కొడుక్కి సమస్య ఉందని ముందే తెలిసినా నన్ను బలిచేశారు : జోగి రమేష్ కోడలు మేఘన
మాజీ మంత్రి జోగి రమేశ్ తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని ఆయన కోడలు మేఘన ఆవేదన వ్యక్తం చేశారు
మాజీ మంత్రి జోగి రమేశ్ తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని ఆయన కోడలు మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ కలహాలపై మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పలు సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఎదురైన ఇబ్బందులకు సంబంధించి ఇప్పటికే పోలీసులకు ఆధారాలు అందజేశానని.. సరైన సమయంలో వాటిని బయటపెడతానని తెలిపారు.
‘అత్తమామలను సొంత తల్లిదండ్రులుగా భావించా’
జోగి రమేశ్ దంపతులను తాను సొంత అమ్మానాన్నలుగా భావించానని మేఘన చెప్పారు. అయితే తన భర్తకు ఉన్న సమస్యలు తెలిసినప్పటికీ తనకు వివాహం చేశారని ఆరోపించారు. తన అత్తగారు తనపై ప్రేమ చూపించారని చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు.
భార్యాభర్తల మధ్య సమస్యను పరిష్కరించకుండా వివాదాన్ని మరింత పెంచారని ఆరోపించారు. అదనపు కట్నం తీసుకొస్తేనే తాను సంతోషంగా ఉంటానని తన అత్త చెప్పినట్లు మేఘన పేర్కొన్నారు.
మతం విషయంలో దాచి పెట్టి పెళ్లి చేశారని ఆరోపణ
తన పుట్టింటి కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని వారు పూర్తిగా వ్యాపార కుటుంబమని మేఘన తెలిపారు. పెళ్లికి ముందు అత్తింటివారు తాము హిందువులమని చెప్పారని..వివాహం తర్వాత వారు క్రైస్తవులని తెలిసిందని ఆరోపించారు.
వారి మతాన్ని పాటించడం తప్పు కాదని అయితే ఆ విషయాన్ని దాచి పెట్టి వివాహం చేయడమే తన అభ్యంతరమని స్పష్టం చేశారు. తన అత్తగారు హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారని ఆరోపించారు. అత్తింట్లో బైబిల్ చదివినా తాను పెద్దగా పట్టించుకోలేదని.. అయితే ఇంట్లో పూజ గది కూడా లేదని చెప్పారు.
‘నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి’
తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని మేఘన వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ప్రతి ఆరోపణకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని.. ఇప్పటికే వాటిని పోలీసులకు అందజేశానని తెలిపారు. ఇప్పటివరకు బయటకు వచ్చిన వీడియోలు చాలా తక్కువేనని.. తనను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశారో తెలియజేసే మరిన్ని ఆధారాలను సరైన సమయంలో ప్రజల ముందుకు తీసుకొస్తానని చెప్పారు.
పలువురు రాజకీయ నేతలను కలిశామని వెల్లడి
తనకు న్యాయం చేయాలని కోరుతూ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను కలిసిన విషయం వాస్తవమేనని మేఘన తెలిపారు. ఆయన తన మేలు కోరి కొన్ని సూచనలు చేశారని.. సమస్యను పరిష్కరిస్తానని చెప్పారని వెల్లడించారు.
ఫిర్యాదు చేసేందుకు పోలీసు కమిషనర్ వద్దకు వెళ్లిన సమయంలో కేసు పెట్టకుండా తమ లాయర్ ద్వారా మధ్యవర్తిత్వం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద సమస్యను సెటిల్ చేసుకోవాలని సూచించారని తెలిపారు. రాజీ చేసుకోవాలని సజ్జల సూచించినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని మేఘన ఆరోపించారు. వైఎస్ జగన్‌ను కూడా కలిసేందుకు ప్రయత్నించామని.. అయితే అది సాధ్యం కాలేదని చెప్పారు.
‘పెళ్లైన రెండు నెలలకే కేసు వేశారు’
తన వివాహం జరిగిన రెండు నెలలకే రాజీవ్ తనపై ‘నల్ అండ్ వాయిడ్’ కేసు వేశారని మేఘన తెలిపారు. అదే సమయంలో విడాకుల కోసం కూడా కోర్టును ఆశ్రయించారని చెప్పారు. పెళ్లైన రెండు నెలలకే విడాకుల కోసం ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయం తనకు ఆలస్యంగా తెలిసిందన్నారు. విడాకుల కోసం రాజీవ్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని మేఘన పేర్కొన్నారు. తనను వదిలించుకునేందుకు అనేక కట్టుకథలు చెప్పారని ఆరోపించారు.
‘ఏడాదిన్నరగా క్షోభ అనుభవిస్తున్నాం’
తన భర్తకు చికిత్స చేయిస్తామని చెప్పి పుట్టింటికి వెళ్లమన్నారని మేఘన తెలిపారు. చికిత్స పేరుతో తాను అత్తింటికి అప్పుడప్పుడు వెళ్లేదానినని చెప్పారు. తమ తప్పు లేకపోయినా సుమారు ఏడాదిన్నరగా తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని మేఘన స్పష్టం చేశారు. కుటుంబ వివాదానికి సంబంధించిన తన ఆరోపణలు, ఆధారాలను సమయం వచ్చినప్పుడు పూర్తిగా బయటపెడతానని ఆమె తెలిపారు.