పార్టీ ఏదైనా.. ఆపరేషన్ కోవర్ట్..

అలర్ట్‌ అలర్ట్‌.. ఆపరేషన్‌ కోవర్ట్‌! ప్రాంతీయం మొదలు.. జాతీయం వరకు.. రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న కోవర్టుల ముచ్చట.;

Update: 2025-06-07 19:30 GMT

అలర్ట్‌ అలర్ట్‌.. ఆపరేషన్‌ కోవర్ట్‌! ప్రాంతీయం మొదలు.. జాతీయం వరకు.. రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న కోవర్టుల ముచ్చట.

సమకాలీన రాజకీయాల్లో, గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని ప్రధాన పార్టీలను కలవరపెడుతున్న అంశం కోవర్టుల సమస్య. తెలుగు రాజకీయాల్లోనూ ఇదే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఏ పార్టీలో ఎవరి కోవర్టులు ఉన్నారో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న నాయకుల మాటలైతే పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ రాహుల్‌ గాంధీ నుంచి చంద్రబాబు, కేటీఆర్‌ల వరకు బడా నేతలు ఈ విషయాన్ని నొక్కి వక్కాణించడంతో ఈ చర్చ మరింత తీవ్రమైంది. ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీల వరకు ప్రతి ఒక్క పార్టీని కోవర్టుల సమస్య ఇబ్బంది పెడుతోందనేది స్పష్టమవుతోంది. అయితే, ఏ పార్టీలో ఎవరికెవరు కోవర్టులుగా పనిచేస్తున్నారని తెలుసుకోవడమే ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.

- ఆంధ్రప్రదేశ్‌లో కోవర్టుల కలవరం: చంద్రబాబు హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల పార్టీలో కోవర్టులపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. హత్యా రాజకీయాల్లో తలపండిన వైసీపీ నాయకులు కొందరు కోవర్టులను తెదేపాలోకి పంపి తమ ఎజెండాను నెరవేర్చుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. సంతనూతలపాడులో టీడీపీ నేత వీరయ్య చౌదరి, మాచర్లలో మరో ఇద్దరు కార్యకర్తల హత్యలతో తనకు ఇదే అనుమానం కలుగుతోందని చంద్రబాబు అన్నారు. అలాంటివారిని ఉపేక్షిస్తే మన వేలితో మన కన్ను పొడుచుకున్నట్టేనంటూ కార్యకర్తలను హెచ్చరించారు.

- తెలంగాణలో బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న కోవర్టుల భయం

పదేళ్ల పాటు అధికారం చెలాయించిన బీఆర్ఎస్‌ను కూడా ఇప్పుడు కోవర్టుల భయం వెంటాడుతోంది. ఇటీవల కేసీఆర్‌కు కవిత రాసిన అంతర్గత లేఖ బయటకు లీకవడంతోనే కోవర్టుల ముచ్చట తెరమీదకు వచ్చింది. అంతర్గత విషయం బయటకెలా వచ్చిందో తేల్చాలని కవిత డిమాండ్‌ చేయగా, పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి కోవర్టులు ఉన్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు ఆ కోవర్టులు వాళ్లంతట వాళ్లే బయటపడతారంటూ పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆలోపు ఇంకెన్ని బీఆర్ఎస్ సీక్రెట్స్ బయటకు వస్తాయో తెలియదు.

- కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలోనూ తప్పని కోవర్టుల బెడద

కేటీఆర్ చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదు. ప్రతీ పార్టీలోనూ కోవర్టులు ఉంటారు. అక్కడి అంతర్గత విషయాలను తమ బాసులకు చేరవేస్తుంటారు. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో సైతం బీఆర్ఎస్‌కు, బీజేపీకి కోవర్టులుగా పనిచేస్తున్నవారు ఉన్నారనే ప్రచారం చాలా రోజులుగానే ఉంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా, వరంగల్ సభలో ఏకంగా రాహుల్‌గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అలాంటివారు ఎవరైనా, ఎంతవారైనా తమకు అక్కర్లేదని, బీజేపీలోనో, బీఆర్ఎస్‌లోనో చేరిపోవాలంటూ తేల్చి చెప్పేశారు.

కోవర్టులతో చాలా కాలంగా ఇబ్బందిపడిన కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికీ ఆ బెడద పోలేదని తెలుస్తోంది. జాతీయ స్థాయిలోనూ ఆ పార్టీకి కోవర్టుల సమస్య వెంటాడుతోంది. ఇటీవల గుజరాత్‌లో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలోనూ రాహుల్ ఇదే విషయాన్ని ఉటంకించారు. కాంగ్రెస్‌లో సగం మందికి పైగా బీజేపీకి కోవర్టులుగా పనిచేస్తున్నారంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. వారి వల్లే పార్టీ నష్టపోతోందని చెప్పారు.

- కోవర్టు సంస్కృతికి కాంగ్రెస్ సుదీర్ఘ చరిత్ర

చంద్రబాబైనా, కేటీఆరైనా, రాహుల్‌ గాంధీ అయినా.. ఎవరు చెప్పినా కోవర్టుల ముచ్చట కొత్తదేం కాదు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కోవర్టు సంస్కృతి ఎప్పటి నుంచో ఉందంటారు రాజకీయ విశ్లేషకులు. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ నేతలు తమ పనుల కోసం అధికారపక్షంతో అంటకాగిన సందర్భాలు చాలానే ఉన్నాయనే ప్రచారం ఉంది. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది కాంగ్రెస్ నేతలు ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నారు. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా భట్టి విక్రమార్క వరకు అందరూ ఈ ఆరోపణలు ఎదుర్కొన్నవారే. గతంలోనూ ఇలాంటి రాజకీయాలు చేసిన నేతలు కాంగ్రెస్‌లో సొంత నేతలను ఓడించుకున్న పరిస్థితులు ఉన్నాయి.

- బీజేపీ ప్రతివిమర్శలు: కాంగ్రెస్‌లోనే కోవర్టులు ఉన్నారంటూ

కాలేశ్వరం కమిషన్ ముందు హాజరైన బీజేపీ ఎంపీ ఈటల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతున్న బీజేపీ, అసలు కోవర్టులు కాంగ్రెస్‌లోనే ఉన్నారని, వారంతా బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారని ప్రతివిమర్శలు చేస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌, కేసీఆర్‌కు అనుకూలంగా కోవర్టు రాజకీయాలు చేస్తున్నారంటూ బీజేఎల్పీ లీడర్ మహేష్ గౌడ్ ఆరోపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పరోక్షంగా అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి కవితకు మద్దతునిచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రధాన రాజకీయ పార్టీలను ఇప్పుడు కోవర్టుల అంశం కుదిపేస్తోంది. ఈ సమస్యతో అప్పట్లో అతలాకుతలమైన హస్తం పార్టీ అధికారం దక్కించుకోగా, ఇప్పుడు బీఆర్ఎస్‌ను ఆ సమస్య వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. మరి, ఏ పార్టీకి ఎవరు కోవర్టులున్నారు? ఎంతమంది ఉన్నారు? వాళ్లెవరు? అనే విషయం ఎలా బయటకొస్తుందో, ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.

Tags:    

Similar News