కొండా ఫ్యామిలీకి భ‌ట్టి మార్క్ షాక్ ..!

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది

Update: 2026-08-24 16:45 GMT

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కొండా సురేఖ కుమార్తె చేసిన తీవ్ర వ్యాఖ్యల వెనుక మంత్రి కొండా సురేఖ మద్దతు ఉందని హైకమాండ్ ఒక స్పష్టమైన క్లారిటీకి రావడంతో పార్టీలో వారు క్రమంగా ఒంటరి అవుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తమకు ఒక కీలక వర్గం అండదండలు ఉన్నాయని చెప్పేందుకు కొండా ఫ్యామిలీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల క్రమంలో వారు వేసిన రాజకీయ వ్యూహం తీవ్రంగా బెడిసికొట్టింది. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలక నేతగా ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి, పార్టీలో తమకు అన్యాయం జ‌రుగుతున్న‌ట్టు చెప్ప‌డంతో పాటు... భ‌ట్టి మద్దతు ఉందనే బలమైన సంకేతాన్ని అధిష్టానానికి.. సొంత పార్టీలోని నేత‌ల‌కు చెప్పాల‌ని కొండా మురళి తీవ్రంగా ప్రయత్నించారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని భట్టి విక్రమార్క ఆయనకు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఈ వివాదంలో తలదూర్చడం వల్ల అనవసర సమస్యలు వస్తాయని, ఒక వర్గానికి మద్దతుగా నిలిచినట్లు పుకార్లు రావ‌డం ఏమాత్రం మంచిది కాదనే భావనతోనే డిప్యూటీ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేత నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడం, కనీసం భేటీకి సైతం అవకాశం దక్కకపోవడంతో కొండా వర్గానికి పెద్ద రాజకీయ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ఇదిలా ఉంటే కొండా సుస్మిత వ్యాఖ్య‌లు చేసిందో లేదో వెంట‌నే కొండా కుటుంబ విష‌యంలో ప్ర‌భుత్వ పెద్ద‌ల తీరు కూడా మారింది. కొండా, ఆయ‌న అనుచ‌రుల సెటిల్మెంట్ల వ్యవహారాలపై పోలీసుల దర్యాప్తు అనూహ్యంగా చాలా వేగం పుంజుకుంది. అధికార యంత్రాంగం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ డ్రైవర్‌ను పోలీసులు శనివారం ఉదయమే తెల్లాపూర్ పరిధిలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఒక వ్యాపారిని బెదిరించి రూ. 10 కోట్లు డిమాండ్ చేసిన కేసులో పోలీసులు ఈ అరెస్టు చేశారు. పాత వివాదాలు, ఫోన్ సంభాషణలు, అలాగే తాజా పరిణామాలపై మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ఆ డ్రైవర్‌ను లోతుగా విచారిస్తున్నారు.

ఈ సంచలన అరెస్టుతో పోలీసు విభాగం కూడా వ్యవహారాన్ని చాలా కఠినంగా డీల్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఒకవైపు సొంత పార్టీకి చెందిన 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి కొండా సురేఖపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. మరోవైపు ప్రభుత్వ పెద్దల నుంచి అపాయింట్‌మెంట్లు దక్కకపోవడం, దానికి తోడు అనుచరుల అరెస్టుల పరంపర కొనసాగుతుండటంతో కాంగ్రెస్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధిష్టానం ఈ పంచాయితీపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందోనని కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News