మేయర్ బరిలో వంగవీటి వారసులు ?

స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఏపీలో రాజుకుంటోంది. అధికార కూటమి పార్టీలు ఆ దిశగా పావులు కదుపుతున్నాయి.

Update: 2026-08-24 23:30 GMT

స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఏపీలో రాజుకుంటోంది. అధికార కూటమి పార్టీలు ఆ దిశగా పావులు కదుపుతున్నాయి. టీడీపీ కూటమిలో పెద్ద పార్టీగా తనదైన యాక్షన్ ప్లాన్ తో ముందుకు సాగుతోంది. ఇక జనసేన కూడా విధాన కమిటీ అని ఏర్పాటు చేసింది. ఏపీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దిశా నిర్దేశంతో బీజేపీలో కూడా ఉత్సాహం కనిపిస్తోంది. ఇక ఏపీలో కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు, జెడీపీ చైర్ పర్స్నలు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. వీటితో పాటు మండల పరిషత్తుల చైర్ పర్స్నన్ లకు రూరల్ జిల్లాలలో పెద్ద పోటీ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో టైర్ టూ సిటీస్ చాలా ఉన్నాయి. వాటిలో మేయర్ పీఠం కోసం రాజకీయ పార్టీలు అన్నీ ఫుల్ గా ఫోకస్ పెడుతున్నారు. ఎంతటి గెలుపు వచ్చినా కీలక నగరాల్లో మేయర్ పీఠం దక్కితే ఆ కిక్కే వేరు అని కూడా భావిస్తున్నారు.

విజయవాడ మేయర్ కోసం :

విజయవాడ అంటే ఏపీకి రాజకీయ రాజధాని అని వేరేగా చెప్పాల్సిన పని లేదు. అంతే కాదు అమరావతి రాజధాని పరిసర నగరం. ఇక రాజకీయ చైతన్యం నిండుగా మెండుగా ఉన్న సిటీ. విజయవాడ మేయర్ పీఠం అంటే ఆ దర్జా వేరు అని అంతా భావిస్తారు. ఈ పీఠం కైవశం చేసుకోవడం కోసం కూటమి పార్టీలు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. విజయవాడ మేయర్ స్థానాన్ని 2021 ఎన్నికల్లో వైసీపీ కైవశం చేసుకుంది. ఈసారి మాత్రం తమదే అని టీడీపీ భావిస్తోంది. ఆ పార్టీలో చాలా మంది ఆశావహులు ఈ మేయర్ సీటు కోసం అపుడే రేసులో ఉన్నారు. ఇందులో కొంతమంది రాజకీయ ప్రముఖుల వారసులు కూడా రెడీ అవుతున్నారు.

బోండా ఉమా వారసుడు :

ఇక విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నుంచి రెండో సారి 2024 ఎన్నికల్లో గెలిచిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తన కుమారుడి రాజకీయ ఎంట్రీకి విజయవాడ మేయర్ పీఠం సరైనది అని భావిస్తున్నారు. ఈ విషయం మీద ఆయన అధినాయకత్వంతో ఈసరికే మాట్లాడారు అని అంటున్నారు. ఈ మధ్య తన తండ్రికి మద్దతుగా బోండా కుమారుడు మీడియా ముందుకు వచ్చి వైసీపీ నేతల మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దానిని బట్టి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా హింట్ ఇచ్చారని అపుడే అనుకున్నారు. ఇపుడు ఏకంగా మేయర్ పీఠానికే జూనియర్ బోండా గురి పెట్టారు అని అంటున్నారు. కాపుల కోటాలో ఈ సీటు మీద బోండా ఫ్యామిలీ కర్చీఫ్ వేసింది అని అంటున్నారు.

వంగవీటి ఫ్యామిలీ నుంచి :

ఇక వంగవీటి కుటుంబం నుంచి రంగా కుమార్తె ఆశా కిరణ్ ఈ మధ్య రాజకీయంగా చురుకుగా ఉంటున్నారు. ఆమె ఏడాది క్రితం విశాఖలో రంగానాడు పెట్టి సంచలనం సృష్టించారు. ఆమె మొదట్లో వైసీపీలోకి వెళ్తారు అని ప్రచారం జరిగినా ఆమె జనసేన వైపు చూస్తున్నారు అని కూడా ఈ మధ్య వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇపుడు టీడీపీ నేరుగా ఆమెనే విజయవాడ మేయర్ అభ్యర్ధిగా పార్టీలోకి తీసుకుని ప్రకటిస్తుందని అంటున్నారు. ఆ విధంగా టీడీపీ తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తుందని అంటున్నారు. వంగవీటి ఫ్యామిలీకి న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతో పాటు కాపులను కూడా ఆకట్టుకోవాలన్న ఆలోచన ఈ నిర్ణయం వెనక ఉంది అని అంటున్నారు. ఇప్పటికే వంగవీటి రాధాక్రిష్ణ టీడీపీలో ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ సీటు కానీ దక్కలేదు, వాటన్నింటికీ జవాబుగా ఆశా కిరణ్ ని పార్టీలోకి తెచ్చి ఏపీ రాజధాని నగరానికి మేయర్ గా చేసి చూపించాలని తద్వారా బలమైన సామాజిక వర్గాన్ని మరింత దగ్గర చేసుకోవాలన్న ఎత్తుగడతో టీడీపీ ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News