ట్రాఫిక్ చలాన్స్ - ఫాస్ట్ ట్యాగ్ లింక్... ఇక వారికి చుక్కలే?
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి పెద్ద మొత్తంలో చలాన్‌లు విధిస్తున్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి పెద్ద మొత్తంలో చలాన్‌లు విధిస్తున్నారు. కానీ విధిస్తున్న చలాన్స్‌లో సగం కూడా వసూళ్లు కావడం లేదు. ట్రాఫిక్ చలాన్స్ వసూళ్లు చేయడానికి ప్రత్యేక డ్రైవ్స్‌ను నిర్వహించాల్సి వస్తుంది. రెండు మూడు ఏళ్లకు ఒకసారి పెద్ద మొత్తంలో డిసౌంట్స్ ఇస్తూ ట్రాఫిక్ చలాన్స్‌ను క్లీయర్ చేసుకోవాల్సిందిగా కూడా ఆఫర్లు ఇస్తున్నారు. మొత్తానికి ట్రాఫిక్ చలాన్లు అనేది పెద్ద సమస్యగా మారింది. టూవీలర్స్‌తో పాటు త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్ సైతం ట్రాఫిక్ చలాన్స్ ను కట్టకుండా తప్పించుకుంటున్నారని, కోట్ల కొద్ది పెండింగ్‌లో ఉన్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం వెతికే పనిలో అధికారులు ఉన్నారు. ఫోర్ వీలర్స్ పై ఉన్న ట్రాఫిక్ చలాన్స్ ను వసూళ్లు చేయడానికి ఫాస్ట్ ట్యాగ్ ఒకటి సరైన పద్దతి అని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ట్రాఫిక్ జాయింట్ సీపీ సున్‌ప్రీత్ సింగ్...
ఇటీవల సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సున్‌ప్రీత్ సింగ్ ఈ విషయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 20వ వార్షికోత్సవం సందర్భంగా సున్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు దేశవ్యాప్తంగా మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నాడు. చలాన్‌లు విధించడం ద్వారా ట్రాఫిక్ పై వాహణదారుల్లో మార్పు రావడం లేదు అన్నారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరూ రోడ్డు పై ప్రయాణించే సమయంలో బాధ్యత తో వ్యవహరించినప్పుడు మాత్రమే రవాణా వ్యవస్థ బాగుంటుంది అని ఆయన పేర్కొన్నాడు. హైదరాబాద్ నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా పెరిగిన ట్రాఫిక్ పై సున్‌ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
పెండింగ్ ట్రాఫిక్ చలాన్స్...
ట్రాఫిక్ చలాన్‌లను వాహనదారుల ఫాస్ట్‌టాగ్ అకౌంట్స్‌ను నుంచి కట్ చేసేందుకు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లుగా సున్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీతో చర్చిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. వారి నుంచి అనుకూల స్పందన వస్తే తప్పకుడా ఫాస్ట్ ట్యాగ్ నుంచి ట్రాఫిక్ చలాన్స్‌ను నేరుగా కట్ చేసే అవకాశాలు ఉంటాయని, అందుకు తగ్గట్లుగా ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్ కావాలని, అందుకు సమయం పడుతుందని అన్నారు. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారం కేవలం ప్రతిపాదన దశలో మాత్రమే ఉందని, కేంద్రం సైతం ఈ విషయమై పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఫాస్ట్‌ట్యాగ్‌తో ట్రాఫిక్ చలాన్స్ కు లింక్ చేస్తే కచ్చితంగా వాహనదారులు పెద్ద ఎత్తున ఆందోళన మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరించవచ్చు.
ఫాస్ట్‌ట్యాగ్ నుంచి చలాన్స్ వసూళ్లు..
ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ నుంచి అమౌంట్‌ను ట్రాఫిక్ చలాన్స్ కి కట్ చేస్తే టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావచ్చు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ట్రాఫిక్ చలాన్స్‌ను నేరుగా బ్యాంక్ ఖాతాల నుంచి కట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కొట్టి పారేసింది. వాహనదారుల బ్యాంక్ ఖాతాల నుంచి ట్రాఫిక్ చలాన్స్ కట్ చేయడం అనేది జరగని పని అని ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు. మొత్తానికి ట్రాఫిక్ చలాన్స్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలోనే కీలకమైన కఠినమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ చలాన్స్ ను కఠినంగా వసూళ్లు చేస్తేనే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల పట్ల సీరియస్‌గా ఉంటారు అనేది కొందరి మాట. ఈ విషయం ఎటు నుంచి ఎటు వెళ్తుందో కాలమే నిర్ణయించాలి.