భారతీయులు నిద్రలో ఉండగా, లేచాక... అసలేమేమి జరిగింది?

పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడితో యావత్ భారత్ ఆగ్రహావేశాలు చేలరేగాయి.;

Update: 2025-05-07 11:37 GMT

పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడితో యావత్ భారత్ ఆగ్రహావేశాలు చేలరేగాయి. ఈ ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ రగిలిపోయింది. మరోపక్క సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరి.. పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడటం, భారత్ వారి దాడులను తిప్పికొట్టడం జరుగుతున్నాయి. మరోపక్క తమపై భారత్ ఎప్పుడైనా యుద్ధం చేయొచ్చని పాక్ చెబుతూ వస్తోంది.

అయితే... ఈ సమయంలో భారత్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఈ సమయంలో మే 7, బుధవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదే నిజం అని పాక్ కూడా నమ్మింది. శత్రువును అలా ఏమార్చిన భారత్... మంగళవారం అర్ధరాత్రి ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడింది. సుమారు 80 మందిని మట్టుబెట్టింది!

పాక్ ను ఏమార్చిన మోడీ వ్యూహం!:

నాడు బాలాకోట్ దాడికి ముందు ప్రధాని మోడీ ప్రవర్తన ఎలా ఉందో.. తాజాగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అప్పుడూ అలానే ఉంది. అప్పటిలాగానే దాడికి ఒకరోజు ముందు ఓ మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. సుమారు 30 నిమిషాలు సాగిన ప్రసంగంలో.. మోడీ ముఖంలో ఎక్కడా ఆందోళన వంటిది కనిపించలేదు.. బహుశా తుఫాను ముందు ప్రశాంతతేమో!

మరోవైపు దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్దతపై ప్రజల్లో అవగాహన కల్పించే మాక్ డ్రిల్స్ ను ప్రకటించారు. దీంతో... దేశ ప్రజలను సైనిక చర్యకు, దాని పరిణామాలకు సిద్ధం చేస్తున్నారనే సూచనలు మాత్రమే పాక్ కు వెళ్లాయి. ఇవన్నీ శత్రువును ఏమార్చడానికి చేసిన ప్రయత్నాలే అని అంటున్నారు. ఈ సమయంలో మంగళవారం అర్ధరాత్రి భారత సైన్యం పాక్ పై విరుచుకుపడింది.

రక్షణ శాఖ కీలక ప్రెస్ మీట్!:

ఆపరేషన్ సిందూర్ తో పాక్ లోని ఉగ్రశిభిరాలపై భారత సైన్య విరుచుకుపడిన వివరాలను వెల్లడించడానికి కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టారు. ఈ సందర్భంగా.. ఈ ఆపరేషన్ ఎలా జరిగిందనే విషయాలను వీడియోలు ప్రదర్శిస్తూ వివరించారు.

ఈ సందర్భంగా స్పందించిన సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్... పాక్ లోని 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 5 ఉగ్ర స్థావరాలపై దాడులు చేసినట్లు తెలిపారు. సైనిక స్థావరాలు, జనావాసాలపై ఎలాంటి దాడులు చేయలేదని అన్నారు. అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 మధ్య సుమారు 25 నిమిషాల పాటు ఈ ఆపరేషన్ సిందూర్ నిర్వహించినట్లు తెలిపారు.

ఇదే సమయంలో నిఘా వర్గాల నుంచి వచ్చిన కచ్చితమైన సమాచారంతోనే ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపామని తెలిపారు. ఈ దాడులు ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేశామని అన్నారు.

జైషే మహ్మద్ చీఫ్ కు బిగ్ షాక్!:

ఈ ఆపరేషన్ సిందూర్ లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇందులో భాగంగా... పాకిస్థాన్ లోని బహవల్పూర్ లో భారత సైన్యం జరిపిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సహాయకులు మరణించారని అంతర్జాతీయ మీడియా నివేదించింది.

భారత్ కు ఇజ్రాయెల్ మద్దతు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు!:

పహల్గాం లో ఉగ్రదాడిని నిర్మొహమాటంగా, తీవ్రంగా ఖండించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. తాజాగా పాక్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైనిక చర్యల వేళ కాస్త విభిన్నంగా స్పందించారు. ఇందులో భాగంగా... ఈ దాడులు త్వరగా ముగిసిపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రెండు దేశాలకు ఎంతో చరిత్ర ఉందని అన్నారు.

ఇదే సమయంలో పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై ఇజ్రాయేల్ స్పష్టంగా స్పందించింది. ఆత్మ రక్షణ కోసం భారత్ దాడి చేస్తోంది.. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలి.. ఈ విషయంలో భారత్ కు తమ మద్దతు ఉంటుందని భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ప్రకటించారు.

ప్రధాని మోడీ ఫస్ట్ రియాక్షన్!:

పహల్గాం ఉగ్రదాడిని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ.. బుధవారం క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి, సభ్యులకు ఈ స్ట్రైక్ గురించి వివరించారు. ఇది మనందరికీ గర్వకారణమైన క్షణమని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాక్ లో నాలుగు, పీవోకే లో ఐదు ఉగ్రశిబిరాలను ఎలా లక్ష్యంగా చేసుకున్నారో మోడీ వారికి వివరించారు.

అమిత్ షా కీలక సమీక్ష!:

ఆపరేషన్ సిందూరు నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, డీజీపీ, ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయి సమీక్ష చేపట్టనున్నారు. ఈ భేటీకి జమ్మూకశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ సహా.. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కింగ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు, అధికారులు, గవర్నర్లు హాజరుకానున్నారు.

మరోపక్క సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో పాటు.. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో.. సెలవుల్లో ఉన్న సిబ్బందిని తక్షణం వెనక్కి రప్పించాలని పారా మిలటరీ బలగాలకు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.

మారిన పాకిస్థాన్ స్వరం!

ఆపరేషన్ సిందూర్ కి ఒక్కరోజు ముందు మాట్లాడిన పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. తమ దేశ భద్రతకు ఏమాత్రం ముప్పు వాటిల్లినా, భారత్ తమపై దాడికి పాల్పడినా.. ఆ తర్వాత ఎవరూ మిగలరని హెచ్చరించారు. అయితే మంగళవారం అర్ధరాత్రి భారత్ దాడుల అనంతరం స్వరం మార్చారు.

ఇందులో భాగంగా... భారత్ ప్రస్తుతం ఆపరేషన్లను ఆపితే తాము ఆపుతామని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఈ సమయంలో భారత్ దాడులు ఆపితే సంయమనం పాటించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. పాకిస్థాన్ యుద్ధం కోరుకోవట్లేదని చెప్పుకొచ్చారు.

200 విమానాలు క్యాన్సిల్, 18 ఎయిర్ పోర్టులు క్లోజ్!:

పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత సైన్యం జరిపిన క్షిపణి దాడుల అనంతరం బుధవారం 200కి పైగా విమానాలు రద్దు చేయబడగా.. శ్రీనగర్, అమృత్ సర్, చండీగఢ్ సహా కనీసం 18 విమానాశ్రయాలు తాత్కాలింగా మూసివేయబడ్డాయి. మరోపక్క ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ గగనతలం దాదాపు పూర్తిగా సైలంట్ అయిపోయింది!

పాకిస్థాన్ లో ఎమర్జెన్సీ!:

ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో.. పాకిస్థాన్ లో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... అన్ని ఎయిర్ పోర్టులతో పాటు పోర్టులను మూసేశారు! అదేవిధంగా... స్కూళ్లు, ఆఫీసులకు కూడా సెలవులు ప్రకటించి.. మెడికల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించారని సమాచారం.

Tags:    

Similar News