చిన్న తప్పు.. నెల తర్వాత మరణం.. గుండెలను పిండేసే ఘటన..

తల్లిదండ్రులు అంటే తమ పిల్లలను క్రమశిక్షణ పెట్టాలి. ఇది సమాజానికి మేలు చేస్తుంది. కానీ అది ఎంత వరకు అన్న అవగాహన చాలా మందిలో కనిపించదు.;

Update: 2025-10-26 10:30 GMT

తల్లిదండ్రులు అంటే తమ పిల్లలను క్రమశిక్షణ పెట్టాలి. ఇది సమాజానికి మేలు చేస్తుంది. కానీ అది ఎంత వరకు అన్న అవగాహన చాలా మందిలో కనిపించదు. కొందరు పిల్లలు తల్లిదండ్రులు కొడతారన్న భయంతో జీవితం మీదకు వచ్చే ఇబ్బందులను కూడా చెప్పుకోరు. ఇందులో లింగ భేదం ఉండదు. చిన్నారి అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా.. ఒకటే. మనం సాధారణంగా వింటూనే ఉంటాం.. ఆడ పిల్లలు వారిపై జరిగే లైంగికదాడులను ఇంట్లో చెప్తే కొడతారని భయంతో చెప్పరు. దీంతో మానసికంగా కుంగిపోతారు. ఇక అబ్బాయిలు కూడా భయట జరిగే కొన్ని కొన్ని విషయాలు తల్లిదండ్రుల వద్ద దాస్తుంటారు. చిన్నారులను భయంలో పెట్టడం మంచిదా..? చెడ్డదా..? అన్న ప్రశ్న ఈ కథ మనకు చెప్తుంది. పిల్లలతో కలిసి ఉండండి.. వారితో కలిసి పిల్లల్లా మారండి అప్పుడే వారికి జరిగిన ప్రతి విషయం మీతో చెప్తారని చిల్డ్రన్స్ సైకాలజిస్టులు చెప్తున్నారు. అయినా తల్లిదండ్రుల్లో మార్పులు రావడం లేదు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల వద్ద నానమ్మలు, తాతయ్యలు ఉంటారు. కానీ అక్షరాస్యులైన న్యూక్లియర్ ఫ్యామిలీలో ఎవరు ఉంటారు..? పిల్లలను ఎవరు అర్థం చేసుకుంటారు. అభం శుభం తెలియని ఒక చిన్నారి కేవలం భయంతో ఒక విషయాన్ని దాటి చివరికి లోకం విడిచి పెట్టింది. ఈ కథ తల్లిదండ్రులకు గుణపాఠం అనే చెప్పాలి.

చిన్నారి ప్రాణం తీసిన భయం..

నిజామాబాద్ జిల్లా, బాల్కొండలో చోటుచేసుకున్న ఈ ఘటన ఒక చిన్నారి ప్రాణం మాత్రమే కాదు.. సమాజపు అవగాహన లోపాన్ని గుర్తు చేస్తుంది. గ్రామానికి చెందిన లక్షణ(10)ను నెల క్రితం వీధి కుక్క గీరింది. ఆ సమయంలో ఆమె తలకు చిన్నపాటి గాయమైంది. కానీ తల్లిదండ్రులు తిడతారన్న భయంతో ఆమె విషయాన్ని దాచి పెట్టింది. మొదట చిన్న గాయం అనుకొని తట్టుకుంది. కాలం గడుస్తున్నా కొద్దీ ఆ గాయం విషమంగా మారింది. కరిచిన కుక్కకు రేబిస్‌ ఉన్నట్టు తెలిసినప్పుడు అప్పటికే ఆలస్యమైంది. మూడు రోజుల క్రితం చిన్నారి ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. వింతగా మాట్లాడడం, కుక్కలా అరవడం.. నీరు చూసి భయపడటం వంటి రేబిస్‌ లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లగా.. అది రేబిస్ అని వైద్యులు నిర్ధారించారు. కానీ అప్పటికే వ్యాధి ముదిరింది. చివరికి ఆ చిన్నారి తల్లిదండ్రుల కళ్ల ముందే ప్రాణం విడిచింది.

తల్లిదండ్రుల లోపం కూడా కారణమా..?

ఇది వార్త విన్నవారిలో దుఃఖం మాత్రమే కాదు.. ఆవేదన కూడా కలిగిస్తోంది. ఎందుకంటే రేబిస్‌ వ్యాధికి సంబంధించి మంచి మందులు ఉన్నాయి. కుక్క కరిచిన వెంటనే రేబిస్ వ్యాక్సిన్‌ వేయిస్తే ప్రాణం కాపాడుకోవచ్చు ఇది వైద్యులు పదేపదే చెబుతున్న సత్యం. కానీ చిన్నారి తల్లిదండ్రులకు చెప్పకపోవడంతో వ్యాధి ముదిరి ప్రాణం కోల్పోయింది. కుక్క, పిల్లి, కోతి, గాడిద వంటి జంతువుల కాట్లు లేదా గీతలను వెంటనే గాయం నీటితో కడిగి, సబ్బుతో శుభ్రపరిచి, సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో రేబిస్ వ్యాక్సిన్‌ వేయించాలి. మొదటి 24 గంటల్లో టీకా వేయిస్తే వంద శాతం ప్రాణం రక్షించవచ్చు. కానీ నిజామాబాద్‌లో జరిగిన లక్షణ ఘటన ఆ సత్యాన్ని మళ్లీ మన కళ్ల ముందు ఉంచింది. సమాచారం లేకపోవడం, భయం, నిర్లక్ష్యం కలగలిపితే ఎంత దారుణంగా మారుతుందన్నది తెలిసింది. ఇలాంటి ప్రమాదాల గురించి చిన్నారుల్లో అవగాహన కల్పించాలి. గాయపడితే భయపడి దాచిపెట్టకుండా మన ఇళ్లలో వాతావరణం ఉందా..? అని చూసుకోవాలి. ఇది కేవలం వైద్యం గురించి అవగాహన లోపం కాదు. అది కుటుంబం పిల్లలతో అన్ని విషయాలు పంచుకోకపోవడం పిల్లలకు చిన్న నాటి నుంచి ‘ఏమైనా జరిగితే వెంటనే చెప్పాలి’ అనే నమ్మకం కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

భారత్ లో ఏటా పెరుగుతున్న రేబిస్ మరణాలు..

రేబిస్‌ భారత్‌లో ప్రతి ఏటా వేలాది మంది ప్రాణాలు తీస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా రేబిస్‌ కేసుల్లో సగం భారతదేశం నుంచే నమోదవుతున్నాయి. ఇది మన ఆరోగ్య వ్యవస్థలోనే కాకుండా, సామాజిక ఆలోచనలో కూడా ఉన్న లోటును చూపిస్తోంది. చిన్నారి లక్షణ మరణం మన కళ్ల ముందే ఒక నిజాన్ని ఉంచింది. ఒక టీకా, ఒక మాట, ఒక జాగ్రత్త జీవితం కాపాడగలదు. కానీ మనం వీటిని విస్మరిస్తున్నాం.. ఈ ఘటనకు బాధ్యులెవరూ లేరు. తల్లిదండ్రులు తమ పపను తిడతామని అనుకోని ఉండరు.. చిన్నారి తన గాయాన్ని ప్రమాదమని భావించకపోవచ్చు.. కానీ ఈ నిర్లక్ష్యం ఒక చిన్న ప్రాణం తీసింది. కుటుంబానికి ఆవేదన మిగిల్చింది.

గ్రామీణ ప్రాంతాల్లో రేబిస్ అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించాలి. ప్రతి పాఠశాలలో, ప్రతి ఆరోగ్య కేంద్రంలో ‘కుక్క కరిస్తే ఏం చేయాలి’ అనే విషయం చిన్నారులకు, వీలైతే తల్లిదండ్రులకు కూడా వివరించాలి. ఎందుకంటే, ఒక చిన్నారి భయం వల్ల చనిపోకూడదు. అది వైద్యపరమైన అపజయం కాదు.. మానవతా వైఫల్యం.

Tags:    

Similar News