టెర్రరిస్టులకు అమ్మేస్తానని సాధిక్ బెదిరించాడు: కంటతడి పెట్టిస్తున్న ఏఈ మనవడి వేదన
రాజమండ్రిలో చోటుచేసుకున్న అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబ తీవ్ర విషాదం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.
రాజమండ్రిలో చోటుచేసుకున్న అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబ తీవ్ర విషాదం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన పలువురు బలవన్మరణానికి పాల్పడటంతో ఆ ఇల్లు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషాదకర ఘటన వెనుక సాధిక్‌ఖాన్ అనే వ్యక్తి వేధింపులు, తీవ్రస్థాయి బెదిరింపులే ప్రధాన కారణమని తెలుస్తోంది. కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి.. పదేళ్ల చిన్న వయసులోనే అనాథగా మిగిలిపోయిన రియాన్ష్ కార్తికేయరెడ్డి పరిస్థితి ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.
రైఫిల్ షూటింగ్ కోచింగ్ సెంటర్‌లో తనకు పరిచయమైన సాధిక్‌ఖాన్.. ఆ తర్వాత తన తల్లికి కూడా పరిచయమయ్యాడని రియాన్ష్ తెలిపాడు. ఆ పరిచయమే తమ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపిందని ఆ బాలుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తన కళ్లముందే కుటుంబం ఛిన్నాభిన్నమైపోయిందని సాధిక్ తమ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేశాడని వాపోయాడు. మా నాన్నను చంపేశాడని.. అమ్మను చిత్రహింసలు పెట్టాడని చెబుతూ.. ఈ విషయాలు బయటకు చెబితే నన్ను టెర్రరిస్టులకు అమ్మేస్తానని బెదిరించాడని ఆ బాలుడు చెప్పిన మాటలు స్థానికులను తీవ్రంగా కలచివేశాయి. ఇప్పుడు తనకు ఎవరూ లేరని.. బయటకు వెళ్లాలన్నా భయంగా ఉందంటూ ఆ చిన్నారి పడుతున్న మానసిక వేదన ఎంతటి వారికైనా కడుపు కోతను మిగులుస్తోంది.
ఈ ఘోర ఘటనపై కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న చిన్నారి రియాన్ష్‌ను ఆయన జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఆ బాలుడికి తగినంత రక్షణ కల్పించడంతో పాటు అతడి చదువు, నూకరాజు కుటుంబానికి చెందిన ఆస్తుల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా చేపట్టాలని కోరారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సాధిక్‌ఖాన్ వేధింపులే ముఖ్య కారణమని ఆరోపించిన ఎంపీ.. బాధిత కుటుంబ ఆస్తులు.. బ్యాంకు ఖాతాల వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ఈ కేసును సీబీఐకి అప్పగించి లోతైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు సాధిక్‌ఖాన్ నుంచి ఎదురైన విపరీతమైన వేధింపులను తట్టుకోలేకే తాము ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య తమ సూసైడ్ నోట్‌లో స్పష్టంగా రాసి ఆధారాలు ఉంచారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే నిందితుడు సాధిక్‌ఖాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఉన్న అన్ని కోణాలను సమగ్రంగా దర్యాప్తు చేసి త్వరలోనే పూర్తి వాస్తవాలను వెలికితీస్తామని పోలీసులు వెల్లడించారు.
ఏం జరుగుతుందో సరిగ్గా అర్థం కాని చిన్న వయసులోనే కనులముందే కన్నవారిని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన రియాన్ష్ భవిష్యత్తు ఇప్పుడు సమాజం ముందు పెద్ద ప్రశ్నగా మారింది. నా అన్నవారు ఎవరూ లేని ఆ పదేళ్ల చిన్నారికి న్యాయం జరగాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలిచి అతడికి సురక్షితమైన ఉజ్జ్వల భవిష్యత్తును అందించాలని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు.