సినిమాలు, సీరియల్స్ చూస్తే మరణదండనే.. ఆ దేశం గురించి యూఎన్ రిపోర్టులో సంచలన విషయాలు..
చాలా దేశాలు వారి ప్రజలకు స్వేచ్ఛ ఇస్తే.. కొన్ని దేశాల్లో నిబంధనలు విధిస్తాయి. కానీ వీటన్నింటికీ విరుద్ధం నార్త్ కొరియా..;
గురజాడ సూక్తి ఒకటి ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.. ‘దేశ మంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’. దేశాన్ని పాలించే నాయకులు దీన్ని పాటించాలి. దేశం అంటే మట్టి కాదు.. మట్టిని పాలించడం కాదు.. అందులో ఉన్న ప్రజలను పాలించాలి. వారి కష్ట, సుఖాలు తెలుసుకోవాలి. చాలా దేశాలు వారి ప్రజలకు స్వేచ్ఛ ఇస్తే.. కొన్ని దేశాల్లో నిబంధనలు విధిస్తాయి. కానీ వీటన్నింటికీ విరుద్ధం నార్త్ కొరియా.. ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛ లేదు. బతకాలంటేనే నిత్యం నరకమే. నార్త్ కొరియాను పాలించే కిమ్ చండ శాషనుడు. ఆయన పాలనలో ఉత్తర కొరియా మరణశిక్షలు, అణచివేతలను ఎక్కువ చేస్తుందని ఐక్యరాజ్య సమితి ఆరోపించింది, విదేశీ సినిమాలు చూసినా, విదేశీ టీవీ నాటకాలను చూసినా లేదంటే షేర్ (పంపిణీ) చేసినా వారిని చంపినట్లు యూఎన్ రిపోర్టులో వెల్లడించింది.
పదేళ్లలో బాగా పెరిగిన ఆగడాలు..
పదేళ్ల కాలం నుంచి కిమ్ ఆగడాలు ఎక్కువయ్యాయని, అక్కడ వ్యక్తి గత స్వేచ్ఛ అంటూ లేదని, కఠినమైన ఆంక్షలతో ప్రజల జీవితం కఠినంగా మారిందని యూఎన్ మానవ హక్కుల కార్యాలయం కొత్త నివేదిక విడుదల చేసింది. 2015 నుంచి నార్త్ కొరియాలో ఆరు కొత్త చట్టాలు అమలవుతున్నాయి... అవన్నీ కూడా మరణశిక్షకు సంబంధించినవని రిపోర్టులో పేర్కొంది. అందులో సీరియల్స్ చూడటం, విదేశీ సినిమాలు, సీరియల్స్ ను చూడడం, షేర్ చేయడం కూడా మరణశిక్ష కిందకే వస్తుందని, మాదకద్రవ్య నేరాలకు సమానమైన శిక్షలు విధిస్తున్నారు. పౌరులకు భయం కలిగించాలని శిక్షలను బహిరంగంగా అమలు చేస్తున్నారని ఈ విషయాలను ఆ దేశం నుంచి వచ్చిన పౌరులు చెప్పారని రిపోర్టు వివరించింది.
ఇతర దేశాల కంటెంట్ కలిగి ఉంటే మరణ శిక్ష..
దక్షిణ కొరియాకు సంబంధించి మూవీ, సీరియల్ కంటెంట్ కలిగి ఉన్నాడని తన ముగ్గురు స్నేహితులను ఉరితీశారని 2023లో పారిపోయిన కాంగ్ గ్యురి అనే వ్యక్తి చెప్పిందని యూఎస్ రిపోర్టులో ఉంది. ‘ఇతర దేశాల కంటెంట్ కలిగి ఉండడం మాదకద్రవ్య నేరాల మాదిరిగానే పరిగణిస్తున్నారు’ అని ఆమె చెప్పారు. ఇక కొందరిని చేసిన ఇంటర్వ్యూలో నార్త్ కొరియాలో ఆకలి కష్టాలు పెరుగుతున్నాయని, రోజులో మూడు సార్లు భోజనం చేశామంటే వారిది విలాసమైన కుటుంబం అయి ఉంటుందన్నారు.
కొవిడ్ తో తీవ్ర ఆహార కష్టాలు..
కొవిడ్ ఆహార కొరతను తీవ్రతరం చేసింది. చైనాతో సరిహద్దులను మూసివేయడంలో దేశంలో ఆకలి కష్టాలు రోజు రోజుకు పెరగసాగాయి. బలవంతంగా పని చేయించుకోవడం కూడా దేశంలో పెరిగిపోయింది. అనాథ, వీధి పిల్లలతో సహా కార్మికులను ప్రమాదకరమైన మైనింగ్ ప్రాజెక్టులకు ప్రభుత్వం బలవంతంగా ఉపయోగించుకుంటుంది. అధిక పని ఒత్తిడితో కూడా అనేక మరణాలు సంభవిస్తున్నాయని దేశం నుంచి పారిపోయిన కొందరు చెప్పారు.
క్రూరమైన అనిచివేత
అత్యవసర చర్యలు తీసుకోకపోతే ఉత్తర కొరియన్లు ‘మరిన్ని బాధలు, క్రూరమైన అణచివేత, భయానికి గురవుతారు’ అని యూఎన్ మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ హెచ్చరించారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు సూచించాలని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది, అలాంటి చర్యకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం అవసరం. ఈ దశను ఉత్తర కొరియా మిత్ర దేశాలు, చైనా, రష్యా అడ్డుకునే అవకాశం ఉంది. విమర్శలు పెరుగుతుండడంతో కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల బీజింగ్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా నాయకుడు జిన్‌పింగ్‌తో కలిసి కనిపించాడు, రెండు శక్తులతో తన బలపడే సంబంధాలను నొక్కి చెప్పాడు.