కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు..? కాంగ్రెస్ లో కుదుపు?
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అంతర్గత రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనం చోటుచేసుకుంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అంతర్గత రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనం చోటుచేసుకుంది. బీసీ సంక్షేమ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణా కమిటీ సంచలన నివేదిక సమర్పించింది. వీరిద్దరినీ వారి పదవుల నుంచి తక్షణమే తప్పించాలని కమిటీ టీపీసీసీకి సిఫార్సు చేసినట్లు సమాచారం.
పార్టీ ఇమేజ్‌కు విఘాతం
గత కొంతకాలంగా కొండా సురేఖ, చిన్నారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, వారి శైలి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీ ఇమేజ్‌కు ప్రజల్లో తీవ్ర నష్టం జరుగుతోందని క్రమశిక్షణా కమిటీ అభిప్రాయపడింది. సీనియర్ నాయకులుగా ఉండి బహిరంగంగా విమర్శలు చేయడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ వివాదంలో ముఖ్యంగా కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్లీ అవకాశం ఇస్తామని ప్రకటించడాన్ని కొండా కుటుంబం తప్పుపట్టింది. సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబంపై నేరుగా ఆరోపణలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్‌గా లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చేసిన ప్రకటనలు పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని కమిటీ భావించింది.
అలాగే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో ఆయనపై కూడా చర్యలకు సిఫార్సు చేసింది. ఇద్దరికీ గతంలోనే షోకాజ్ నోటీసులు జారీ చేసి.. వివరణలు తీసుకున్న తర్వాతే కమిటీ ఈ సమగ్ర నివేదికను రూపొందించింది.
హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ
ఈ నివేదికపై క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందిస్తూ పార్టీలో క్రమశిక్షణే అత్యంత ప్రధానమని స్పష్టం చేశారు. నాయకులు తమ అభిప్రాయాలను పీసీసీ అంతర్గత వేదికలపైనే చెప్పాలని.. రచ్చకెక్కితే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ఈ నివేదికను ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి పంపనున్నట్లు వెల్లడించారు.
ఇప్పుడు ఈ సీనియర్ నాయకుల పదవులపై కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.