చిన్న Subscriptions.. పెద్ద భారం: మన జీతాన్ని కరిగిస్తున్న Digital ఖర్చులు!

సబ్‌స్క్రిప్షన్ పరిశ్రమ భారతదేశంలో భారీగా విస్తరిస్తోందని గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో వీడియో సబ్‌స్క్రిప్షన్లు ఇప్పటికే 200 మిలియన్ల మార్కును దాటగా..

Update: 2026-08-24 13:30 GMT

ఒకప్పుడు సగటు కుటుంబ బడ్జెట్‌లో కేవలం డీటీహెచ్, న్యూస్‌ పేపర్‌ మాత్రమే ఉండేవి. కానీ నేడు డిజిటల్ యుగంలో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నెట్‌ఫ్లిక్స్, జియో-హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో వంటి ఓటీటీలతో పాటు స్పాటిఫై, యూట్యూబ్ ప్రీమియం, గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్, గేమింగ్ ప్యాక్‌లు .. అధునాతన ఏఐ (AI) టూల్స్ వరకు ప్రతి ఒక్కటి మన మంత్లీ బడ్జెట్‌లోకి నిశ్శబ్దంగా చేరిపోయాయి. నెలకు కేవలం రూ.149 మాత్రమే! అనే ఆకర్షణీయమైన ధ‌ర‌ల‌ స్ట్రాటజీ మనకు ఖర్చు చాలా తక్కువగా అనిపించేలా చేస్తుంది. కానీ అన్నింటినీ కలిపి లెక్కకడితే అది ప్రతి నెలా మన జీతంలో కనిపించకుండా పెరిగిపోతున్న ఒక పెద్ద ఫైబర్ (అన్ ఎక్స్ పెక్టెడ్) ఎక్స్‌పెన్స్‌గా మారుతోంది.

ఈ డిజిటల్ లైఫ్‌స్టైల్‌లో పర్సనల్ డూప్లికేషన్ ఖర్చులు.. ఆటో-రెన్యూవల్స్ ప్రధాన సమస్యగా మారాయి. ఒకే ఇంట్లో వేర్వేరు వ్యక్తులు ఒకే సేవ కోసం వేర్వేరు సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవడం వల్ల ఊహించని ధనం వృథా అవుతోంది. ఉచిత వర్షన్లు అందుబాటులో ఉన్నా కానీ.. అడ్వర్‌టైజ్‌మెంట్ల గోల లేకుండా కన్వీనియన్స్ పొందడం కోసమే ఎక్కువమంది ప్రీమియం వర్షన్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు మనకు తెలియకుండానే ఖాతాల నుంచి కట్ అయ్యే ఆటో-డెబిట్ ఫీచర్ వల్ల చాలామంది తాము ఉపయోగించని సేవలకి కూడా నెలనెలా బిల్లులు చెల్లిస్తూనే ఉన్నారు. మనం ఒకప్పుడు వస్తువులను కొనుగోలు చేసే యాజమాన్య సంస్కృతి నుండి ఇప్పుడు సర్వీసులను అద్దెకు తీసుకునే సబ్‌స్క్రిప్షన్ కల్చర్ వైపు వేగంగా మారుతున్నాము.

ఒక వ్యక్తి ఆదాయ స్థాయిని బట్టి ఈ సబ్‌స్క్రిప్షన్ల ట్రెండ్ కూడా మారుతోంది. ఉదాహరణకు నెల‌కు రూ.50,000 జీతం పొందే ఒక వ్యక్తి నెలకు 1000 నుండి 1500 వరకు కేవలం బేసిక్ ఓటీటీలు, మ్యూజిక్ యాప్‌ల కోసం వెచ్చిస్తే.. అదే 1 లక్ష జీతం సంపాదించే వ్యక్తి ప్రొఫెషనల్ ఏఐ టూల్స్.. హై-ఎండ్ క్లౌడ్ స్టోరేజ్.. ఓవర్సీస్ స్ట్రీమింగ్ సేవలతో నెలకు రూ.4000 నుండి రూ.6000 వరకు వెచ్చిస్తున్నట్లు గమనించవచ్చు. మునుముందు రోజుల్లో ఏఐ టూల్స్ కూడా ఓటీటీల మాదిరిగానే ప్రతి ఇంటా నిత్యావసర వ్యయంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సబ్‌స్క్రిప్షన్ పరిశ్రమ భారతదేశంలో భారీగా విస్తరిస్తోందని గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో వీడియో సబ్‌స్క్రిప్షన్లు ఇప్పటికే 200 మిలియన్ల మార్కును దాటగా.. పెయిడ్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్లు 2025 నాటికి 14 మిలియన్లకు చేరాయని క‌థ‌నాలొస్తున్నాయి. ఇవి 2028 నాటికి ఏకంగా 28 నుండి 30 మిలియన్లకు చేరవచ్చని ఈవై-ఐఎంఐ స‌ర్వే సంస్థ‌ అంచనా వేసింది. ఈ అంకెలు మన సమాజంలో డిజిటల్ సర్వీసులపై పెరుగుతున్న ఆధారపడటానికి .. సబ్‌స్క్రిప్షన్ ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా రూపుదిద్దుకుంటోందో చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు.

డిజిటల్ సేవలు ఒక్కొక్కటిగా చూస్తే అరచేతిలో ఇమిడిపోయే చిన్న చిన్న వ్యయాలుగానే కనిపిస్తాయి. కానీ ఓటీటీల నుంచి ఏఐ వరకు ప్రతి నెలా చెల్లించే సబ్‌స్క్రిప్షన్లన్నింటినీ కలుపుకుంటే అది మన వార్షిక బడ్జెట్‌లో ఒక పెద్ద మొత్తాన్ని హరిస్తోంది. అసలు ప్రశ్న ఏంటంటే? మ‌నం నిజంగా మనకు రోజూ అవసరమైన సేవలకే చెల్లిస్తున్నామా? లేక కేవలం తాత్కాలిక సౌకర్యం ఆకర్షణ కోసం ప్రతి నెలా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ను జోడించుకుంటూ పోతున్నామా? అనే దానిపై ప్రతి ఒక్కరూ స్వీయ సమీక్ష చేసుకోవాల్సిన సమయం వచ్చింది.

Tags:    

Similar News