కామ్రెడ్స్ నోట.. 'పురాణాల' మాట!
కమ్యూనిజం అంటేనే హేతువాదం!. దేవుడు లేడని గట్టిగా చెబుతారు. అంతేకాదు.. మతాలను కూడా వారు విశ్వసించరు.;
కమ్యూనిజం అంటేనే హేతువాదం!. దేవుడు లేడని గట్టిగా చెబుతారు. అంతేకాదు.. మతాలను కూడా వారు విశ్వసించరు. అలాంటి కామ్రెడ్స్ నోట ఇప్పుడు పురాణాల మాట వినిపిస్తే. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దేశవ్యాప్తంగా నలుగురు కీలక కమ్యూనిస్టు నాయకులు కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖలో వారు పురాణాలను ప్రస్తావించడంతో ఈ విషయానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ లేఖను వారు.. కేంద్ర హోం శాఖ సహా ప్రధానికి కూడా పంపించారు.
''పురాణాల్లోనూ క్షమాభిక్షకు ప్రాదాన్యం ఉంది. మీరు పురాణాలు, ఇతిహాసాలను విశ్వసిస్తారు. కాబట్టి పురాణాల్లో చెప్పినట్టు అయినా.. మీరు క్షమాభిక్షకు ముందుకు రావాలి. రామాయణంలో రావణుడికి రాముడు క్షమాభిక్ష ప్రసాదించేందుకు ముందు కు వచ్చాడు. కానీ, రావణుడే వినిపించుకోలేదు. మహాభారతంలోనూ.. దుర్యోధనుడికి శ్రీకృష్ణుడు రాయబారం చేసినట్టు ఉంది. ఆయన కూడా మాట వినలేదు. విని ఉంటే భారత యుద్ధం వచ్చేది కాదు. కానీ.. ఇప్పుడు వాళ్లు క్షమాభిక్ష కోరుతున్నారు. ముందుకు వచ్చారు. మీరే కనికరించాలి.'' అని కేంద్రానికి రాసిన లేఖలో సీపీఐ, సీపీఎం సహా ఇతర వామపక్షాల నాయకులు సంతకాలు చేశారు. వీరిలో తెలుగు వారైన నారాయణ, కేరళకు చెందిన రాజా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన కమ్యూనిస్టులు కూడా ఉన్నారు.
విషయం ఏంటి?
వచ్చే 2026, మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో 'ఆపరేషన్ కగార్' పేరుతో మావోయిస్టులను ఏరేస్తోంది. గతానికి భిన్నంగా అధునాతన సాంకేతిక వ్యవస్థను వినియోగించుకుని మరీ మావోయిస్టులపై యుద్ధం చేస్తోంది. దీంతో 80 శాతం వరకు మావోయిస్టులు..(వీరిలో కీలక నాయకులు కూడా ఉన్నారు) ప్రాణాలు కోల్పోయారని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణలోనూ మావోయిస్టు ఆపరేషన్లు జరుగుతున్నాయి. వీరికి డ్రోన్లు సహా శాటిలైట్ సహకారం అందిస్తున్నారు. దీంతో ఎంతో నిర్జన ప్రాంతం అనుకున్న చోట కూడా డ్రోన్లు వెళ్లిపోతున్నాయి. మావోయిస్టుల ఉనికిని పసిగడుతున్నాయి. దీంతో ఆపరేషన్ కగార్ ఊపందుకుంది.
ఈ పరిణామాలతో మావోయిస్టులు ఉలిక్కిపడుతున్నారు. కొందరు స్వయంగా లొంగిపోతున్నారు. ఇటీవల జానకి అనే మావోయిస్టు తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. దీంతో ఆమెపై ఉన్న 25 లక్షల రివార్డును కూడా ఆమెకు ఇచ్చారు. ఇలా.. దేశంలో మావోయిస్టులపై జరుగుతున్న ఆపరేషన్‌తో వారు దిగి వచ్చారు. తాము ఆయుధాలు వదిలేస్తాం.. చర్చలు కూడా వద్దు.. జనజీవనంలో కలిసిపోతాం.. కగార్‌ను ఆపండని గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ.. కేంద్రం మాత్రం వినిపించుకోవ డం లేదు. గతంలో చర్చలకు పట్టుబట్టిన మావోయిస్టులు ఇప్పుడు అవికూడా అవసరం లేదని అంటున్నారు. అయినప్పటికీ.. సర్కారు వెనక్కిత గ్గడం లేదు. ఈ నేపథ్యంలో మోడీ సహా .. అమిత్‌షాలకు `పురాణాల`ను గుర్తు చేస్తూ.. కమ్యూనిస్టులు లేఖలు సంధించడం గమనార్హం.