సోష‌ల్ మీడియాతో 2.5ల‌క్ష‌ల సంపాద‌న‌ అంతా డొనేష‌న్ల‌కే.. గ‌డ్క‌రీ ది గ్రేట్!

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కేవలం మౌలిక సదుపాయాల కల్పనలోనే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

Update: 2026-05-22 10:20 GMT

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కేవలం మౌలిక సదుపాయాల కల్పనలోనే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల ద్వారా తనకు ప్రతి నెలా సుమారు రూ.2,50,000 ఆదాయం వస్తోందని వెల్లడించారు. ఈ సంపాదన మొత్తాన్ని ఆయన తన వ్యక్తిగత అవసరాలకు వాడుకోకుండా..తన తల్లి జ్ఞాపకార్థం నడుస్తున్న ఒక క్యాన్సర్ నిర్ధారణ కేంద్రానికి పూర్తిగా విరాళంగా అందజేస్తున్నారు. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉంటూ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇలా సమాజ శ్రేయస్సు కోసం కేటాయించడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

ప్రస్తుత రోజుల్లో సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే సంపాదనను ఇలా సామాజిక సేవా కార్యక్రమాలకు డొనేట్ చేయడం అనేది సమాజంలో ఎందరికో స్ఫూర్తివంతంగా నిలుస్తుంది. భారతదేశంలో రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా పోస్టింగులు, యూట్యూబ్ వీడియోలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా ప్రతి నెలా లక్షల రూపాయిలను సులభంగా ఆర్జిస్తున్నారు. అయితే అలా వచ్చిన సంపాదనతో చాలామంది తమ లగ్జరీ లైఫ్‌ను, విలాసవంతమైన జీవనశైలిని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారే తప్ప సమాజంలో వెనుకబడిన వర్గాల కోసం లేదా ఏదైనా `సోషల్ కాజ్` (సామాజిక కారణం) కోసం కొంతైనా(చాలా చిన్న మొత్త‌మైనా) కేటాయించడం లేదు. అలాంటి వారందరికీ నితిన్ గడ్కరీ ఒక కనువిప్పు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

దేశ ఆర్థిక ప్రగతిని వేగవంతం చేసే లక్ష్యంతో రానున్న నెలల్లో గడ్కరీ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ పలు టాప్ 5 ప్రతిష్టాత్మక కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వేల విస్తరణ, రవాణా ఖర్చులను తగ్గించే లాజిస్టిక్స్ పార్కుల నిర్మాణం, ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించే సరికొత్త ఎలివేటెడ్ కారిడార్ల ప్రారంభం వంటి కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ భారీ ప్రాజెక్టులు దేశ రవాణా రంగానికి సరికొత్త దిశను చూపించనున్నాయి.

ఏపీకి గ‌డ్క‌రీ సేవ‌లు అన‌న్య సామాన్యం:

రానున్న నెలల్లో గడ్కరీ ప్రారంభించనున్న టాప్ 5 కొత్త ప్రాజెక్టుల గురించి ప‌రిశీలిస్తే.. టాప్ 5 జాతీయ రహదారుల ప్రాజెక్టులలో బెంగళూరు - విజయవాడ గ్రీన్-ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, రాయ్‌పూర్ - విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అత్యంత కీలకమైనవి. ఈ రెండు భారీ ప్రాజెక్టులు వివిధ రాష్ట్రాలతో కనెక్టివిటీని పెంచడమే కాకుండా.. ప్రయాణ సమయాన్ని .. సరుకు రవాణా ఖర్చులను సగానికి పైగా తగ్గించనున్నాయి. వీటితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా మారనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కనెక్టివిటీ హైవే (ఎన్‌.హెచ్‌-16 విస్తరణ) కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది.

మరోవైపు విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రధాన వంతెనతో కూడిన విజయవాడ ఈస్టర్న్ బైపాస్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. దీనితో పాటు రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో శ్రీ సత్యసాయి - అనంతపురం జిల్లాల అనుసంధాన రహదారుల విస్తరణ ప్రాజెక్టులను కూడా రానున్న నెలల్లో నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. ఈ ఐదు ప్రతిష్టాత్మక మౌలిక వసతుల ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లాజిస్టిక్స్ రంగానికి సరికొత్త ఉత్తేజం లభించడమే కాకుండా... పోర్టు ఆధారిత పరిశ్రమల విస్తరణకు.. ఉపాధి అవకాశాల కల్పనకు ఇవి ఎంతగానో దోహదపడనున్నాయి.

Tags:    

Similar News