బాలినేని వైసీపీ మధ్య ...అక్కడే బిగ్ ట్విస్ట్

ఒంగోలు రాజకీయాలు ఎపుడూ చైతన్యవంతంగా సాగుతాయి. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పుట్టిన గడ్డ అది.;

Update: 2025-12-27 04:30 GMT

ఒంగోలు రాజకీయాలు ఎపుడూ చైతన్యవంతంగా సాగుతాయి. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పుట్టిన గడ్డ అది. అంతే కాదు అక్కడ నుంచి ఎంతో మంది దిగ్గజ నేతలు వచ్చి ఏపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. గుంటూరుని ఆనుకుని ఉన్న ఈ జిల్లాలో రాజకీయ వేడి కూడా మామూలుగా ఉండదు, ఎపుడూ అధికార విపక్షాలు ఢీ కొడుతూనే ఉంటాయి. ఒకనాడు కాంగ్రెస్ వర్సెస్ టీడీపీగా ఉన్నవి కాస్తా టీడీపీ వర్సెస్ వైసీపీ అయ్యాయి. ఇపుడు జనసేన కూడా అక్కడ ప్రభావం చూపిస్తోంది. ఈ ట్రయాంగిల్ ఫైట్ లో వైసీపీ తన పొలిటికల్ షేర్ ని వెతుక్కునే పనిలో పడింది అని అంటున్నారు.

కొమ్ము కాసిన వాసన్న :

నిజం చెప్పాలీ అంటే 1989 తరువాత ఒంగోలు రాజకీయాల్లో చాలా మంది కొత్త తరం వచ్చారు. వారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరు. ఆయన వైఎస్సార్ కి దగ్గర బంధువు కూడా. అందుకే ఆయన దూకుడుగానే రాజకీయం చేస్తూ వచ్చారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన బాలినేనికి ఒంగోలు జిల్లాలో చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో పట్టు ఉంది. ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చినపుడు అదే హవా నడచింది. అయితే 2019లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చి మధ్యలో తీసేయడంతోనే తీవ్ర అసంతృప్తికి లోను అయ్యారు. ఆ తరువాత 2024 ఎన్నికలలో ఓటమితో తన పొలిటికల్ రూట్ మార్చుకుని జనసేనలో చేరిపోయారు. దీంతో వైసీపీలో పెద్ద దిక్కు ఎవరు అన్న చర్చ అయితే ఈ రోజుకీ ఉంది.

అనేక పేర్లు వచ్చినా :

ఇక ఒంగోలులో బలమైన సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బిగ్ సౌండ్ అయిన ఆమంచి కృష్ణమోహన్ ని వైసీపీలోకి తీసుకుని వస్తున్నారు అన్న చర్చ ఆ మధ్య దాకా నడిచింది. అయితే ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ ఇపుడు ఒక ఎంపీ కుమారుడిని వైసీపీలోకి తీసుకుని రావడానికి ఆ పార్టీ భారీ స్కెచ్ గీస్తోంది అని అంటున్నారు. ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని వైసీపీలోకి తీసుకుని వస్తే జిల్లాలో పాలిటిక్స్ కంప్లీట్ గా బాలెన్స్ అవుతుందని వైసీపీ సీరియస్ గానే ఆలోచిస్తోంది అని అంటున్నారు.

తెర వెనక :

ఈ మేరకు వైసీపీ వైపు నుంచి తెర వెనక కసరత్తు అయితే సాగుతోంది అన్న ప్రచారం ఉంది. ఇక మాగుంట ఫ్యామిలీ కాంగ్రెస్ టీడీపీ వైసీపీ ఇలా అన్ని పార్టీలలో పనిచేసింది. ప్రస్తుతం టీడీపీలో ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీ అయిన మాగుంట ఇపుడు టీడీపీ నుంచి ఆదే పదవిలో ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని రాజకీయ వారసుడిగా ఉంచి తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు అని టాక్ అయితే ఉంది. దీంతో మాగుంట రాఘవరెడ్డిని వైసీపీలోకి తెస్తే ఎలా ఉంటుంది అని ఆ పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది అంటున్నారు.

బిగ్ షాట్ తోనే :

జిల్లాలో మాగుంట ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది. చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆ ఫ్యామిలీకి పట్టు ఉంది అని అంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల నాటికి వారసుడిని ఈ వైపునకు తిప్పుకుంటే జిల్లాలో వైసీపీ మార్క్ పాలిటిక్స్ ని చూపించవచ్చు అన్నది ఆలోచిస్తున్నారు అని చెబుతున్నారు. ఇక మాగుంట రాఘవరెడ్డి ఎంపీగానా లేక ఎమ్మెల్యేగానా అంటే ఆయనను ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగానే బరిలోకి దించే ప్లాన్ కూడా ఉందని అంటున్నారు. ఒంగోలు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గుర్తుకు వస్తారు. ఆయనకు ఆ ప్లేస్ కంచు కోట లాంటిది. అనేక ఎన్నికల్లో గెలిచారు ఇక జనసేనలో ఉన బాలినేని వచ్చే ఎన్నికల్లో ఈ సీటుని కోరుతారు అని అంటున్నారు. అదే జరిగితే ఆ సీటు నుంచి వైసీపీ ట్రంప్ కార్డుగా మాగుంట ఫ్యామిలీ ఉంటుందా అన్నదే ఇపుడు హాట్ హాట్ డిస్కషన్ గా ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ పై దాటి సమయం ఉంది కాబట్టి ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News