భడే భాయ్ తో చోటే భాయ్ కి చెడిందా ?!
అయితే తాజాగా లండన్ పర్యటన తర్వాత అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించాడు.
‘నేను పదే పదే ఢిల్లీకి ఊరికెనే వెళ్లడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరపుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నాను. గత ప్రభుత్వం అనవసర భేషజాలకు పోయి, ఢిల్లీతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం మూలంగానే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. ఆ తప్పులు నేను చేయదలచు కోలేదు’. ఇప్పటి వరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో సంబంధాల విషయంలో వినిపిస్తున్న వాదన ఇది. అయితే తాజాగా లండన్ పర్యటన తర్వాత అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించాడు.
‘ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. కానీ భారత ప్రధానిగా వ్యవహరించడం లేదు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు ‘వైబ్రంట్ గుజరాత్ 2047’ కోసం అమెరికా, కెనడా దేశాల పర్యటనకు అనుమతి ఇచ్చారు. కానీ తెలంగాణ రైజింగ్ 2047 కోసం తనకు అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించారు. ఇది గుజరాత్ ఆధిపత్యం. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనుకూలంగా, ఇతర రాష్ట్రాలకు ప్రతికూలంగా కేంద్రం వివక్షచూయిస్తుంది అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇది నాకు వ్యక్తిగతంగా కాదు తెలంగాణకు జరిగిన అవమానం. నాలుగు కోట్ల మంది ప్రజలకు జరిగిన అవమానం, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్ర అని ఆరోపించారు.
అమెరికా పర్యటనకు అనుమతి రాకపోవడంతో లండన్ పర్యటన నుండి వెనక్కు వచ్చిన రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ విమర్శలతో విరుచుకుపడ్డాడు. తనకు అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వని అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని అన్నారు. అయితే ఇదే సమయంలో 2015లో మోడీ పాకిస్తాన్ లోని లాహోర్ వెళ్లినప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నాడు అన్న రేవంత్ రెడ్డి ప్రశ్న ఆసక్తికరంగా మారింది,
అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ ఆమ్దానీని కలవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్రానికి సమాచారం అందింది. అయితే పర్యటన షెడ్యూలులో ఈ విషయాలు వెల్లడించకపోవడం, ఈ నెల 27,28 తేదీలను ఖాళీగా వదిలేయడంతో కేంద్రం అనుమతిని నిరాకరించినట్లు అధికారులు చెబుతున్నారు.
హార్వర్డ్, ఎంఐటీ, నార్త్ ఈస్టర్న్, వర్జీనియా టెక్ వంటి విద్యా సంస్థలతో ఒప్పందాలు, పెట్టుబడులు, జాతీయ విద్యా విధానం లక్ష్యం కోసం పర్యటన ఉద్దేశం అని చెబుతున్నారని, ప్రతిపాదిత కార్యక్రమం హోదాకు, పర్యటన ఉద్దేశానికి తగినట్లుగా ఉండాలని, కానీ రేవంత్ రెడ్డి పర్యటన వివరాలు దానికి విరుద్దంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
అదే సమయంలో న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీని కలవాలి అనుకోవడం చర్చానీయాంశంగా మారింది. అతను పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్నాడని, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పలుమార్లు వ్యాఖ్యలు చేశాడని, అలాంటి వ్యక్తిని కలవడం వెనక ఉద్దేశం ఏంటని ప్రశ్నలు వస్తున్నాయి.
ఇక హైదరాబాద్ లో ఒక రోడ్డుకు ‘ట్రంప్ రోడ్’ అని పెట్టిన రేవంత్ రెడ్డి నేరుగా ట్రంప్ ను ఎందుకు కలవాలి అనుకుంటున్నాడు ? ఆ విషయం పర్యటన షెడ్యూలులో ప్రస్తావించకుండా ఎందుకు పక్కన పెట్టారు ? అన్న చర్చ జరుగుతుంది. తాము అన్ని వివరాలు స్పష్టంగా ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుండగా, వివరాలు స్పష్టంగా వెల్లడించకపోవడమే అనుమతి ఇవ్వకపోవడానికి కారణం అని కేంద్రం చెబుతుంది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందో వేచిచూడాలి.