విశాఖ మేయర్ సీటు మీద గంటా ఫ్యామిలీ ఫోకస్ ?
విశాఖ మేయర్ అంటే ఏపీలోనే అతి పెద్ద స్థానం. ఒక విధంగా చెప్పాలీ అంటే మంత్రి స్థాయి హోదా దీనికి ఉంటుంది.
విశాఖ మేయర్ అంటే ఏపీలోనే అతి పెద్ద స్థానం. ఒక విధంగా చెప్పాలీ అంటే మంత్రి స్థాయి హోదా దీనికి ఉంటుంది. ఇప్పటికే ఏడాదికి అయిదారు వేల కోట్ల బడ్జెట్ జీవీఎంసీది. మరో అయిదేళ్ళ కాలం అంటే పది వేల కోట్ల దాకా పెరిగే చాన్స్ ఉంది. ఎందుకంటే జీవీఎంసీ చుట్టూ ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. అలాగే ఐటీ పరిశ్రమలతో పాటు గూగుల్ డేటా సెంటర్ వస్తోంది మరో అయిదారు డేటా సెంటర్లు కూడా వస్తున్నాయి. దాంతో ఇంత భారీ బడ్జెట్ తో ఉన్న జీవీఎంసీ మేయర్ పోస్టు అంటే ఎంతో కీలకమైనదిగా అంతా భావిస్తున్నారు. అంతే కాదు ఏపీలోనే 120 వార్డులతో జీవీఎంసీ అతి పెద్ద కార్పొరేషన్ గా ఏర్పడనుంది. దాంతో విశాఖ మేయర్ మీద అందరి కన్ను ఉంది. ఇపుడు చూతే తమాషాకు అన్నారో లేదా కావాలని అన్నారో తెలియదు కానీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాను విశాఖ మేయర్ గా పోటీ చేయవద్దా అని సంచలన వ్యాఖ్యలే చేశారు.
రవితేజా రెడీనా :
అసలు గంటా ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆయన జీవీఎంసీ ఎన్నికల విషయంలో మాట్లాడేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశాఖ మేయర్ పదవికి గంటా రవిజేతా పేరుని మీడియా పేర్కొంటూ పోటీ చేసే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయని గంటానే ప్రశ్నించింది. అయితె దానికి అవును అని కానీ కాదు అని కానీ సూటిగా గంటా చెప్పకుండా రవితేజా ఎందుకు నేను పోటీ చేయవద్దా అని మీడియాకే తిరిగి ప్రశ్నించారు. అంతే కాదు ఆయన మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ముందు రిజర్వేషన్ల సంగతి తేలాలని, అలాగే కూటమి పార్టీలు అన్నీ కలసి చర్చించుకోవాలని అపుడు కదా ఎవరు పోటీ అన్నది తేలేది అన్నారు. అందువల్ల ఇపుడే ఏది చెప్పినా తొందరపాటే అవుతుంది అని ఆయన అన్నారు.
గంటా ఫ్యామిలీ నుంచేనా :
అయితే గంటా తమాషాగా తాను మేయర్ అభ్యర్ధిగా పోటీ చేయవద్దా అని అంటున్నా ఆయన మనసులో మేయర్ పీఠం మీద ఫోకస్ ఉందని ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో చాలా చోట్ల ఎమ్మెల్యేల వారసులు, మంత్రుల వారసులు మేయర్ జెడ్పీ చైర్మన్ల వంటి వాటికి పోటీకి దిగుతున్నారు. ఆ విధంగా తమ బిడ్డల రాజకీయ ఎంట్రీకి సరైన పునాది వేయాలనుకుంటున్నారు. అంతవరకూ ఎందుకు నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్మన్ పదవికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు రెండవ కుమారుడు పేరు వినిపిస్తోంది. మరో మూడేళ్ల దాకా సార్వత్రిక ఎన్నికలు జరగవు. ఈ లోగా కీలక పదవిలో వారసులు కుదురుకుంటే ఆ సమయంలో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించినా వారికి మెండుగా అవకాశాలు ఉంటాయని ఈలోగా రాజకీయంగా పాలనాపరంగా అనుభవం సంపాదించుకోవడమే కాకుండా తండ్రుల ప్రమేయం లేకుండా వారసులే అధినాయకత్వానికి మరింత సన్నిహితం కావచ్చు అన్న ఆలోచనలు కూడా ఉన్నాయని అంటున్నారు.
బలమైన సామాజిక వర్గం :
ఇదిలా ఉంటే విశాఖ మేయర్ సీటు ఓసీ అయితే మాత్రం గంటా ఫ్యామిలీ నుంచి అభ్యర్ధి ఉండడం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే జీవీఎంసీ పరిధిలో కాపులు అధికంగా ఉన్నారు. బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు కచ్చితంగా ఈ సీటు వారికే కేటాయించేందుకు కూటమి చూస్తుందని అంటున్నారు. కార్పోరేషన్ గా విశాఖ 1979లో అవతరించింది. ఇప్పటిదాకా కాపుల నుంచి మేయర్ అయిన వారు లేరని గుర్తు చేస్తున్నారు. తొలి ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. రెడ్డి సామాజిక వర్గం వారు మేయర్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన డీవీ సుబ్బారావుకి అవకాశం ఇచ్చారు. 1995లో కాంగ్రెస్ నుంచి వెలమ సామాజిక వర్గానికి చెందిన సబ్బం హరి మేయర్ అయ్యారు.
ఎప్పటి నుంచో డిమాండ్ "
2000లో యాదవ సామాజిక వర్గానికి చెందిన రాజాన రమణి కాంగ్రెస్ నుంచి మేయర్ అయ్యారు, 2007లో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన పులుసు జనార్ధనరావు కాంగ్రెస్ తరఫున మేయర్ అయ్యారు. 2021లో యాదవ సామాజిక వర్గానికి చెందిన హరి వెంకట కుమారి మేయర్ వైసీపీ నుంచి అయ్యారు. ఇక చివరి ఏడాది టీడీపీ నుంచి గవర సామాజిక వర్గానికి చెందిన పీలా శ్రీనివాసరావు మేయర్ అయ్యారు. దాంతో ఈసారి మేయర్ పదవి తమకు ఇవ్వాలని కాపులు కోరుతున్నారు. కాపులకు కేటాయిస్తే విశాఖ జిల్లా మీద గట్టి పట్టు ఉన్న గంటా శ్రీనివాసరావు తన కుమారుడిని మేయర్ అభ్యర్థిగా ముందు పెట్టి కచ్చితంగా గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం అయితే సాగుతోంది. మరి చూడాలి ఏమి జరుగుతుందో.