పొత్తులపై వైసీపీ స్టాండ్...ఏపీలో సీన్ ఇదే !
ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. అందులో మూడు పార్టీలు ముచ్చటగా కలిసి ఉన్నాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. అందులో మూడు పార్టీలు ముచ్చటగా కలిసి ఉన్నాయి. బీజేపీ జనసేన టీడీపీ సఖ్యతగా రెండేళ్ళకు పైగా ప్రభుత్వాన్ని నడిపిన తరువాత స్థానిక ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. ఈసారి ఎక్కువ సీట్లను మిత్ర పక్షాలు అయిన జనసేన బీజేపీ కోరుతున్నాయి కానీ టీడీపీ అన్నీ ఆలోచించి ఆమోదయోగ్యమైన సర్దుబాటు చేస్తుందని అంతా ఆశిస్తున్నారు. అధిక సీట్లు మిత్రులు కోరడం సహజం అయినా ఎవరికి ఎక్కడ ఏ మేరకు బలం ఉందో చూసుకుని టీడీపీ ఇబ్బంది లేకుండా పొత్తులతో ముందుకు వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం సీట్ల డిమాండ్లు మిత్రుల మధ్య వస్తున్నా చివరికి అంతా కలసికట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికల రంగంలోకి దిగుతారు అని అంటున్నారు. సో కూటమి వైపు నుంచి చీలికలు ఉండవు, ఇబ్బందులు అంతకంటే రావు అన్నది రాజకీయ విశ్లేషకులకు కూడా ఒక క్లారిటీ ఉంది.
వైసీపీ సంగతేంటి :
మరి విపక్షంలో ఉన్న వైసీపీ సంగతి ఏమిటి అన్నదే ఇక్కడ ప్రశ్న. 2024 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళి మూడు పార్టీల కూటమితో తలపడి చేదు ఫలితాలను వైసీపీ మూటకట్టుకుంది. కేవలం 11 సీట్లు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. కూటమిలో విభేదాలు వస్తాయని వైసీపీ ఆలోచించినా అది జరిగేది కాదని కూడా అర్థం అవుతూనే ఉంది. మరి కూటమిగా బలంగా ఉన్న పార్టీలను ఢీ కొనడం అంటే సాహసమే అన్నది కూడా తెలుస్తోంది. వైసీపీ దీని మీద ఈ రకమైన వ్యూహాన్ని ఎంచుకుంటుంది అన్నది చర్చగా ఉంది. అయితే ప్రస్తుతానికి పార్టీలో వినిపిస్తున్న దాని ప్రకారం ఒంటరిగా పోటీకే వైసీపీ మొగ్గు చూపిస్తోంది అని అంటున్నారు.
వామపక్షాలతో అంటూ :
ఆ మధ్య దాకా వామపక్షాలతో వైసీపీ కొత్త బంధం అంటూ వార్తలు వచ్చాయి. వారితో కలిసి ప్రజా ఉద్యమాలు చేయాలని కూడా నిర్ణయించారని కూడా ప్రచారం కూడా సాగింది. అయితే అవేమీ ఆచరణలో జరగలేదు, ప్రజా పోరాటాలలో ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్థితి ఉంది. పైగా వామపక్షాలతో పొత్తుల దాకా వైసీపీ రాజకీయ కధ సాగేందుకు ఆస్కారం కూడా కనిపించడం లేదని అంటున్నారు. వామపక్షాలు ప్రజా సంఘాలతో పాటు కొత్తగా పార్టీ ఏర్పాటు చేస్తామని చెబుతున్న ఏబీ వెంకటేశ్వరరావు వంటి వారితో కలిసి ఉమ్మడి వేదిక ఏర్పాటు చేయాలని చూస్తోంది అని అంటున్నారు. దాంతో ఎవరి దారి వారిదే అని కూడా చెబుతున్నారు. ఇక వైసీపీ మొదటి నుంచి ఒంటరి పోరాటాన్ని నమ్ముకుంది. దాంతో అదే బాటన నడవనుంది అని అంటున్నారు.
ధీమా అదేనా :
ఏపీలో కూటమికి జనాదరణ తగ్గిందని వైసీపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. అంతే కాదు 2024 ఎన్నికలకు 2026లో జరిగే స్థానిక ఎన్నికలకు బాగా తేడా ఉంటుందని కూడా ఊహిస్తున్నారు. దాంతో వైసీపీ ఒంటరిగా వెళ్ళినా కూడా మంచి ఫలితాలే సాధిస్తుందని కూడా నమ్ముతున్నారు. తమకు బలం ఉన్న స్థానాలను తప్పకుండా గెలుచుకుంటామని ఇక గతంలో గట్టి పోటీ ఉన్న చోట కూడా ఈసారి తాము విజయం సాధించేలా వ్యూహాలు రచిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చూస్తే ఏపీలో స్థానిక ఎన్నికలు కూటమి వర్సెస్ వైసీపీగానే జరుగుతాయని అంటున్నారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇతర పార్టీలు పోటీ చేసినా అసలైన రాజకీయ యుద్ధం ఈ రెండు శిబిరాల మధ్యనే ఉంటుందని అంటున్నారు. ఇక 2024 లో 56 శాతం ఓటు షేర్ సాధించిన కూటమి ఈసారి ఎంత షేర్ ని రాబడుతుంది అన్నది ఒక చర్చ అయితే వైసీపీ 40 శాతం ఓటు షేర్ మరింతగా పెరుగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.