస్తోంది.

దాదా ఫాల్కే :

ఇక తెలుగు సినీ రంగానికి సంబంధించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా దిగ్గజాలకు ఇస్తూ వస్తున్నారు. అలా చివరిగా అందుకున్న వారు ప్రఖ్యాత దర్శకుడు కె విశ్వనాథ్. ఆ తరువాత ఎవరికీ దక్కలేదు, అయితే టాలీవుడ్ లో దిగ్గజాలలో ఒకరికి ఈసారి ఈ అవార్డు ఇస్తారని ప్రచారం సాగుతోంది. అదే విధంగా ప్రజా సంబంధాలు, సాహిత్యం, విద్య, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెడిసిన్, క్రీడలు, వాణిజ్యం అండ్ పరిశ్రమ, సోషల్ వర్క్ రంగాలకు సంబంధించి అనేక మంది ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు. మరి వీరిలో ఎవరికి ఈసారి పద్మాలు వికసిస్తాయన్నది చూడాల్సి ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పద్మ అవార్డుల ఎంపిక విషయంలో మార్పులు చేసింది.

నామినేషన్లకు ఆహ్వానం :

గత ఏడాదిలో ఈ అవార్డుల కోసం నామినేషన్లను ఆన్ లైన్ వేదికగా ఆహ్వానించారు. రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ పద్మ అవార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ మే 1న ఆగస్టు మధ్య గడువుతో ప్రారంభమవుతుంది. అలా ఎంపిక చేస్తూ వస్తున్నారు. మరి కొన్ని రాష్ట్రాల సిఫార్సులతో ఎంపిక చేస్తారు. ఇంకొన్ని కేంద్రమే నేరుగా ఎంపిక చేసి ప్రకటిస్తుంది.

భారత రత్న ఉందా :

ఈసారి భారత రత్న అవార్డుల ప్రకటన ఉందా అన్నది కూడా చర్చగా ఉంది. ఉంటే ఆ అవార్డు కోసం తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే విధంగా మరి కొందరు నిష్ణాతుల పేరు కూడా ప్రచారంలో ఉంది. మరి కేంద్రం ఈ నెల 25న రాత్రి ప్రకటించే పద్మ అవార్డుల జాబితాలో ఎవరెవరు తెలుగు ప్రతిభావంతులు ఉన్నారు అన్నది చూడాల్సిందే.

Tags:    

Similar News