‘ఆపరేషన్ సిందూర్’ లో 138 మంది మృతి!... అడ్డంగా దొరికేసిన పాక్!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన సైనిక చర్య ‘ఆపరేషన్ సిందూర్’.. పాక్, పీఓకే లో ఉగ్రవాదులతో పాటు పాక్ సైన్యానికి పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.;

Update: 2025-08-17 05:27 GMT

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన సైనిక చర్య ‘ఆపరేషన్ సిందూర్’.. పాక్, పీఓకే లో ఉగ్రవాదులతో పాటు పాక్ సైన్యానికి పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సమయంలో పాక్ సైన్యంతో జరిగిన ఘర్షణలో తమకు పెద్దగా నష్టం జరగలేదన్నట్లుగా ఇంతకాలం పాక్ చెప్పుకొస్తున్న వేళ.. 138 సైనికులు మృతి చెందిన జాబితా తెరపైకి రావడం వైరల్ గా మారింది.

ఆవును... పాకిస్తాన్‌ కు చెందిన 'సమా టీవీ' ప్రచురించిన శౌర్య పురస్కార గ్రహీతల జాబితా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరణానంతరం గౌరవించబడిన 138 మంది సిబ్బంది పేర్లను సదరు మీడియా సంస్థ వెల్లడించడం.. వారందరికీ పేర్ల ముందు "షహీద్" (అమరుడు) అనే బిరుదును జోడించింది. అయితే మరళా కాసేపటికే ఆ జాబితాను తొలగించింది.

సమా జాబితా ప్రకారం.. నలుగురుకి 'తమ్ఘా-ఎ-జురాత్', ఒకరికి 'సితారా-ఎ-బసలత్', మరో నలుగురికి 'తమ్ఘా-ఎ-బసలత్', 129 మందికి 'ఇంతియాజీ సనద్' అవార్డులు లభించినట్లు వెల్లడించింది. గురువారం పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన అవార్డుల జాబితాలో ఈ పేర్లు తెరపైకి రావడం గమనార్హం.

కాగా... మే 6 - 7 తేదీల రాత్రి భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్'.. పాకిస్తాన్ ఉగ్రవాద వ్యవస్థపై తీవ్ర దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. భారత దళాలు చేసిన ఖచ్చితమైన దాడులు 9 ఉగ్రశిబిరాలు ధ్వంసం కాగా.. కనీసం 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు చెబుతున్నారు! మరోవైపు సుమారు డజను మందికి పైగా జిహాదీ కమాండర్లు హతమార్చబడిన పరిస్థితి!

వీరి అంత్యక్రియలకు పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం మాత్రమే కాకుండా సీనియర్ సైనిక ఉన్నతాధికారులు కూడా హాజరైనట్లు భారత నిఘా వర్గాలు ధృవీకరించాయి.. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్ చల్ చేశాయి. దీంతో పాకిస్థాన్ లో ఉన్న ఉగ్రవాదులకు ఆ ప్రభుత్వం ఎంత విలువ ఇస్తుందనేది ప్రపంచానికి మరోసారి తెలిసింది!

ఈ క్రమంలోనే తాజాగా ఆ దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 138 మందిని అమరులుగా గుర్తిస్తూ అవార్డుల జాబితా బయటకు రావడం.. పాక్ మీడియా ఆ జాబితాను వెంటనే తొలగించడంతో.. ఈ జాబితా అంతా ఆపరేషన్ సిందూర్ లో మృతిచెందినవారే అనే చర్చకు బలం చేకూరింది.

Tags:    

Similar News