కెరీర్ స్థిరత్వమా? భయంతో కూడిన నిర్ణయమా? ఏంటి ఈ 'జాబ్ హగ్గింగ్' ట్రెండ్
ఒకప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని సాధించడానికి 'జాబ్ హగ్గింగ్' లేదా తరచూ కంపెనీలు మారడం ఒక ప్రభావవంతమైన వ్యూహంగా ఉండేది.
ఒకప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని సాధించడానికి 'జాబ్ హగ్గింగ్' లేదా తరచూ కంపెనీలు మారడం ఒక ప్రభావవంతమైన వ్యూహంగా ఉండేది. మెరుగైన జీతం, కొత్త బాధ్యతలు, వేగవంతమైన ప్రమోషన్ల కోసం ఉద్యోగులు ఏడాది లేదా రెండేళ్ల వ్యవధిలోనే కొత్త సంస్థలకు మారిపోయేవారు. అయితే ప్రస్తుతం ఐటీ, టెక్నాలజీ రంగాలలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న లేఆఫ్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెస్తున్న మార్పులు, ఆర్థిక అనిశ్చిత వాతావరణం వల్ల ఉద్యోగుల ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కొత్త అవకాశాల కోసం బయటకు వెళ్లేకంటే ఉన్న ఉద్యోగాన్ని గట్టిగా పట్టుకుని అదే సంస్థలో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కొత్త ధోరణినే కార్పొరేట్ వర్గాలు 'జాబ్ హగ్గింగ్' అని పిలుస్తున్నాయి.
ఈ జాబ్ హగ్గింగ్ ధోరణి పెరగడానికి ప్రధానంగా ఉద్యోగ భద్రతే ముఖ్య కారణమని చెప్పవచ్చు. కొత్త కంపెనీ అధిక జీతం ఆఫర్ చేసినప్పటికీ అక్కడ ఉద్యోగం ఎంతకాలం సురక్షితంగా ఉంటుందనే హామీ లభించడం లేదు. ముఖ్యంగా ఆర్థిక మందగమనం లేదా పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా చేరిన వారిపైనే లేఆఫ్స్ ప్రభావం ఎక్కువగా ఉంటోందనే భావన చాలామందిలో ఉంది. దీనికి తోడు ప్రస్తుత జీవన విధానంలో ఈఎంఐలు, పిల్లల చదువులు, కుటుంబ బాధ్యతలు, పెరిగిన జీవన వ్యయాలు ఉద్యోగులను పెద్దగా రిస్కులు తీసుకోకుండా నిరోధిస్తున్నాయి. తెలిసిన టీమ్, పరిచయమైన వర్క్ కల్చర్, పట్టున్న ప్రాజెక్టుల మధ్య పనిచేయడమే మానసికంగా ప్రశాంతతను ఇస్తుందని భావిస్తున్నారు. అలాగే ఏఐ విప్లవం తెస్తున్న మార్పుల వల్ల కొత్త ప్రదేశానికి వెళ్లి ప్రొబేషన్ పీరియడ్‌లో సవాళ్లు ఎదుర్కొనే కంటే ఉన్న సంస్థలోనే కొత్త టెక్నాలజీలు నేర్చుకుని తమ స్థానాన్ని బలపరుచుకోవడం మేలని భావిస్తున్నారు.
అయితే జాబ్ హగ్గింగ్ అనేది పూర్తిగా సానుకూల పరిణామమే అని చెప్పలేం. ఒకే సంస్థలో ఎక్కువ కాలం ఉండటం వల్ల కంపెనీతో మంచి సంబంధాలు, నెట్‌వర్కింగ్, స్థిరత్వం లభించినప్పటికీ, నాణేనికి మరోవైపు ఉన్న ప్రతికూలతలను విస్మరించలేం. సాధారణంగా ఒకే కంపెనీలో పొందే వార్షిక పెంపు కంటే కొత్త కంపెనీకి మారినప్పుడు లభించే ప్యాకేజీ పెంపు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆర్థిక వృద్ధి వేగం తగ్గుతుంది. అంతేకాకుండా విభిన్న పని వాతావరణాలు, కొత్త ప్రాజెక్టులు అనుభవం లోపించడం వల్ల నైపుణ్యాల పెంపు పరిమితమై, దీర్ఘకాలంలో కెరీర్ వృద్ధి మందగించే ప్రమాదం కూడా ఉంది.
ప్రస్తుత అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల్లో ఉద్యోగం మారకపోవడం అనేది ఒక వ్యూహాత్మక స్థిరత్వానికి సంకేతం కావచ్చు. కానీ అది కేవలం భయం వల్ల మాత్రమే తీసుకునే నిర్ణయం అయితే మాత్రం కెరీర్ వృద్ధికి ప్రతిబంధకంగా మారుతుంది. స్థిరత్వాన్ని కోరుకుంటూనే మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండటమే ఉద్యోగులకు సురక్షితమైన మార్గం.