జనసేనలోకి విజయసాయిరెడ్డి....డేట్ కోసం వెయింటింగ్ ?
విజయసాయిరెడ్డి అంటే వైఎస్సార్ కుటుంబం మనిషి అన్నది అందరికీ నిన్నటి దాకా తెలిసిన మాట.
విజయసాయిరెడ్డి అంటే వైఎస్సార్ కుటుంబం మనిషి అన్నది అందరికీ నిన్నటి దాకా తెలిసిన మాట. ఆయన ఈ రోజు జగన్ కి రాజకీయ ప్రత్యర్ధిగా అవతరించాలని ఆరాటపడుతున్నారు. వైఎస్సార్ ఫ్యామిలీతో మూడు తరాలుగా అనుబంధం పెనవేసుకుని వారి ఇంటి మనిషిగా అత్యంత నమ్మకస్తుడిగా మెలిగిన విజయసాయిరెడ్డి ఈ విధంగా జగన్ కి ఎదురు నిలుస్తారని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. అదే రాజకీయం మరి. రాజకీయాల్లో బంధాలు అనుబంధాలు అన్నవి ఉండవని మరోసారి రుజువు అయింది. వైసీపీ ఆయనకు రెండు సార్లు రాజ్యసభ పదవి ఇచ్చింది. పార్టీలో కీలక స్థానం కల్పించింది. జగన్ తర్వాత ఆయనే అన్నంతగా వెలుగు వెలిగిన పార్టీని ఎందుకు ఆయన దూరం చేసుకున్నారో తెలియదు కానీ ఇపుడు జగన్ టార్గెట్ గా మరోసారి రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హాయిగా వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిన విజయసాయిరెడ్డికి అక్కడ ఏడాది వ్యవధిలోనే బోర్ కొట్టినట్లుగా ఉందేమో. కొత్త పార్టీ కొత్త రాజకీయం అంటూ ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా ఆయన ఆలోచనలు వేరేగా ఉన్నాయని చర్చ సాగుతోంది. ఆయన పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరుతారు అని గట్టిగా వినిపిస్తున్న మాట.
ట్విట్టర్ లో ఫుల్ యాక్టివ్ :
ఇదిలా ఉంటే ఈ మధ్య తరచుగా విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వస్తున్నారు. కొత్త పార్టీ పెడతాను అని కూడా చెబుతున్నారు. ఆయన ట్విట్టర్ అయితే మరో సారి ఫుల్ గా యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసింది. అంతే కాదు డైరెక్ట్ గా ఆయనే మీడియాకు తన ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి లీక్స్ ఇస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్లాలనుకున్నారు కానీ అక్కడ క్లియరెన్స్ లేదని కూడా హస్తిన రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. ఎందుకు అంటే వైసీపీలో నంబర్ టూ పొజిషన్ లో ఉన్నా కూడా ఆ పార్టీకి ఏకంగా కుచ్చు టోపీ పెట్టారని అక్కడ నుంచి ఆయనకు వచ్చిన జవాబుగా ఉందని అంటున్నారు. ఎంతగా బీజేపీ ఫిలాసఫీని వల్లించినా అలాగే వీర హిందూత్వగా తనను తాను కొత్తగా విజయసాయిరెడ్డి ప్రకటించుకున్నా కూడా ఆయనను బీజేపీలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరని అంటున్నారు.
ఫేస్ వాల్యూ ఏది బాసూ :
ఒక రాజకీయ పార్టీ పెట్టాలీ అంటే పెట్టే వారికి ఎంతో కొంత ఫేస్ వాల్యూ ఉండాలి. ఆయన్ని చూసుకునే జనాలు ఆ వైపు చూస్తారు విజయసాయిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో కనీసం ఎక్కడా గెలిచింది లేదు, ఆయన రెండు సార్లు రాజ్యసభకు వైఎస్ జగన్ పుణ్యమాని వెళ్ళగలిగారు. వైసీపీలో కీలక స్థానం దక్కింది అంటే జగన్ వల్లనే అని అంటారు. ఆయన వైసీపీ జనాలకు ఎక్కువగా, ఇతర రాజకీయ జనాలకు తక్కువగా మాత్రమే తెలిసిన వారుగా ఉంటారని అంటున్నారు. సగటు జనాలకు ఆయన అంటే ఎవరికీ తెలియదు అని కూడా అంటున్నారు. అలాంటి ఆయన తనను తాను ఎక్కువగా ఊహించుకుని పార్టీ సొంతంగా పెడతాను అని ముందుకు రావడం వర్తమాన రాజకీయ పరిస్థితి తెలియచేస్తున్నాయని సెటైర్లు వేస్తున్న వారూ ఉన్నారు. ఇక చూస్తే ఆయనకు ప్రత్యేకంగా ఫేస్ వాల్యూ ఏముంది అన్న ప్రశ్నలు కూడా అక్కడ వినిపిస్తున్నాయట.
టీడీపీలో నో చాన్స్ :
ఇక విజయసాయిరెడ్డి సొంత పార్టీ అని ఎందుకు అంటున్నారు అంటే బీజేపీ గురించి ఎంత పొగిడినా ఆయనను అక్కడ తీసుకునే ప్రశ్నే లేదని అంటున్నారు. ఇక టీడీపీలోకి ఆయన వెళ్ళాలని అనుకున్నా చంద్రబాబు అయితే ఆయనను తీసుకోవడానికి అసలు ఒప్పుకోరని అంటున్నారు. టీడీపీని చంద్రబాబుని ఆయన వైసీపీ వైపు నుంచి ఘాటుగా విమర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అనుకున్నా విజయసాయిరెడ్డిని తీసుకోవడం వల్ల కలిగే రాజకీయ లాభం ఆయనకు తప్ప టీడీపీకి ఏమి ఉంటుంది అన్నది కూడా పసుపు శిబిరం కచ్చితంగా ఆలోచిస్తుంది అని అంటున్నారు. అందుకే సైకిలెక్కేందుకు మాజీ వైసీపీ నేత ప్రయత్నం చేసినా అక్కడ నో చాన్స్ అనే అంటున్నారు.
మొదట్లోనే డోర్స్ క్లోజ్ :
ఈ విధంగా చూస్తే విజయసాయిరెడ్డి రాజకీయ ఉబలాటం ఆరాటం ఎక్కువగానే ఉన్నా వైసీపీని వీడి 20 నెలలకు పై దాటినా ఆయనకు రాజకీయ దారి మాత్రం కనిపించడం లేదు, నిజానికి ఆయన వైసీపీకి రాజీనామా చేసి తన రాజ్యసభ పదవిని వదిలేసుకున్న మరుక్షణం బీజేపీ ఆదరించి అక్కున చేర్చుకుంటుందని భావించారు. అలా ఆ పార్టీలో చేరి తాను వైసీపీ నుంచి వదిలేసిన ఆ ఎంపీ సీటు నుంచే మళ్ళీ పోటీ చేయవచ్చు హ్యాపీగా జాతీయ పార్టీ ఎంపీగా హవా చలాయించవచ్చు అని భావించారు అని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ బీజేపీ ఆయనను ఏ మాత్రం పట్టించుకోలేదు సరికదా ఆయన వదిలేసిన ఎంపీ పదవిని తమ పార్టీకి వీర విధేయుడు అయిన గోదావరి జిల్లాలకు చెందిన సీనియర్ నేతకు ఇప్పించుకుంది. దాంతో మొదట్లోనే విజయసాయిరెడ్డి వ్యూహాలకు బ్రేక్ పడిపోయింది అని అంటున్నారు.
కొత్త పార్టీ ఎందుకు మరి :
ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఆ మధ్య మీడియా ముందుకు వచ్చి వైసీపీ మీద జగన్ మీద కోటరీ మీద విమర్శలు చేయడం ద్వారా కొంత హడావుడి చేశారు. దాని వల్ల జగన్ వ్యతిరేక రాజకీయ శిబిరం తనను ఆదరిస్తుందని భావించారు అంటారు. అయితే ఆ వైపు నుంచి ఏ రకమైన రియాక్షన్ రాలేదు. దాంతో కొన్నాళ్ళు సొంత మీడియా హౌజ్ పెడతాను అని కూడా ప్రకటించారు. అయితే ఇపుడున్న కాంపిటేషన్ లో సొంత మీడియా పెట్టి దానికి టీఆర్పీ రేటింగ్ తీసుకుని రావడం నడపడం కష్టమే అని అంటున్నారు. పైగా అది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని అంటున్నారు. అంతే కాదు ఇప్పటికే ఉన్న మీడియా సంస్థలు అన్నీ నష్టాలతో సాగుతున్నాయని గుర్తు చేస్తున్నారు.
సామూహిక ఆత్మ హత్య ఇష్యూతో :
ఈ నేపథ్యంలో కొత్తగా ఒక ఇష్యూతో జనంలోకి రావాలని భావించిన విజయసాయిరెడ్డి నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఇష్యూతో మీడియా ముందుకు వచ్చారని అంటున్నారు. ఈ కేసుకు లవ్ జీహాదీ అంటూ మాట్లాడడమే కాకుండా జగన్ మీద హిందూ వ్యతిరేక ముద్ర వేసేలా ఘాటు విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి. ఆయన ఈ తరహా విమర్శలు చేయడం వెనక బీజేపీ కటాక్షం కోసమే అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఆయన కొత్త పార్టీ అని అంటున్నా జనసేన వైపు కూడా చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఆయనకు జనసేనలో ఉన్న ఒకనాటి వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాంతో ఆయనతో ఈ మధ్య విజయసాయిరెడ్డి మాట్లాడారు అని అంటున్నారు.
జనసేనలోకి రెడీనా :
తన పార్టీలోకి బాలినేనిని విజయసాయిరెడ్డి ఆహ్వానించినా ఆయన సున్నితంగా నో చెప్పారని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో జనసేనలోకి విజయసాయిరెడ్డిని బాలినేని ఆహ్వానించారు అని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి అక్కడ ప్రాధాన్యత ఉంటుందని చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. తాను రాయలసీమ నెల్లూరు, ప్రకాశం జిల్లాలను ఆ పార్టీ తరఫున చూస్తున్నాను అని ఆయన చెప్పారని అంటున్నారు. పవన్ తో ఈ విషయం ప్రస్తావించి ఓకే చేయిస్తామని హామీ ఇచ్చారని కూడా ప్రచారం అయితే సాగుతోంది. ఇక విజయసాయిరెడ్డి కూడా జనసేన ద్వారా బీజేపీకి అని ప్లాన్ బీ తో ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.
రాజకీయ అంచనాలు తప్పు:
బీజేపీకి దగ్గర కావాలనే వీర హిందూత్వగా విజయసాయిరెడ్డి ఒక్క సారిగా ఈ మధ్య మారిపోయారని కూడా అంటున్నారు. అయితే బీజేపీ ఆల్ రెడీ హిందూత్వ నినాదంతో ముందుకు సాగుతోంది. కొత్తగా విజయసాయిరెడ్డి నోటి వెంట ఆ మాట వింటే కమలం పార్టీ మురిసి ఆయనకు రెడ్ కార్పెట్ పరచేసే సీన్ ఉండదని అంటున్నారు. ఎందుకంటే ఈ మాజీ ఎంపీని తీసుకోవడం వల్ల ఏమిటి రాజకీయ లాభం అన్నదే ఏ పార్టీ అయినా కచ్చితంగా ఆలోచిస్తుంది అని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి వైసీపీని వీడి తప్పు చేశారా లేక ఆయన రాజకీయ అంచనాలు తప్పు అయ్యాయా తెలియదు కానీ భవిష్యత్తు మాత్రం అయోమయంగా ఉంది అని అంటున్నారు.