సీజేపీ 'దెబ్బ'.. సీఎం అబ్బా.. రాజస్థాన్ స్కూళ్లకు రూ.12,500 కోట్లతో ఓ భారీ 'కాస్మోటిక్ మేకప్'

రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు ఆకాశాన్ని అందుకునే హామీలు గుప్పించడం మనం ఎప్పుడూ చూసే ముచ్చటే.

Update: 2026-08-24 17:10 GMT

రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు ఆకాశాన్ని అందుకునే హామీలు గుప్పించడం మనం ఎప్పుడూ చూసే ముచ్చటే. కానీ ఒక చిన్నపాటి ప్రతిపక్ష పార్టీ మైకులు పట్టుకుని నిరసన తెలపగానే ఏకంగా అక్షరాలా రూ.12,500 కోట్లతో పాఠశాలలకు కొత్త రూపు ఇస్తామంటూ రాజస్థాన్ ప్రభుత్వం ఖజానాను తలక్రిందులు చేయడం బహుశా దేశ విద్యా చరిత్రలోనే సరికొత్త అధ్యాయం.

‘కాక్రోచ్ జనతా పార్టీ’ వారు తమ ‘స్కూలును బాగు చేయండి’ అనే కార్యక్రమంతో రోడ్లపైకి వచ్చి నాలుగు ప్రసంగాలు దంచడమే ఆలస్యం.. సర్కారు వారికి ఎక్కడ లేని జ్ఞానోదయం హఠాత్తుగా కలిగింది. అయ్యో ఇన్నాళ్లూ మన స్కూళ్లలో విద్యార్థులు కూర్చోవడానికి సరిపడా బెంచీలు లేవా.. వర్షం వస్తే కారకుండా ఉండే పటిష్టమైన కప్పులు లేవా అని కంగారుపడిపోయిన పాలకులు, వెంటనే రానున్న మూడేళ్ల కాలానికి ఒక భారీ విజన్ ప్లాన్‌తో రంగంలోకి దిగేశారు.

ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన వివరాలు చూస్తే సామాన్యుడికి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఏకంగా 3,587 కొత్త భవనాలు నిర్మించి ఇన్నాళ్లూ చెట్ల కింద సాగిన బోధనా విన్యాసాలను నాలుగు గోడల మధ్యకు చేర్చబోతున్నారు. అలాగే విద్యార్థుల సంఖ్య కంటే గోడల సంఖ్య పెరిగినా ఆశ్చర్యం లేనంతగా 83,783 కొత్త తరగతి గదులను నిర్మించడమే కాకుండా ఇప్పటివరకూ సున్నం వేయక వర్షాలకు నానిన 22,589 పాత పాఠశాల భవనాలకు ఒక రేంజ్‌లో రంగులు మార్చే రిపేరు ప్రక్రియను ప్రారంభించనున్నారు.

ఈ పరిణామంతో సీజేపీ నాయకులు ఆల్రెడీ తమ ఆఫీసుల వద్ద మిఠాయిలు పంచేసుకుంటూ తాము ఒక్క ధర్నా చేస్తేనే ప్రభుత్వం రూ.12,500 కోట్లు వెచ్చించాల్సి వచ్చిందని క్రెడిట్ కొట్టేసే పనిలో పడ్డారు. ఇటు ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇది తమ ముందుచూపే తప్ప, ప్రతిపక్షాల భయంతో చేసింది కాదని గంభీరంగా వాదిస్తున్నాయి.

ఏది ఏమైనా ఈ రాజకీయ పార్టీల ముష్టియుద్ధాలు.. డ్రామాల మధ్య నిరుపేద విద్యార్థులకు కూర్చోవడానికి సరైన క్లాస్‌రూమ్‌లు, సురక్షితమైన గోడలు లభిస్తే అదే పదివేలు. అయితే ఈ 12,500 కోట్ల భారీ నిధులు నిజంగానే బడుల నిర్మాణానికి ఉపయోగపడతాయా లేక కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లి మధ్యలోనే ఆవిరైపోతాయా అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News