హైద‌రాబాద్ పోలీస్ ఆప‌రేష‌న్ ఆక్టోప‌స్.. 104మంది సైబ‌ర్ ముఠా అరెస్ట్

సైబ‌రాబాద్ క్రైమ్ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన‌ నిందితుల్లో బ్యాంకు అధికారులు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. మొత్తం నిందితుల‌పై దేశ‌వ్యాప్తంగా 1,055 కేసులు న‌మోదైన‌ట్లు తేలింది.;

Update: 2026-02-24 09:51 GMT

మొత్తం 16 రాష్ట్రాలు.. 104 మంది సైబ‌ర్ నేర‌గాళ్లు అరెస్ట్... హైద‌రాబాద్ పోలీసులు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక్టోప‌స్ ఇది.. ప‌ది రోజుల పాటు భారీగా సాగిందీ ఈ ఆప‌రేష‌న్. ఏకంగా 32 టీమ్ ల‌ను రంగంలోకి దింపారు. ఫ‌లితంగా క‌నీవిని ఎరుగ‌ని రీతిలో సైబ‌ర్ నేర‌గాళ్ల‌ను ప‌ట్టుకున్నారు. కొంద‌రు బ్యాంకు అధికారుల‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. సైబ‌ర్ క్రైమ్ పోలీసుల ఆధ్వ‌ర్యంలో గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా సాగిన ఆప‌రేష‌న్ ఆక్టోప‌స్ వివ‌రాలు మంగ‌ళ‌వారం బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

వెయ్యి కేసులపైనే...

సైబ‌రాబాద్ క్రైమ్ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన‌ నిందితుల్లో బ్యాంకు అధికారులు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. మొత్తం నిందితుల‌పై దేశ‌వ్యాప్తంగా 1,055 కేసులు న‌మోదైన‌ట్లు తేలింది. ఏకంగా 127 కోట్ల రూపాయిల విలువైన‌ సైబ‌ర్ మోసాల‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్ర‌మంలో రూ.36 ల‌క్ష‌ల న‌గ‌దు, 204 సెల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు, 152 పాస్ పుస్త‌కాలు, 26 ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.

కూలిన సైబ‌ర్ ముఠా...

దాదాపు దేశ‌వ్యాప్తంగా హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైం పోలీసులు సాగించిన ఆప‌రేష‌న్ లో సైబ‌ర్ క్రై ముఠా కుప్ప‌కూలిన‌ట్లైంది. హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసులు, డీసీపీ (సైబ‌ర్ క్రైమ్స్) అర్వింద్ బాబు ఈ ఆప‌రేష‌న్ కు సార‌థ్యం వ‌హించారు. ముఠాగా ఏర్ప‌డి సైబ‌ర్ క్రైంల‌కు పాల్ప‌డుతున్న‌వారి ఆట క‌ట్టించారు. ఆప‌రేష‌న్ ఆక్టోప‌స్ ను సైబ‌ర్ నెట్ వ‌ర్క్ నిర్వీర్వ్యానికి ఆయుధంగా వాడుకున్నారు.

-పెట్టుబడి మోసాలు.. ట్రేడింగ్ వంచ‌న‌లు.. డిజిటల్ అరెస్టులు.. ఇటీవ‌లి కాలంలో సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్న మార్గం ఇది. దీంతో ప్ర‌జ‌లు క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్మ‌ను ఒక్క రోజులో పోగొట్టుకుంటున్నారు. ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వం, న‌మ్మ‌కాన్ని దారుణంగా మోసం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆప‌రేష‌న్ ఆక్టోప‌స్ చేప‌ట్టిన‌ట్లు హైద‌రాబాద్ పోలీసులు తెలిపారు. క‌చ్చిత‌మైన నిఘా, సూక్ష్మ విశ్లేష‌ణ ఆధారంగా నిందితుల‌ను ప‌ట్టుకున్నామ‌న్నారు.




Tags:    

Similar News