పట్టిసీమ నుంచి పోలవరం దాకా.. చంద్రబాబు చరిత్రలో చెరిగిపోని మూడు ప్రాజెక్టులు!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ చరిత్ర. రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతోపాటు, సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన రికార్డు ఆయన సొంతం.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ చరిత్ర. రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతోపాటు, సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన రికార్డు ఆయన సొంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం నాలుగోసారి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు కెరీర్‌లో చెప్పుకోదగ్గ పథకం ఒక్కటైనా ఉందా? అంటూ రాజకీయ ప్రత్యర్థులు తరచూ సవాల్ చేస్తుంటారు. ఈ ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ ఎన్నో సమాధానాలు చెబుతున్నప్పటికీ, ప్రత్యర్థులు మాత్రం అవే విమర్శలను పునరావృతం చేస్తుంటారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీతోపాటు టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలమైన వ్యవసాయం, అనుబంధ రంగాలను విస్మరిస్తుంటారని ప్రత్యర్థులు తరచూ విమర్శలు చేస్తుంటారు. అంతేకాకుండా, గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఏ సందర్భంలో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని పట్టించుకోకుండా, రాజకీయ లబ్ధి కోసం ఆ మాటలతో ఆయనను కార్నర్ చేయాలని చూస్తుంటారని పరిశీలకులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం చంద్రబాబు నాలుగో విడత ప్రభుత్వంలో జరుగుతున్న పనులతో ఇకపై ఆ విమర్శలన్నింటికీ చెక్ పెట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎప్పుడూ సాంకేతికత చుట్టూ తిరిగే చంద్రబాబు ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చిందనేలా.. ప్రస్తుతం ఆయన రెండు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన ఆయన, ఈ టర్మ్‌లో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నట్లు గతంలోనే ప్రకటించారు. వీటిలో ఒకటి పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కాగా, మరొకటి పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసిన ఘనత తనదేనంటూ, చంద్రబాబు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా పనిచేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులతోపాటు 2014-19 మధ్య ఆయన పూర్తి చేసిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం కూడా ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలిచిందని చెబుతున్నారు.
పట్టిసీమ, వెలిగొండ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి వ్యతిరేకిననే ముద్రను చంద్రబాబు పూర్తిగా చెరిపేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2014-19 మధ్య ఎన్ని విమర్శలు వచ్చినా పట్టుబట్టి పూర్తి చేసిన పట్టిసీమ ప్రాజెక్టు నేడు కృష్ణా డెల్టాను రక్షిస్తోందని గుర్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎన్నో విమర్శలు ఎదురైనా, చంద్రబాబు వెనకడుగు వేయకుండా ముందడుగు వేయడం ఇప్పుడు ఎంతో ఉపకరిస్తోందని పేర్కొంటున్నారు. ఇక త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్న వెలిగొండ ప్రాజెక్టు కూడా చంద్రబాబు కృషేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 3 దశాబ్దాల క్రితం చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును ఇప్పుడు ఆయనే ప్రారంభిస్తుండటం విశేషం. అదేవిధంగా, పోలవరం పనులను వేగవంతం చేసి వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ విధంగా చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఈ మూడు ప్రాజెక్టులు అత్యంత ముఖ్యమైనవిగా నిలవనున్నాయని అంటున్నారు. దశాబ్దాలుగా ఆయన ఎదుర్కొంటున్న విమర్శలకు ఇవి బలమైన సమాధానాలుగా అభివర్ణిస్తున్నారు. పట్టిసీమ జలాల ద్వారా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు లబ్ధి పొందుతుండగా.. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుత మార్కాపురం జిల్లా రూపురేఖలే పూర్తిగా మారిపోనున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఎప్పుడూ కరువు కాటకాలతో అల్లాడిపోయే ఆ ప్రాంతానికి వెలిగొండ జీవనాడిగా మారుతుందని, ఇది చంద్రబాబు ఘనతేనని టీడీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ఆయన ఎక్కడా రాజీ పడటం లేదు. ఆయన చెబుతున్నట్లుగానే రాబోయే కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే, మూడు అతిపెద్ద ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేసిన నాయకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.