వైసీపీ.. అప్పారావుగారు అస్సలాగట్లేదుగా.. !
నూజివీడు పురపాలక రాజకీయం వేడెక్కింది. నూజివీడు పురపాలకంలో ఆది నుంచి వైసీపీకి పట్టు ఉంది. తాజా మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు గెలుపు ఓటములలో నూజివీడు పట్టణం కీలకం.
నూజివీడు పురపాలక రాజకీయం వేడెక్కింది. నూజివీడు పురపాలకంలో ఆది నుంచి వైసీపీకి పట్టు ఉంది. తాజా మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు గెలుపు ఓటములలో నూజివీడు పట్టణం కీలకం. ఇక్కడ 32 వార్డులలో 24 వార్డులు గెలుచుకుని, నిన్నటి వరకు చైర్మన్, ఇద్దరు వైస్–చైర్మన్‌లతో అధికారాన్ని అనుభవించిన వైసీపీ ఇప్పుడు ఆకౌన్సిల్స్‌ను నిలబెట్టుకునేందుకు.. వచ్చే ఎన్నికల్లో పట్టు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వాస్తవానికి గత 2021 ఎన్నికల్లో టీడీపీకి ఎనిమిది మంది కౌన్సిలర్ల బలం మాత్రమే చేకూరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో కౌన్సిల్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ నేపథ్యంలో మేకా అప్పారావు మరింత జాగ్రత్తగా స్థానిక వైసీపీ నాయకులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నూజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పట్టణంలో టీడీపీ ముఖ్య నేతలతోపాటు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారితో టచ్‌లో ఉంటున్నారు.
టీడీపీకి నూజివీడు కౌన్సిల్‌లో అధికారం దక్కాలంటే వారికున్న బలానికి తోడు మరింతగా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అయితే.. అంతర్గత వివాదాలు సైకిల్ పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. ముఖ్యంగా మంత్రి వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్న మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్గం.. వైసీపీకి అనుకూలంగా మారుతుందన్న వాదన వినిపిస్తోంది.దీనిని మేకా అప్పారావు ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన కూటమి నాయకులలో తనకు అనుకూలంగా ఉన్నవారికి విందులు ఇస్తున్నారు.
ఇవన్నీ.. అప్పారావు దూకుడుకు నిదర్శనంగా మారాయి. అయితే.. మంత్రి కొలుసు మాత్రం.. తమదే విజయమని.. కూటమి గెలుపు తథ్యమని చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో అప్పారావు స్వయంగా రం గంలోకి దిగడం.. తన కుమారుడి ద్వారా రాజకీయాలు చేయడం వంటివి హాట్ హాట్‌గా మారుతున్నాయి. ``మీకు నేనున్నా..`` అంటూ ఓ వర్గం నాయకులకు ఆయన భరోసా ఇస్తున్నారు. దీంతో నూజివీడు పురపాలికలో వైసీపీ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు.. మంత్రి మాత్రం అంతా సానుకూలంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందన్నది చూడాలి.