చంద్రబాబు డెసిషన్ కి జగన్ ఫస్ట్ టైం ఓకే !
అది వారసత్వంగా వచ్చిందా లేక అనేక ఇతర పరిణామాలు దోహదపడ్డాయా అన్నది తెలియదు కానీ బాబు వర్సెస్ జగన్ అన్నది ఏపీలో 2012లో మొదలైంది.
చంద్రబాబు జగన్ ల మధ్య ఉప్పు నిప్పులా రాజకీయం సాగుతూ ఉంటుంది. అది వారసత్వంగా వచ్చిందా లేక అనేక ఇతర పరిణామాలు దోహదపడ్డాయా అన్నది తెలియదు కానీ బాబు వర్సెస్ జగన్ అన్నది ఏపీలో 2012లో మొదలైంది. తొలిసారిగా అప్పట్లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ ఢీ కొట్టాయి. ఆ తరువాత 2014, 2019, 2024 ఎన్నికల కధ తెలిసిందే. ఆ విధంగా చెప్పాలంటే దశాబ్దన్నర కాలంగా ఈ ఇద్దరి మధ్య భీకరమైన రాజకీయ పోరు సాగుతూనే ఉంది. నిజానికి చంద్రబాబు వైఎస్సార్ సమకాలీనుడు. ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ మంత్రులు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. ఇద్దరూ చెరో పార్టీలో ఉండడంతో రాజకీయ వైరం అన్నది దశాబ్దాల పాటు సాగింది. అయితే వైఎస్సార్ చంద్రబాబు నేరుగా తలపడింది మాత్రం కేవలం ఒక దశాబ్ద కాలం అంటే ఆశ్చర్యంగా ఉంటుంది.
వైఎస్సార్ తో తక్కువే మరి :
వైఎస్సార్ 1998లో పీసీసీ చీఫ్ గా అయిన తరువాతనే చంద్రబాబు వైఎస్సార్ ల మధ్యన రాజకీయంగా ప్రత్యక్ష యుద్ధం స్టార్ట్ అయింది. అది 1999, 2004, 2009 ఎన్నికల దాకా సాగింది. వైఎస్సార్ జీవించి ఉంటే 2014లోనూ కంటిన్యూ అయ్యేది కానీ ఆయన మధ్యలోనే మరణించారు. ఇక జగన్ తో బాబు రాజకీయ యుద్ధం చూస్తే తండ్రి వైఎస్సార్ తో మించినదే అని చెప్పాలి. ఏకంగా మూడు సార్వత్రిక ఎన్నికలు మరో మూడు లోక్ సభ ఎన్నికలు, మూడు స్థానిక ఎన్నికలు మధ్యలో మినీ సమరం గా నిలిచే ఉప ఎన్నికలు ఇలా ఎన్నో రాజకీయ యుద్ధాలు ఇద్దరి మధ్యన సాగాయి. అంతకు మించి రాజకీయ ప్రత్యర్ధులను దాటి మరీ ఈ ఇద్దరి మధ్య పోరు సాగుతూండడమే విశేషం.
బాబు ఎస్ అంటే జగన్ నో :
నిజానికి ఏపీ రాజకీయాల్లో బాబు ఎస్ అంటే జగన్ నో అంటారు. అలాగే జగన్ ఎస్ అంటే బాబు నో అంటారు. అంతలా ఈ ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయని అంటారు. కానీ చిత్రంగా బాబు ఎస్ అన్న దానికి జగన్ కూడా ఎస్ అనడం. ఇది నిజం. అంతా ఆశ్చర్యపోవచ్చు కానీ జగన్ బాబు నిర్ణయం పట్ల సంతృప్తి చెందారు, ఒక విధంగా స్వాగతించారు కూడా. ఇందంతా ఎక్కడ జరిగింది అంటే వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ తమ పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో సమావేశంలో. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఏపీలో మేయర్ జెడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్ లకు ప్రత్యక్ష ఎన్నికలు జరగడం మంచిదే అని అన్నారు. ఇది ఒక విధంగా వైసీపీకి రాజకీయంగా లాభిస్తుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. మంచి అభ్యర్థిని నిలబెడితే గెలుపు ఖాయమని కూడా ఆయన నాయకులలో ఆత్మ విశ్వాసం కల్పించారు.
బాబు వ్యూహమేంటో కానీ :
ప్రత్యక్ష ఎన్నికలు కీలక పదవులకు నిర్వహించాలనుకోవడం వెనక చంద్రబాబు వ్యూహమేంటో తెలియదు కానీ వైసీపీ అయితే ఫుల్ ఖుషీగా ఉంది. జగన్ అయితే తమ పార్టీకి మేలు చేసే చర్యగా భావిస్తున్నారు. మరి అన్నీ తెలిసి వైసీపీకి ప్రయోజనం కలిగించే విధంగా బాబు డెసిషన్ తీసుకుంటారా అన్నదే పెద్ద సందేహం. బాబు మాస్టర్ ప్లాన్ ఎంటో ఎన్నికలు జరిగితే కానీ తెలియదు. వైసీపీ ఆశిస్తున్నట్లుగా ప్రత్యక్ష ఎన్నికలు ఆ పార్టీకి మేలు చేస్తాయా లేక బాబు మాస్టర్ ఫార్ములా టీడీపీ కూటమికి భారీ అడ్వాంటేజ్ అవుతుందా అన్నది అయితే ఎన్నికల ఫలితాలే చెప్పాల్సి ఉంది.