తమిళనాడుకు నష్టం, ఏపీకి భారీ లాభం!?.. దళపతి నిర్ణయంపై హాట్ డిబేట్

చెన్నై సమీపంలో పరందూర్ విమానాశ్రయ ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీసుకున్న నిర్ణయం పెను దుమారం రేపుతోంది.

Update: 2026-08-25 08:17 GMT

చెన్నై సమీపంలో పరందూర్ విమానాశ్రయ ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీసుకున్న నిర్ణయం పెను దుమారం రేపుతోంది. టీవీకే ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం పక్క రాష్ట్రం ఏపీకి కలిసివస్తుందని సోషల్ మీడియాలో హాట్ డిబేట్ కొనసాగుతోంది. ప్రధానంగా చెన్నై పరిసరాల్లో పరిశ్రమలు పెట్టాలని భావించిన పారిశ్రామిక వేత్తలు వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. సారవంతమైన భూముల్లో విమానాశ్రయం పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, భవిష్యత్తులో ఎదురవనున్న పరిణామాలను సీఎం విజయ్ అంచనా వేశారా? లేదా? అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోందని అంటున్నారు.

చెన్నై రెండో విమానాశ్రయం రద్దు నిర్ణయం పారిశ్రామిక ప్రగతికి అడ్డుగా నిలుస్తుందని తమిళ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయాన్ని మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు. అదేవిధంగా విపక్షంలో ఏఐఎండీకే కూడా ప్రత్యామ్నాయ ప్రతిపాదన లేకుండా పెరందూర్ విమానాశ్రయ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు ప్రకటన చేయడం వల్ల రాష్ట్రం నష్టపోతుందని వ్యాఖ్యనించింది. పారిశ్రామక వర్గాలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. కాగా, ముఖ్యమంత్రి విజయ్ ప్రకటనను కాంగ్రెస్ తోపాటు రైతు సంఘాలు స్వాగతించాయి.

చెన్నైలోని మీనంబాకం విమానాశ్రయానికి రద్దీ ఎక్కువగా ఉండటంతో రెండో విమానాశ్రయం నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పెరందూర్ సమీపంలో 5,369 ఎకరాలను కేటాయించింది. డీఎంకే ప్రభుత్వం గద్దె దిగేనాటికి 1700 ఎకరాల భూములను సేకరించింది. అయితే మొత్తం 12 గ్రామాల పరిధిలో వేల ఎకరాలను సేకరించడాన్ని అక్కడి రైతులు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. సారవంతమైన సాగుభూముల్లో విమానాశ్రయం నిర్మిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇక ఎన్నికల ముందు ఆ ప్రాంతాన్ని సందర్శించిన టీవీకే అధినేత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండో విమానాశ్రయంపై పునరాలోచిస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక సోమవారం అసెంబ్లీలో విమానాశ్రయం ప్రతిపాదన రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ టీవీకే ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రం పెట్టుబడులను కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు, ఆటోమొబైల్ రంగాల్లో దూసుకుపోతున్న చెన్నైకి రెండో అంతర్జాతీయ విమానాశ్రయం అత్యవసరమని, ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి మందగించడమే కాక, యువత ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఈ నిర్ణయం పొరుగు రాష్ట్రమైప ఏపీకి లాభం చేకూరుతుందని డీఎంకే నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీలోనూ దీనిపై పెద్దయెత్తున నిరసన తెలిపి డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు.

ఇక తమిళనాడుకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కూడా టీవీకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ట ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. చెన్నై చుట్టూ ఉన్న శ్రీపెరంబూర్ లో ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ పరిశ్రమలు భారీగా విస్తరించి ఉన్నందున, భవిష్యత్ రవాణా అవసరాలరీత్యా పరందూర్ ప్రాజెక్ట్ అత్యంత కీలకమని పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. ఇప్పుడు పెరందూర్ విమానాశ్రయాన్ని ప్రభుత్వం విరమించుకోవడం వల్ల పెట్టుబడులు పక్కనే ఉన్న ఏపీలోని శ్రీసిటీకి తరలిపోయే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ప్రస్తుతం ప్రతిపాదనల్లో ఉన్న విమానాశ్రయం బదులుగా మరోచోట విమానాశ్రయం కోసం స్థలం చూడటం, అక్కడ విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు సాధించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ లోగా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఏపీకి తరలిపోయే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణ విషయంలో దూకుడు చూపుతోందని అంటున్నారు. శ్రీసిటీని ఎలక్ట్రానిక్స్ కారిడార్ గా అభివృద్ధి చేయడంతోపాటు పలు పరిశ్రమలు నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించాయని చెబుతున్నారు. ఇదే సమయంలో చెన్నై, బెంగళూరుకు సమీపంలో కుప్పం విమానాశ్రయం నిర్మాణం కూడా తమిళనాడు పెట్టుబడులపై ప్రభావం చూపవచ్చునని అంటున్నారు. మొత్తానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక లేకుండా పెరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు సీఎం విజయ్ ప్రకటించడమే హాట్ టాపిక్ అవుతోంది.

Tags:    

Similar News