ఏఐతో కంటెంట్ వరద.. కానీ 'ఒరిజినల్' సరుక్కున్న పవర్ వేరు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో డిజిటల్ కంటెంట్ ప్రపంచం ఒక ఊహించని విప్లవాన్ని చూస్తోంది.
ఇంటర్నెట్‌లో ఏఐ సృష్టిస్తున్న ‘వంటల’ వరదలో నిమిషానికో వ్యాసం పుట్టుకొస్తుండొచ్చు.. కానీ రుచి చూసే పాఠకుడికి అది కడుపు నింపని కేవలం "జెనరిక్ మసాలా" మాత్రమే.. క్షణాల్లో కంటెంట్ దంచేసే మెషిన్లతో మనుషులు పోటీపడటం అసాధ్యమే కావచ్చు.. కానీ ఆలోచన, అనుభవం, నిజాన్ని నిలదీసే ధైర్యం లేని చోట ఆ ఏఐ కత్తెర్లు, కాపీ పేస్ట్‌లు అన్నీ వేస్ట్. కంటెంట్ చౌకగా దొరికే చోట కాపీలు కాదు.. అసలైన "ఒరిజినల్ పవర్" ఉన్నవాడే కింగ్.. మరి ఈ ఏై సునామీని తట్టుకుని నిలబడే ఆ ఆరిజినల్ కంటెంట్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో డిజిటల్ కంటెంట్ ప్రపంచం ఒక ఊహించని విప్లవాన్ని చూస్తోంది. గతంలో ఒక సమగ్రమైన ఆర్టికల్ రాయడానికి గంటల సమయం పట్టే పని.. నేడు కొన్ని నిమిషాలు లేదా సెకన్ల వ్యవధిలోనే పూర్తవుతోంది. ఒకే అంశంపై వందలాది ఆర్టికల్స్.. సోషల్ మీడియా పోస్టులు.. వీడియో స్క్రిప్టులు క్షణాల్లో రూపుదిద్దుకుంటున్నాయి. ఏఐ కంటెంట్ ఉత్పత్తికి అయ్యే ఖర్చును.. సమయాన్ని గణనీయంగా తగ్గించిన మాట వాస్తవమే. కానీ ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న ఎదురవుతోంది.. సమాచారం ఎంత పెరిగింది అనే దానికంటే... అందులో నిజంగా ఉపయోగపడే కంటెంట్ ఎంత ఉందనేదే ఇప్పుడు ప్రధానాంశం.
ఏఐ కంటెంట్ పరిమితులు.. ఒకే తరహా సమాచారం
అందుబాటులో ఉన్న పాత సమాచారాన్ని ప్రాసెస్ చేసి కంటెంట్‌ను జనరేట్ చేయడంలో ఏఐ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దీనివల్ల కంటెంట్‌లో రిపిటేషన్స్, జనరిక్ సమాచారం.. ఒకే శైలికి చెందిన భాష కనిపించే ప్రమాదం ఎక్కువ. ఫలితంగా పాఠకుడికి కొత్తగా ఏమీ అందించలేని పాఠాలు ఇంటర్నెట్‌లో వరదలా ముంచెత్తుతున్నాయి. ఇంటర్నెట్‌లో సమాచారానికి కొరత లేదు, కానీ నమ్మదగిన కొత్త సమాచారానికే తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది.
మనిషి ఆలోచన.. ఒరిజినల్ కంటెంట్‌కే ప్రాధాన్యత
ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు సృష్టించే ఒరిజినల్ పర్స్పెక్టివ్‌కు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఒక జర్నలిస్ట్ నేరుగా వెళ్లి చేసిన ఇంటర్వ్యూ.. ఒక సంస్థ నుంచి సేకరించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం.. గ్రౌండ్ రిపోర్టింగ్.. కొత్తగా విశ్లేషించిన డేటా లేదా ఒక నిపుణుడి ప్రత్యేక అభిప్రాయం... ఇవన్నీ సాధారణ ఏఐ జనరేటివ్ కంటెంట్ కంటే ఎంతో ఎక్కువ విలువను కలిగి ఉంటాయి. సెర్చ్ ఇంజిన్లు కూడా భవిష్యత్తులో కేవలం పదాల సంఖ్య లేదా వేగాన్ని కాకుండా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్, విశ్వసనీయత, ఉపయోగపడే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నాయి.
రచయితల పాత్రలో రాబోయే మార్పులు
ఈ కొత్త యుగంలో రైటర్స్ ఏఐతో 'వేగం' విషయంలో పోటీ పడటం అసాధ్యం. కానీ మంచి రచయిత పోటీ తత్వపు బలం వేగం కాదు.. ఏ ప్రశ్న అడగాలి? ఏ కోణంలో చూడాలి? ఏ సమాచారాన్ని ధృవీకరించాలి? పాఠకుడికి తెలియని విషయాన్ని ఎలా బయటకు తీయాలి? అనే ఆలోచనా శక్తే వారి అసలు బలం.
అందుకే ఏఐని పూర్తిస్థాయి కంటెంట్ రైటర్ రీప్లేస్‌మెంట్‌గా కాకుండా రీసెర్చ్.. బ్రెయిన్‌స్టార్మింగ్.. డ్రాఫ్టింగ్ వంటి పనుల్లో ఉపయోగించే ఒక పవర్ ఫుల్ టూల్ గా చూడటం సమర్థవంతమైన విధానం.. తుది కంటెంట్‌కు మనిషి ఆలోచన, నిజనిర్ధారణ, అనుభవం, జడ్జిమెంట్ జోడించినప్పుడే దానికి ప్రత్యేకమైన విలువ వస్తుంది. ఒక వెబ్‌సైట్‌లో 100 సాధారణ ఆర్టికల్స్ ఉండటం కంటే.. నిజమైన విలువనిచ్చే 10 ఒరిజినల్ ఆర్టికల్స్ ఉండటం బ్రాండ్ ఇమేజ్‌ను.. ఇంపాక్ట్‌ను పెంచుతుంది.
ఏఐ సమాచారాన్ని వేగంగా ఇవ్వగలదు. కానీ అనుభవం, పరిశీలన, ప్రశ్నించే ధైర్యం, ప్రత్యేకమైన దృష్టికోణం, నమ్మకం.. ఇవే ఒక మనిషి సృష్టించే కంటెంట్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి. కాబట్టి ఏఐతో పోటీ పడాల్సింది వేగంలో కాదు.. ఒరిజినాలిటీ, అనుభవం, విశ్లేషణ, విశ్వసనీయతలో.. డిజిటల్ ప్రపంచంలో కంటెంట్ వరద పెరిగే కొద్దీ.. జెన్యూన్ ఒరిజినల్ కంటెంట్ విలువ కూడా అంతే వేగంగా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.